Take a fresh look at your lifestyle.

‘అటా’ అవార్డు గ్రహీతకు అభినందనలతో . . .

పాత కలం మిత్రుడు, ఈనాడు  ట్రైనింగ్‌ ‌బ్యాచ్‌ అమర్‌ ‌గురించి ఓ నాలుగు లైన్లు వ్రాయాలని అనిపించింది. అల్లాటప్‌ ‌పాకాదు కదా.. ఆయన అందుకున్నది .. అది అమెరికన్‌ ‌తెలుగు అసోసియేషన్‌ ఎక్సెలెన్సి అవార్డ్ ‌కదా..  తప్పదు కదా అనుకుని కాగితంపై కలం పెడుతూ అలవాటు ప్రకారం  పై భాగాన కేంద్ర స్థానంలో ఓమ్‌ అని వ్రాశానో లేదో  అమర్‌ ‌తో తొలి పరిచయం అదే వివాదం గుర్తొచ్చి నవ్వు, ఆనందం కలగలసి . . .

అమర్‌, ‌సుషమ, మంగు, కేయెల్లార్‌ . . . ఇత్యాదులంతా ఓ బ్యాచ్‌. ‌నేను, జీవీయస్సూ, యస్సారెస్సూ వగైరాలం ఓ బ్యాచ్‌.. అమర్‌ ‌బృందానికి ఓములూ, నోములూ అంతగా నచ్చవు. నన్ను ఆ విషయంలో ఆటపట్టిస్తుంటారు.  జీవీయస్సూ, యస్సారెస్సూ అంతగా స్పందించే రకం కాదుగానీ ప్రతిదానికీ వాదం పెట్టుకుని చిన్న బుచ్చుకుంటూ మళ్లీ కలసిపోయే ఘటాన్ని నేనే. ఓసారిలాగే ఈనాడులో కొత్తపాళీ కోసం ఓ కవిత అల్లాను. అది చూసి ‘మరి నువ్వు దేవుడు ఉన్నాడంటావా లేడంటావా?’ అంటూ నిగ్గదీశాడు. నేను అప్పటికి ఇంకా రాటుదేలని గోపి ని కనుక ఆలోచనలోపడి మీ పార్టీయే అన్నాను. తర్వాత విజయవాడ వచ్చాక తీరుబడిగా ఆలోచించి తిరిగి పాత గోపీనాథ్‌ ‌ను అయిపోయాననుకోండి. అమర్‌ ఎలా ప్రభావం చూపగలడో చెప్పడానికే ఇదంతా.
అమర్‌ ‌తన బ్యాచ్‌ ‌కి (చిన్నసైజు) నాయకుడు. చిన్నసైజు అనడానిక్కారణమూ ఉంది. అదేమిటో అడక్కండేం. గుర్తుంటే ఆయనే చెప్తాడు. అందుకే ఎక్కువగా అతనితోనే నాకు లడాయి, స్నేహం కూడానూ. నేనంటే ఎందుకో అభిమానం. నిజానికి నేను దాదాపుగా ఏరోజూ అతనితో ఏకీభవించిన వాడిని కాదు మరి. నిదర్శనం… 1977. తను తన బృందంతో (సుషమ, కేయెల్లార్‌ ‌మినహా) సమ్మెను గట్టిగా బలపరిస్తే నేను అంతే తీవ్రంగా వ్యతిరేకించడమే గాక  ఓ రోజు ఆఫీసుకు హాజరు కావలసిందేననుకుని మిసెస్‌ ‌రావు (పర్సనల్‌ ఆఫీసర్‌) ‌కారులో బయల్దేరితే గేటు దగ్గర హఠాత్తుగా అమర్‌ ‌ప్రత్యక్షమై … చివరకు నేను దిగిపోయి వారిని అప్పటికి శాంతింపజేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఓ రెండేళ్లకు నేనే ఈనాడులో సమ్మె చేద్దామంటే నా మిత్రులెవరూ కలసి రాలేదు. అయితే అనుకోకుండా విజయవాడ ప్రెస్‌ ‌క్లబ్బులో అమర్‌ ‌తారసపడి ఏంటి సంగతీ ఆ రోజు కారులో షికారు చేశావుగా అంటూ నవ్వుతూనే అంటించాడు. అంతే. అతనికి నాపై, నాపైనే కాదు, నా మాదిరే ఆనాడు సమ్మెను వ్యతిరేకించిన ఎవరిపైనా కోపం లేదు. ఆ తర్వాత ఆంధ్రప్రభ హైదరాబాదులో తారసపడి వచ్చేశావూ అంటూ పలకరించాడు. ప్రెస్‌ అకాడమీ చైర్మనుగా రెండు మూడుసార్లు తారసపడినప్పుడూ అదే ఆప్యాయత. అంతేగానీ తానేదో పదవిలో అదీ సర్కారీ కొలువులో ఉన్నట్లు భావించుకోలేదు. దటీజ్‌ అమర్‌.
2004‌లో ప్రభ నూతన యాజమాన్యంపై చేసిన తిరుగుబాటులో మాకు వెన్ను దన్నుగా నిలబడిందీ ఈ అమర్‌ ‌తదితరులే. చిత్రంగా ఈసారి అమర్‌ ‌నన్నేమీ ఆటపట్టించలేదంటే అదే అతని వ్యక్తిత్వానికి నిదర్శనం కదా . . చివరాఖరుసారిగా 2006లో మా పరిచయానికి ముచ్చటగా మూడు దశాబ్దులు ముగిసిన సందర్భంగా ఓ మీటింగ్‌ ఏర్పాటు చేయడమేగాక గుంటూరులో ఉన్న నన్ను ఫోన్‌ ‌చేసి పిలిపించుకున్నాడు. మిత్రుల జాబితా చూపి మార్పులు, చేర్పులు కూడా అడిగాడు. అదీ అమర్‌ ‌శైలి. చివరగా ఓ మాట. అమర్‌ ‌తదితరులు జర్నలిజంలోనే ఉన్నారు. నాకెందుకో అది అచ్చిరాదనిపించి  మార్గం మళ్ళించుకున్నాను. అది తనకు నచ్చనిదేనని కూడా తెలుసు. అయినా తప్పదు కదా… అందుకే . . అమర్‌ ‌మీద నాకొక పద్యరత్నం విసరాలనిపించింది. .
పద్యం: దేవులపల్లి వారసుడె తీపియె బంచు నెరుంగడే యహం
భావము, నిక్కమే శ్రమికి బాళిని బాపెడు బాట చూపు నా
రావములెప్పుడున్నతని శ్రద్ధ సమస్యను బట్టి యాపుగా
భావమనంగ నాతడును వాణికి పుత్రుడె వాస్తవమ్మనన్‌ . . .
(‌తీపి . . . ప్రేమ, శ్రమి . . . శ్రామికుడు, బాళి . . . దుఃఖము, రావము . . .
ధ్వని అనగా ఆ తాలూకు ధ్వనులు అనగా ఆక్రందనలు లేదా నినాదాలు, శ్రద్ధ . . .
మనస్సు, వాణి . . . సరస్వతి అనగా వాళ్ళమ్మగారే..భావము . . .
మనవాడు దేవులపల్లి వారసుడు. అందరికీ ప్రేమాస్పదుడు. అహంభావమంటే తెలియనివాడు. శ్రామిక జన పక్షపాతి. వారి దుఃఖము పోయే మార్గం చూస్తాడు. ఆ తాలుకు ఆందోళనాస్వరాలు వినగానే మనసు అటే పోతుంది. మరి అతను సరస్వతీ పుత్రుడు గనుక ఆలోచనలు చక్కగా చేయగలడు.)
– పి వి ఆర్‌ ‌గోపినాథ్‌. (అమర్‌ ‌సహపాత్రికేయుడు), బెటంగళూరు. 91 93971 77001

Leave a Reply