Take a fresh look at your lifestyle.

పాఠశాలల పున:ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన

సెప్టెంబర్‌ ఒకటి నుండి పాఠశాలలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు పదిహేడు నెలల తర్వాత పిల్లలు తమ పాఠశాలల ముఖం చూడబోతున్నారన్నమాట. అంటే దాదాపు రెండు విద్యా సంవత్సరాల తర్వాత  వారికి  ప్రత్యక్ష పాఠాలను వినే అవకాశం లభిస్తోంది. దీంతో ఇక ఆన్‌లైన్‌ ‌పాఠాలకు స్వస్తి పలికినట్లెనా అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఎందుకంటే పాఠశాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందిగాని, తమ పిల్లలు సురక్షితంగా పోయి వొస్తారా అన్నది ఇంకా తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి థర్డ్‌వేవ్‌ ‌గురించి భయపెడుతున్న నేపథ్యంలో పాఠశాలలు రీ ఓపెన్‌ అన్నది ఎంతవరకు సబబన్న విషయం వారిని వేధిస్తున్నది. ఇంకా కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌భయాలే పూర్తిగా తొలగిపోలేదు. తక్కువ స్థాయిలో అయినా ఇంకా కోవిద్‌ ‌కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. దీనికి తగినట్లుగా గత రెండు నెలలుగా థర్డ్ ‌వేవ్‌ ‌గురించిన ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ థర్డ్‌వేవ్‌ ‌ప్రభావం చిన్నపిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

 

జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ సాక్షాత్తు దేశ ప్రధానికి ఇచ్చిన నివేదికలోనే ఈ విషయాన్ని వివరించింది. నీతి ఆయోగ్‌ ‌కూడా దీనిపై హెచ్చరించింది. సెప్టెంబర్‌లో దేశ వ్యాప్తంగా ప్రతీరోజు నాలుగు నుంచి అయిదు లక్షల వరకు థర్డ్‌వేవ్‌ ‌కేసులు నమోదు కావచ్చన్నది నీతి అయోగ్‌ అం‌చనా. అప్పుడు కొరోనాకు గురి అయిన ప్రతీ వందమందిలో కనీసం నాల్గవ వంతు వారైనా హాస్పిటల్ లో  చేరే అవకాశాలుంటాయన్నది దాని అంచనా. కాన్పూర్‌ ‌శాస్త్రవేత్తలుకూడా రాబోయే ఉపద్రవంపట్ల జాగ్రత్తగ ఉండాలని హెచ్చరిస్తున్నారు. డెల్టాకన్నా ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్‌ ఉద్భవిస్తే థర్డువేవ్‌ ‌నవంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందంటున్నారు వారు. ఇందుకోసం కనీసం రెండు లక్షల ఐసియు బెడ్స్ ‌సిద్ధం  చేసుకోవాలని నీతి ఆయోగ్‌ ‌ముందు జాగ్రత్తలు చెబుతోంది. కనీసం 1.2 లక్షల వెంటిలేటర్స్ ‌కలిగిన ఐసియు బెడ్స్, ‌పదిలక్షల ఐసోలేషన్‌ ‌కేర్‌ ‌బెడ్స్ ఉం‌డాలని సూచిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్రానికి అందిన నివేదికల ఆధారంగా  ప్రధాని నరేంద్రమోదీ కూడా థర్డ్‌వేవ్‌ ‌విషయంలో ఏ మాత్రం అజాగ్రతగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని దేశ ప్రజలను హెచ్చరించారు.

దానికి తగినంతగా వైద్య సదుపాయాలు ప్రస్తుతం లేవని, వాటిని సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. చిన్న పిల్లలకు త్వరగా ఇన్‌ఫెక్షన్‌లు వొచ్చే   ప్రమాదముంటుందనీ , వారి ద్వారా ఇతరులకు వేగంగా సోకుతుందనీ , అందుకు పిల్లలకు త్వరగా టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే తల్లితండ్రులు భయపడిపోతున్నారు. సెకండ్‌ ‌వేవ్‌ ‌సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో విద్యార్థులకు, అధ్యాపకులు పలువురికి కొరోనా  సోకడంతో వెంటనే పాఠశాలలు మూసివేసిన విషయం తెలియందికాదు. అయితే దాదాపు రెండు సంవత్సరాల కాలంగా పిల్లలు పాఠశాలలకు దూరం అవడంతో విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో ప్రభుత్వం పాఠశాలలను తెరువాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇంటి నాలుగు గోడలకే విద్యార్దులు పరిమితం అవుతుండడంతో వారి మానసిక స్థితిపైన కూడా తీవ్ర ప్రభావం పడనుందన్న విషయాన్ని పలువురు విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు చెబుతున్నమాట.

 

అంతేగాక ఎంత ఆన్‌లైన్‌ ‌క్లాసులు నిర్వహించినా బడికి వెళ్ళి, తోటి విద్యార్ధులతో కలిసి మెదలడంవల్ల వారిలో ఒక విధమైన చైతన్యం వొస్తుంది. దానికి వారిప్పుడు దూరమవుతున్నారన్న ఆలోచన అటు తల్లిదండ్రులకు, ఇటు ఉపాధ్యాయ వర్గానికి ఉంది. అయినా రెండో వేవ్‌ ‌వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే తమ పిల్లలను ఇంకా కొంతకాలం గడప దాటనివ్వకపోవడమే మేలన్న అభిప్రాయాలు పేరంట్స్‌లో వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా 76 శాతం తల్లిదండ్రులకు థర్డ్‌వేవ్‌ ‌దృష్ట్యా తమ పిల్లలను ఇప్పుడప్పుడే పాఠశాలలకు పంపడం ఇష్టం లేదు. తెలంగాణలో మాత్రం వ్యతిరేకిస్తున్న వారికంటే పాఠశాలకు పంపాలన్న వారి శాతమే ఎక్కువగా ఉందన్నది ఒక సర్వేలో తేలింది. 55 శాతంమంది సుముఖంగా ఉంటే, 42 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.

మరో మూడు శాతంమంది తటస్థంగా ఉన్నట్లు ఆ సర్వే తెలుపుతున్నది. పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడుతున్న వారుకూడా ముందుగా అధ్యాపకులందరికీ టీకాలు వేయించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. కాగా పాఠశాలకు వొస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టిపెట్టి, ఏమాత్రం అనుమానం ఉన్నా వారిని సమీపంలోని పిహెచ్‌సిలో టెస్ట్ ‌చేయించాలని ప్రభుత్వం టీచర్లను ఆదేశిస్తే,  పిల్లలు కోవిడ్‌ ‌సూత్రాలను పాటించే విధంగా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాలంటున్న నేపథ్యంలో కనీసం మరో ఆరునెలలపాటైనా  వారిని కాపాడుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply