ఆపరేటర్లకు స్వేఛ్ఛ ఉందన్న కేంద్రం
దేశంలో ఏర్పాటయ్యే ప్రైవేట్ రైల్వేలకు ప్రయాణికుల ఛార్జీలను సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఆయా మార్గాల్లో నడిచే ఏసీ బస్సులు, విమానాల ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. దేశంలో ప్రతిరోజు ఆస్టేల్రియా జనాభాకు సమానమైన ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారని, ఎక్కువ మంది పేద ప్రజలు రైలు ప్రయాణాలపైనే ఆధారపడతారని చెప్పారు. దీంతో రైలు ఛార్జీల అంశం రాజకీయంగా సున్నితమైనదని ఆయన అన్నారు.
దశాబ్దాలుగా నిర్లక్ష్యం, అసమర్థ బ్యూరోక్రసీ కారణంగా దేశంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి నోచుకోవడం లేదని యాదవ్ తెలిపారు. అందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ నుంచి ప్రైవేట్ రైళ్లు నడిపే వరకు ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుతున్నదని చెప్పారు. ఆల్ట్సోమ్ ఎస్ఏ, బొంబార్డియర్ ఇంక్, జిఎంఆర్ ఇన్ఫ్రాస్టక్చ్ర లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు దేశంలో ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయని యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల రానున్న ఐదేండ్లలో 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేస్తున్నట్లుగా చెప్పారు. దేశంలోని సుమారు 109 గమ్యస్థానాలకు 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.