Take a fresh look at your lifestyle.

‘‘‌తుపాకులున్నయి’’

“గుజరాత్‌ ‌నుండచ్చిన మహాత్ముడు దేశం బాగుపడాలన్నడు. విదేశ వస్తు బహిష్కరించాలన్నడు. ఆయన పాణంతోనుంటె తిప్పలని ఆయనను సాగనంపిండ్లు. మల్లదే గుజరాత్‌ ‌రాజ్జం నుండచ్చినోళ్ళు దేశాన్ని ముక్కలు ముక్కలు కోషి విదేశాలకు అమ్మవట్టిండ్లు. మనదేశంల పెట్టుబడులు బెట్టుడంటే అర్ధ వలసరాజ్యంగా దేశాన్ని పరాయోళ్ళకాళ్ళ కాడ బెట్టుడే! ఇదేంది! గిట్లెందుకు జేత్తాండ్లని అడిగినా! ఉత్తరం ముక్క రాషినా దేశద్రోహి అని ముద్రేసుడే! జైళ్ళు నింపుడే!”

yelamandha article prajatantra

‘‘సర్కార్‌ ఎట్ల జెప్తె గట్ల జనం ఇనాలె! ఇనకుంటె, ఇనెటట్టు జేత్తం. మా కాడ తుపాకులున్నయి, గవే ఇనెటట్టుజేత్తయి’’అని ఖుల్లా చెప్పే సాములిప్పుడు రాజ్జాలేలుతాండ్లు.గిట్లసొంటోళ్ళు ఏలికలయితే రాజ్జానికి పట్టే దశ యెట్లుంటదో కానత్తనే వున్నది. ఓట్లేయకుంటె ఆడోళ్ళను ఆగం జేత్తమంటరు.ఇంకోకాడ దళితబతుకులు దినదిన గండం నూరేళ్ళాయిశ్షు! తీరింగనే కొడ్తాంది. నాలుక్కాళ్ళ పశువు దేవతైన కాడ రొండు కాళ్ళ మనిషి బతుకు కష్టమైతాండె! మతం బూషి సూపి గరీబోళ్ళ బతుకులను పాణంవుండంగనే బుగ్గి జేషి సంబురపడే వానరాలు రాజ్జెంల బలం గున్నయి.ఈ సాలు జమాకర్సు లెక్కలు ఇన్నంక దేశం మొత్తానికి కొత్త సంగతులు కానచ్చిందనుకుంట.దేశాన్నేలే గీ సాములు బయిటికి కానచ్చిన తీరిగె లోపల సూతవుంటరని అనుకుంటం.అదంత వొట్టిదే! తీరొక్క ముళ్ళెలు కట్టే కాయిష్‌ ‌వుంటది,గని పైకేలి ‘‘ఏక్‌ ‌నిరంజన్‌’’ ‌తీరిగ్గానడ్తరు .‘‘బాబూ చాయి పీవోరే! అచ్చా చాయిపీవోరే!’’ అనే చాయివాలా తీర్గె ఫోజులిత్తరు సూత!భూమ్మీది కన్నమొగులు మీదనే ఎక్కువకాలం తిరిగే భోగాల మీద మన్సున్నగిసోంటి సాములు ఏలికలైనంక దేశం రంగు,రుచి,వాసనలు మొత్తం మారే కతలు పడకుంట ఊకుంటదా! అచ్చేటియన్ని ‘‘అచ్చేదిన్‌’’అం‌టరు గని గరీబోళ్ళు‘‘సచ్చేదిన్‌’’ ‌కాడికి తెచ్చే సంక్షేమపథకాలకు కొత్త కొత్త పేర్లుంటయి గని వాటి లోపల పాత యవ్వారాలే సింగారించుకొనుంటయి.‘‘మనుసుల వున్నది చెప్పాలనున్నది’’.అనేదిపాతపాట.‘‘మనుసుల ఉన్నది చెయ్యాలనున్నది’’అనేదే ఇప్పుడు సాముల సంఘ పరివారం పాట. ‘‘అచ్చేదిన్‌’’ ‌తేవాల్నంటె అధికారం కావాలె! అండ్ల సూతమెజారిటీ వుండాలె మరి గివన్ని కావల్సిన దానికంటె ఎక్కువ వుండనే వుండె.

ఏండ్ల సంది జప్పున జేసుకుంట పోవుట్ల అడ్డమేమున్నది. ‘‘అచ్చేదిన్‌’’ఎవలికి? ‘‘సచ్చేదిన్‌’’ ఎవలికి మోపయితానయో కండ్లకు కానత్తనేవుండె. ఏండ్ల సంది తుపాకుల కాపలాల గుబులుగుబులుగున్న కాశ్మీర్‌ను ఆయింత బతుకులేకుంట ముక్కలుజేత్తిరి. మతం రంగుబూషి అందాలకాశ్మీరును ఆగం జేత్తిరి. మంది బలం జూసుకోని కాశ్మీరును కార్పొరేట్‌ ‌కంపెనీలకు పలారం పంచినట్టు పంచిపెట్టాలనుకున్నరు. సర్కార్‌ ‌కంపిన్లను పిడాత సంపి బొందబెట్టాలనుకున్నరు.అనుకున్నయన్ని అచ్చరాల కానిత్తనే వుండె! ఆఖరికి బీమా సంస్థను.సూత అర్సుకునే పనిలబడ్డరు.జంబూ దీపకల్పాన్ని అఖండ హిందూదేశంగా మార్చే పనిల ముందటడుగు కోసమే పౌరసత్వం బిల్లు మలుజేద్దామనుకున్నరు.సర్వ సత్తాక లౌకిక రాజ్యంల రాజ్యాంగాన్ని మంట్లె కలుపబడ్తిరి.పబ్లిక్‌ ‌రంగాన్ని దివాలు దీయుంచుడు,ప్రయివేట్‌ ‌రంగానికి అడిగినయి,అడగనియి మస్త్ ఇచ్చి అలాయి బలాయి జేసుకునుట్ల దేశం దరిద్రం గొడ్తాందని ‘‘నీతి ఆయోగ్‌’’ ‌నెత్తీ నోరు కొట్టుకోవట్టె! సర్కార్‌ ‌దుకాణం సల్లవడ్డదని జెప్పకుంటనే, బడ్జెట్ల లచ్చల కోట్ల రూపాల కోతలు పెట్టే యవారం మోపయింది. గిట్లెజేత్తె బతుకులల్ల ఎక్కువ తక్కువలు పెద్దగయికొత్త తిప్పలింకెక్కువ మోపయితయి. జమాకర్సుల బడ్జెట్‌ ‌జాతరెప్పుడచ్చినా ముల్లెలుగట్టే పెట్టుబడిదారోళ్ళకే సంబురాలు మిగులుతయి.అంకెలెంతగనం గిరగిర తిరిగినాసూత గరీబోళ్ళ ఆశలు మాత్రం ఏడున్నయో గాడనే కూలవడుంటయి! గీ ముచ్చట యెరుకయినంక సూత యేడాదికోపాలి ‘‘ఎర్ర సంచి’’ మీద ఎడ్డి ఆశలసలు సావకుండుంటయి.కూడుడూ,తీసేసుట్ల కత చాంతాడంత సూపెడుతరు.ఆమ్దానీ వత్తాందంటరు,పోతాందంటరు, పంచినమంటరు.వృద్ధి మొగులెక్కిందంటరు.లచ్చ ముచ్చట్లుంటయి,చెప్పినయన్ని షెప్పినట్టేవుంటయి,కానత్తయనుకుంటె కండ్లండ్ల కాయలుగాషి పండ్లగుడే తప్ప యేవుండదు.

ఎలక్షన్ల ఎన్ని మాటలు జెప్పినా సూత గెలిషినంక ఏలికల తీరు మారకుంట వుంటదా!ఆ గెలుపు సూత సక్కంగుంటదా!అంటె అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ జేసుడే! గీ మద్దె ఎలచ్చన్ల ప్రచారంల ఓట్లేయని మహిళలపై లైంగిక దాడులు జరుగుతాయంటూ పరివార్‌ ‌పూవు గుర్తు నేతలు తమ ప్రచారంల బెదిరిచ్చే కాడికచ్చింది.సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆడోళ్ళ మీద హింసకు పాల్పడాలని, గాయ్‌,‌గాయ్‌ ‌చేయాలని తమ పరివారజనానికి పనప్పజెప్పబట్టె. ఏలికలే జనం మీద గిట్ల అక్కసు జూపితె ఎట్ల!? ఏలికలై ఉండి ఇసమాసొంటి కతలువడుతాంటె బతుకులుంటయా? గిట్లసొంటియి మోపయితె రాజ్జెంల అన్ని వర్గాల ఆడోళ్ళు గుబులు పడరా! సదువుకునే పోరళ్ళతోని సర్కార్‌ ‌భయపడ్తాందంటె జనాలను నాశనం జేషే కతలు పడ్తానట్టే లెక్క జామియా మిళియా,జే.ఎన్యూల చదువుకునే పోరళ్ళ మీద కత్తులు నూరుతున్న సంఘపరివారం అక్కడి పోరళ్ళ నెత్తుటి కండ్ల జూషింది. రొండు దేశాలకు చెందిన ఆరు మతాలోళ్ళ కోసం మతం లెక్కన దేశాన్ని ఆగంజేసుడు కోసమే పౌరసత్వపు బిల్లు తెచ్చెదేశమంత రోడ్డెక్కి ఆగమాగం గావాలె! గీ లొల్లిల దోసుకోని ముల్లెగట్టే బడా కార్పోరేట్ల కాళ్ళొత్తే సేవ జేసుకోవాలె! ఆఖరికి ‘‘జీవిత బీమా’’ సంగతి కూడ ఒడిషిపోయింది.

గుజరాత్‌ ‌నుండచ్చిన మహాత్ముడు దేశం బాగుపడాలన్నడు. విదేశ వస్తు బహిష్కరించాలన్నడు.ఆయన పాణంతోనుంటె తిప్పలని ఆయనను సాగనంపిండ్లు. మల్లదే గుజరాత్‌ ‌రాజ్జం నుండచ్చినోళ్ళు దేశాన్ని ముక్కలు ముక్కలు కోషి విదేశాలకు అమ్మవట్టిండ్లు. మనదేశంల పెట్టుబడులు బెట్టుడంటే అర్ధ వలసరాజ్యంగా దేశాన్ని పరాయోళ్ళకాళ్ళ కాడ బెట్టుడే! ఇదేంది! గిట్లెందుకు జేత్తాండ్లని అడిగినా! ఉత్తరం ముక్క రాషినా దేశద్రోహి అని ముద్రేసుడే! జైళ్ళు నింపుడే! దేశాన్ని ఏలేది సంఘపరివారమనే జనం అనుకోవట్టిండ్లు గని గివీళ్ళు తోలుబొమ్మలాటల బొమ్మలే! ఆడిచ్చే కార్పోరేట్‌ ఆసాములే అసలు సిసలు ఏలికలు! ఏ చట్టం జేషిన వాళ్ళకోసమే గని జనం కోసం కాదని ఎరుకైతనే వుండె! జమాకర్సు లెక్కలెన్నేషినా గరీబోని వూసు లేదు,ఉపాధి ఉద్యోగాల జాడ లేదు.చిన్న నౌకరోల్ల ఆమ్దానీ మీద పన్నుగుంజే కొత్త ఉపాయాలే తప్ప ఏం లేదు. హిమాచల్‌‌ప్రదేశ్‌ అక్క పార్లమెంట్‌ల కడిగి జాడిచ్చి ఇషిపెట్టిందా! ఇప్లవ ఠాకూరని పేరు నిలవెట్టుకున్నది. దేశంలున్న జనమంత ఇప్లవ ఠాకూర్లైతె తప్ప ఏలికలు దారికచ్చేటట్టులేరు. సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్‌లి ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా ‘‘ ఓట్లేయకుంటె ఆడోళ్ళను ఆగమాగం జేత్తం! చెప్పినట్టినకుంటెతుపాకులకు పని జెపుతం అని బెదిరిచ్చేటోళ్ళను ఏమని పిలువాలె? అచ్చేదిన్‌ ‌తేకుంటె మాయెగని కనీసం బతికేదిన్‌ ‌వుండెటట్టుజూడు మని అడిగేటోళ్ళను ఏమని పిలువాలె? దేశభక్తులెవలు?దేశద్రోహులెవలు? జవాబు తెలిషికూడ జెప్పకుంటె నాకాడో తుపాకీ , దాంట్లె గుండ్లున్నయి? జర పైలం! అని ఫలానా ముఖ్యమంత్రి తీరిగె బెదిరిచ్చిన భేతాళ్‌ ‌ను భుజానేసుకొని ‘‘భేతాళ్‌!ఇను! పాలకులకు పాలితులంటే ఏర్పడని భయం కలుగుతె వాళ్ళ పాలనపై జనానికి నమ్మిక పోయిందని మంచి మాటలతోని పనికాదని తుపాకులకు పని జెప్పేకాడికత్తరు. ఏలికలకు ఎదురు తిరిగి వాళ్ళతప్పులు జూపితె ‘‘దేశద్రోహులు’’ అనే ప్రచారం జేత్తరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు దేశభక్తులనే ముద్ర ఏసుకోనే వుంటరు,మనం నమ్మి ఓట్లేత్తానం గాబట్టి! ‘‘అని మనుసులనుకుంట ,ఆలోచించుకుంట ఎప్పటి లాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు
– ఎలమంద, తెలంగాణ

Leave A Reply

Your email address will not be published.