Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు
ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నదని ఆయన రాష్ట్ర ప్రభుత్వ వేఖరిని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భీతి ఏమైందో కెసిఆర్‌ ‌చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. బుధవారం ఇందిరా పార్క్ ‌వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందంటూ తలపెట్టిన 24 గంటల దీక్షకు కిషన్‌ ‌రెడ్డి, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగ యువత పోరాటం చేశారని…1200 మంది ఆత్మ బలిదానం చేశారని అన్నారు.

తెలంగాణ వొస్తే తమకు ఉద్యోగాలు వొస్తాయని ఆశగా ఎదురుచూసిన నిరుద్యోలకు కెసిఆర్‌ ‌సర్కార్‌ ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. కెసిఆర్‌ ‌చేతగానితనం వల్లనే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని, లక్షల రూపాయల అప్పులు చేసి ప్రిపేర్‌ అయి పరీక్షలు రాస్తే ప్రశ్నాపత్రాలు లీక్‌ ‌చేశారని మండిపడ్డారు కిషన్‌ ‌రెడ్డి. ఈ అంశంపై నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిన బండి సంజయ్‌పై కేసులు బనాయించారని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదని కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు గ్రామాల్లోకి వొచ్చి వోట్లు అడిగే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదని అన్నారు. హోమ్‌ ‌గార్డు రవీందర్‌ ఆత్మహత్య చేసుకోలేదని, అది బిఆర్‌ఎస్‌ ‌చేసిన హత్య అని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు తీసుకుంటున్నారని, బంగారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చారని కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మిలియన్‌ ‌మార్చ్ ‌చేసిన చోటే బిఆర్‌ ‌పార్టీని యువత పాతరేస్తదని ఆయన ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను హెచ్చరించారు. ఇక కాంగ్రెస్‌ ‌పార్టీకి కెసిఆర్‌ ఆర్థిక సహాయం చేస్తున్నారని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు.

Leave a Reply