Take a fresh look at your lifestyle.

డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లలో నాణ్యత డొల్ల

  • టీఆర్‌ఎస్‌ ‌పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం
  • బీజేపీ సీనియర్‌ ‌నేత డీకే అరుణ

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లలో నాణ్యత లేదనీ, ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని బీజేపీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్‌ ‌విఫలమైందని విమర్శించారు. శుక్రవారం జూమ్‌ ‌యాప్‌ ‌ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2029 వరకే 2 లక్షల డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందిస్తామని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇచ్చిన మాట తప్పిందన్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాటకానికి తెరలేపిందన్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు కుమ్మక్కయ్యాయనీ, బీజేపీని ఎదుర్కోలేక రెండు పార్టీలు కలసి తిరుగుతున్నాయని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించిన సర్వేలో జీహెచ్‌ఎం‌సిలో బీజేపీ ముందంజలో ఉంటుందనీ, అధికార టీఆర్‌ఎస్‌ ‌వెనుకబడి పోతుందని వచ్చిందనీ, అందుకే డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో మంత్రి తలసాని హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల పాటు మంత్రి తలసానితో కలసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తిరగడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. జీహెచ్‌ఎం‌సిలో పర్యటించిన భట్టి డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల నాణ్యతపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. మంత్రి తలసానికి ప్రధాని మోడీని విమర్శించే స్థాయి లేదనీ, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్నదనే నెపంతో ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని వ్యాఖ్యానించారు. సీఎం అనుమతి లేకుండా తలసాని భట్టి ఇంటికి వెళ్లగలరా అని ప్రశ్నించారు. డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్ల విషయంలో టీఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌డ్రామాను ఎండగడతామని ఈ సందర్భంగా అరుణ స్పష్టం చేశారు.

Leave a Reply