Take a fresh look at your lifestyle.

గజ్వేల్‌లో గర్జించిన కాంగ్రెస్‌

  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • గజ్వేల్‌ ‌సభ గ్రాండ్‌ ‌సక్సెస్‌
  • ‌కాంగ్రెస్‌లో ఫుల్‌ ‌జోష్‌
  • కేసీఆర్‌ ఏడున్నర ఏళ్ల పాలన వైఫల్యాలపై చార్జిషీటు

దూకుడుగా ఉన్న తెలంగాణ  కాంగ్రెస్‌ ‌పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌వేదికగా భారీ దండోరా సభను నిర్వహించారు. గజ్వేల్‌లోని వర్గల్‌ ‌రూట్‌లో ఏర్పాటు చేసిన సభకు ఇసుకేస్తే రాలనంతగా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చిన సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు గర్జించారు. ‘గజ్వేల్‌ ‌నుండే గర్జిద్దాం…గులాబీ గుండెల్లో కాంగ్రెస్‌ ‌జెండా పాతేద్దాం’, ‘ఇప్పటి దాకా ఒకెత్తు-ఇది ఒక్కటి ఒకెత్తు, పట్టు వీడవద్దు-పోరాటం మరవవద్దు’, ‘గజ్వేల్‌ ‌గడ్డపై దండోరా…దొర గుండెల్లో దడరా’, ‘వార్డుకు తొమ్మిది మంది…ఒక్క చోట చేరితే..ఒక్కటై కదిలితే.. అది కాంగ్రెస్‌ అవుతుంది…’, కాంగ్రెస్‌ ‌సైనికులారా సిద్ధంకండి-గజ్వేల్‌ ‌గడ్డమీద కాంగ్రెస్‌ ‌జెండా పాతుదాం’,  ‘కాంగ్రెస్‌ ‌సైనికుడా రా…కదలి రా..! అంటూ నినాదాలు చేస్తూ ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

సిఎం కేసీఆర్‌ ‌దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి దీక్ష విజయవంతం కావడంతో ఈసారి ఏకంగా సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే దండోరా సభను ఏర్పాటు చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకత్వం సిఎం కేసీఆర్‌ ‌పాలనా వైఫల్యాలు, రాజకీయ బలహీనతలను ఎండగట్టాడానికి…తెలంగాణ విమోచన దినం సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను ఏర్పాటు చేసింది. బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల్లో రేవంత్‌ ‌రెడ్డి ద్విముఖ వ్యూహం అమలు చేస్తూ అధికార పార్టీకి ఇరుకున పెడుతున్నారు. ఓ వైపు ‘దళితబంధు’ను స్వాగతిస్తూనే, మరోవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తేలా ప్రసంగాలు చేస్తున్నారు.

ఇంద్రవెల్లి, రావిల్యాల దండోరాలు విజయవంతం కావడంతో అదే జోష్‌లో గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా నిర్వహించాలని పిసిసి నిర్ణయించుకుని ఏర్పాటు చేసి ఏడున్నరేళ్లలో టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌చేపట్టిన దళిత, గిరిజన వ్యతిరేక కార్యక్రమాలపై కాంగ్రెస్‌ ‌నేతలందరూ గర్జించారు. గజ్వేల్‌ ‌సభకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్‌, ఏఐసిసి, టిపిసిసి సీనియర్లు నేతలు హాజరయ్యారు. గజ్వేల్‌ ‌సభలో సిఎం కేసీఆర్‌ ‌పాలనా వైఫల్యాలకు సంబంధించి చార్జిషీట్‌ను పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టారు. ఈ చార్జిషీట్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వైఫల్యాలను వెల్లడించారు. గజ్వేల్‌ ‌దండోరా సభకు భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జెట్టి గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు అనుకున్నదానికంటే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్‌ ‌పార్టీ తన సత్తా, బలం చాటింది. మొత్తంగా గజ్వేల్‌ ‌సభ సక్సెస్‌ ‌కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫుల్‌ ‌జోష్‌లో ఉన్నారు. పార్టీ నాయకత్వం కూడా గజ్వేల్‌ ‌సభ గ్రాండ్‌ ‌సక్సెస్‌ అయిందనీ సంతోషంతో ఉంది. హైదరాబాద్‌ ‌నుంచి గజ్వేల్‌ ‌వరకు రాజీవ్‌ ‌రహదారిపైన రేవంత్‌రెడ్డికి దారిపొడవునా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సభకు విచ్చేసిన అతిథులకు సిద్ధిపేట జిల్లా డిసిసి  ప్రెసిడెంటు, గజ్వేల్‌ ‌మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి స్వాగతం పలికారు.

కేసీఆర్‌ ఏడున్నర ఏళ్ల పాలన వైఫల్యాలపై చార్జిషీటు
‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడున్నర పాలనపై సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్‌, ‌మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా చార్జిషీటును ప్రజల ముందు ఉంచారు. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించిన ఏ1 దోషి కేసీఆర్‌ ‌ప్రజాకోర్టులో నెంబర్‌ 1 ‌దోషి కేసీఆర్‌కు శిక్ష తప్పదు అని దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం. అందుకే కేసీఆర్‌ ‌నేరస్థుడు అంటున్నామన్నారు. కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యి ఏడున్నర ఏండ్లు అయ్యింది. 2014 ఎన్నికల ముందు దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చినా అవి అమలు చేయకుండా మోసం చేశారు. ఆయన హామీలు ఇచ్చి వోట్లు వేయించుకున్నారు. కేసీఆర్‌ ‌హామీలు నెరవేర్చినట్టు అయితే దళిత, గిరిజనులకు ఎంతో లాభం జరిగేది. వాళ్ళు ఆత్మ గౌరవంతో దర్జాగా బతికేవాళ్ళు..ఏడున్నర ఏళ్ళలో లక్షలాది దళిత, గిరిజన కుటుంబాలకు భరోసా కలిగేది. నేడు అవన్నీ జరగకపోవడానికి దళిత, గిరిజనులు ఇంకా అలాగే ఆత్మన్యూనతతో బతుకీడుస్తున్నారు. అందుకు కేసీఆరే దోషి. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్‌పైన చార్జిషీట్‌ ‌విడుదల చేస్తున్నామన్నారు.
నేరం.1 : తెలంగాణ రాష్ట్రం వొస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించి విస్మరించడం నేరం కాదా?
నేరం. 2 : భూమి లేని ప్రతీ దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం నేరం కాదా?
నేరం.3 : రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు ఇస్తానన్న హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?
నేరం.4 : నియామకాలే నినాదంగా సాగి రాష్ట్రాన్ని సాధించిన నిరుద్యోగులను నిండా ముంచడం నేరం కాదా?
నేరం.5 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు దుర్వినియోగం నేరం కాదా?
నేరం.6 : ఎస్టీ, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?
నేరం.7 : కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని నీరు గార్చడం నేరం కాదా?
నేరం.8 : అమలుకు ఆమడ దూరంలో ఫీజు రీయంబర్స్‌మెంటు నేరం కాదా?
నేరం.9 : దళిత గిరిజనులపై హత్యలు, అత్యాచారాలు అడ్డుకోకపోవడం నేరం కాదా?
నేరం.10 : ఆర్థిక సహకార సంస్థలు దళిత, గిరిజనులను ఆదుకోకపోవడం నేరం కాదా?
నేరం 11 : మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించకపోవడం నేరం కాదా? తదితర అంశాలపై కేసీఆర్‌పై చార్జిషీటును వెల్లడించిన దామోదర రాజనర్సింహా  కేసీఆర్‌ను ప్రజాకోర్టులో దోషిగా నిరూపించి ప్రజల చేత శిక్షింపజేస్తామన్నారు. ప్రజాదండు కడతాం..దళిత, గిరిజన దండోరా మోగిస్తాం.. కేసీఆర్‌ ‌గుండెల్లో దడ పుట్టిస్తామనీ దామోదర రాజనర్సింహా హెచ్చరించారు.

Leave a Reply