రాజకీయాలూ – నేరస్థుల ముఠాలు పడుగు పేకలు
వికాస్ దూబెని కాన్పూర్ తీసుకుని వొస్తుండగా అతడు పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని కాల్పులు జరిపితే, తాము జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించాడన్న పోలీసుల కథనాన్ని ఎవరూ నమ్మడం లేదు. అసలు ఇదొక్కటే కాదు, మన దేశంలో జరిగే ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్ కౌంటర్లేనని హక్కుల సంఘాలు ఏనాడో నిర్ధారించాయి. ఎప్పటికప్పుడు రుజువు చేస్తున్నాయి.. వికాస్ దూబె ఎన్ కౌంటర్ తో అతడి చేతిలో హతమైన ఎనిమిదిమంది పోలీసుల కుటుంబ సభ్యులు, అంతకుముందు అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారూ తమకు కాస్తయినా న్యాయం జరిగిందని సంబరపడుతుండవొచ్చు. కానీ, మనది ప్రజాస్వామిక వ్యవస్థ అనే సంగతి ఆవేశకావేశాలు పెల్లుబికినప్పుడు అందరూ మరచిపోతుంటారు. అత్యంత పాశవికంగా హత్యలు చేసే వారిని నడిరోడ్డు మీద ముందు వెనకలు ఆలోచించకుండా కాల్చి పారేయాలన్న డిమాండ్లు తరచూ వొస్తుంటాయి. అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. చట్టాన్ని ఎవరికి తోచిన విధంగా వారు తమ చేతుల్లోకి తీసుకుంటే , ఇక ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ గౌరవించేది ఎవరు..? దూబె ఎన్ కౌంటర్ అనేక ప్రశ్నలకూ, ప్రజాస్వామ్య హక్కులపై చర్చకూ తెరలేపింది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు అసత్యం కాదని దూబె ఎన్ కౌంటర్ రుజువు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు, ఆయన ఏరికోరి తీసుకుని వొచ్చిన ముఖ్యమంత్రి అయిన యోగి అధికారంలోకి వొచ్చిన తర్వాత రాష్ట్రంలో 11 ఎన్ కౌంటర్లు జరిగాయి. వాటిలో తొమ్మిది బూటకపు ఎన్ కౌంటర్లని హక్కుల సంఘాలు జరిపించిన నిజనిర్ధారణ లో తేలింది. ఆయన కాషాయి వస్త్రాలు ధరించినా, అత్యంత కఠినాత్ముడని ప్రత్యర్ధులు విమర్శిస్తూ ఉంటారు. అయితే, దూబె ఎన్ కౌంటర్ తీరును వ్యతిరేకించే వారు సైతం అతడి మరణానికి అయ్యో పాపం అని అనేవారు ఎవరూ లేరు. పోలీసు అధికారులను మట్టుబెట్టిన సంఘటన వంటి అరవై కేసుల్లో అతడు ప్రధాన నిందితుడు. అతడికి ఏ శిక్ష వేసినా తమకు ఇబ్బంది లేదని స్వయంగా తల్లి ప్రకటించారు. శిక్ష అంటే చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయస్థానాలు విధించే శిక్ష. ఇలాంటివి మన దేశంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. న్యాయస్థానాలు విధించే శిక్షలను కూడా తగ్గించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అందువల్ల పోలీసులు నిందితులను ఎక్కడిక్కడ కాల్చి వేస్తే ఇక చట్టాల పట్ల, రాజ్యాంగ సూత్రాల పట్ల ప్రజలకు గౌరవం పోతుంది. దూబె ముఠా ఎనిమిది మంది పోలీసు అధికారులను మట్టుబెట్టిన వారం రోజుల వ్యవధిలోనే దూబె ముఠా సభ్యులు ఐదుగురు, అంతిమంగా అతడూ పోలీసుల కాల్పుల్లో హతం అయ్యారు. ఎదురు కాల్పులు ఎప్పుడూ ఏక పక్ష కాల్పులేనని మన దేశంలో సామాన్యులకు సైతం తెలుసు. దూబెని కాన్పూర్ తీసుకుని వొస్తుండగా, వాహనం బోల్తా పడిందన్నది కట్టుకథనీ, అతడి తీసుకుని వొస్తున్న వాహనాన్ని మార్చారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అంటున్నారు. అతడిని కాన్పూర్ లో న్యాయ స్థానంలో హాజరు కావడటానికి ముందే ఎన్ కౌంటర్ చేశారు. అతడికి పోలీసులతోనూ, రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయనీ, వారి వెన్నుదన్నుతోనే ఈ అరవై నేరాలు చేశాడని ఆరోపణ లు వొచ్చాయి. అతడిని న్యాయస్థానంలో హాజరు పర్చి ఉంటే అందరి జాతకాలనూ పూసగుచ్చినట్టు చెప్పి అందరినీ ఇరుకున పెట్టి ఉండేవాడు. దూబె వంటి ముఠా నాయకులు ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం సమకాలీన రాజకీయాల్లో సర్వసాధారణం. అతడు కూడా సమాజ్ వాదీ పార్టీ చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ప్రయత్నించాడట. అలాగే, దూబెతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇద్దరు పోలీసు అధికారులను ఇప్పటికే అరెస్టు చేశారు. అతడు సమాజ్ వాదీ పార్టీకి అనుకూలుడు కనుక యోగీ నేతృత్వంలోని బేజేపీ ప్రభుత్వం అతడిపై కత్తి కట్టింది. నేరస్థులనూ, నేరరాజకీయాలనూ అంతమొందించాలన్న చిత్తశుద్ధి, దృఢ సంకల్పం యోగీ ప్రభుత్వానికి నిజంగా ఉంటే, అత్యాచారం కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న లక్ష్మణ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యేను వెనకేసుకుని వొచ్చి, అతడిని కాపాడేందుకు ప్రయత్నించి ఉండేవారు కారు. ప్రజాందోళనతో కేంద్రం దిగివచ్చి ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం, అతడు అరెస్టు కావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ , బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు నేరరాజకీయాలను ఆ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయనీ, తాము అధికారంలోకి వొస్తే అంతమొందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన కమలనాథులు అవే రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఒక వర్గం కాకపోతే మరో వర్గం అధికార పార్టీలో చేరి తమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా చేసుకోవడం నేరస్థుల ముఠాల సహజ లక్షణం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరస్థుల ముఠాలపై విచారణ లేకుండా ఎన్ కౌంటర్లు జరిపించినందుకే ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షాకు వరుసగా పదోన్నతలు కల్పించి తన కేబినెట్ లో ప్రస్తుతం నెంబర్ టూ చేశారు. అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు జరిపించిన ఎన్ కౌంటర్లలో షోహ్రబుద్దీన్, ప్రజాపతి తదితరుల ఎన్ కౌంటర్లు పదిహేనేళ్ళ క్రితం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి. నేరస్థుల ముఠాలతో రాజకీయ పార్టీల సంబంధాల గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. రాజకీయాలలో నేరచరితులను నిషేధించాలన్న ఎన్ ఎన్ వొహ్రా కమిటీ నివేదిక ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్జెడి, సమాజ్ వాదీ పార్టీలే కాకుండా బీజేపీ కూడా వ్యతిరేకించిన సంగతి బహిరంగ రహస్యం.