- పార్టీ నాయకత్వం నిశ్శబ్దంలో ఉంచింది
- స్టేట్ బిజెపి లీడర్‌షిప్‌పై రాములమ్మ అసంతృప్తి
- రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలన్న విజయశాంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : చూడబోతే రాష్ట్రంలోని కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల మాదిరిగానే బిజెపి పార్టీలోనూ అసంతృప్తి ఉన్నట్లే కనబడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఇట్టే కలిసిపోయే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ…పార్టీ రాష్ట్ర నాయకత్వం తన పట్ల చూపుతున్న ఓ విధమైన అలసత్వమో, నిర్లక్ష్యమో మొత్తానికి తెలియదు కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తనకున్న ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర లీడర్‌షిప్‌పై తన మనసులో ఉన్న బాధను, అసంతృప్తిని కుండబద్దలుకొట్టారు. వివరాల్లోకి వెళ్లితే…గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ ప్రసంగం కాగానే కార్యక్రమాన్ని ముగించారు. పాపన్నగౌడ్ జయంతిలో పాల్గొన్న విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తి కట్టలు తెచ్చుకోవడానికి కారణంగా తెలుస్తుంది. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనను మాట్లాడనివ్వకుండా సభను ముగించడం పట్ల ఆమె తనదైనశైలిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాములమ్మ ఇంకా ఏమన్నారంటే…నన్నెందుకు మాట్లాడనివ్వలేదో నాకు తెలియదు. నేను అసంతృప్తిగా ఉన్నానో, లేనో పార్టీ నేతలు క్లారిటీ ఇస్తారన్నారు. నన్నెందుకు సైలెంట్‌గా పెట్టారో పార్టీ నాయకులు బండి సంజయ్, లక్ష్మణ్‌ను అడగండన్నారు. కొరోనాతో గత నెల రోజులు మాత్రమే పార్టీకి దూరంగా ఉన్నాననీ అన్నారు. పార్టీ తనకు అప్పగించిన పనిని చేసేందుకు ఎప్పుడూ సిద్దమేననీ అన్నారు. అయితే, పార్టీ నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందనీ, మాట్లడటానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో వారినే అడగండగన్నారు. నా గొంతు నొక్కేస్తున్నారనీ రాములమ్మ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారో, ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌కు తెలియాలి, వారినే అడగండగన్నారు. ఒకరిద్దరితో పనులు జరగవనీ, ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలనీ, పార్టీలో ఏ పదవీ ఇచ్చినా స్వీకరిస్తాననీ విజయశాంతి అన్నారు. నా పోటీపై పార్టీల నేతల వద్ద స్పష్టత తీసుకోవాలని, మాట్లాడకుండా ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో వారి(బండి, లక్ష్మణ్)ని అడగాలంటూ రాములమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కోసం కమిట్‌మెంటుతో పని చేసే రాములమ్మ నోటి వెంట వచ్చిన ఈ వ్యాఖ్యలు ఆమె మనసులోని ఒకింత బాధ, పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా..రాములమ్మ చేసిన ఈ వ్యాఖ్యలతో బిజెపి పార్టీలోనూ అసంతృప్తులు, అంతర్గత విబేధాలు, వర్గపోరు, ఆధిపత్యపోరు, గ్రూపులు బాగానే ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే, పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.