Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే) సందర్భంగా…

భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘స్టీల్‌ ఫ్రేమ్‌ ఆఫ్‌ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్‌ 1947న స్వతంత్ర భారతంలో తొలిసారి పౌర సేవకులను ఉద్దేశించి భారత ప్రథమ హోమ్‌ మినిస్టర్‌ సర్దార్‌ వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ అభివర్ణించారు. నైతికతను పెంచి పోషించడం, నిస్వార్థ ప్రజా సేవకులుగా పని చేయడం, జాతీయ సమైక్యతకు ఊతం ఇవ్వడం, ప్రభుత్వ పథకాల అమలులో తర తమ భేదాలను విస్మరించి సరైన అర్హులకు ప్రభుత్వ పథకాలు/సేవలు/సహాయాలను అందజేయడం లాంటి విధులను నిర్వహించడంలో సివిల్‌ సర్వెంట్స్‌ సఫలం కావడం అనాదిగా జరుగుతోంది. నాటి సర్దార్‌ పటేల్‌ ప్రసంగానికి గుర్తుగా ప్రతి ఏట 21 ఏప్రిల్‌ రోజున దేశవ్యాప్తంగా ‘‘జాతీయ పౌర సేవకుల దినోత్సవం లేదా నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ డే’’ను నిర్వహించుకోవాలని 2006లో తీర్మానించడం జరిగింది.

నేటి సివిల్‌ సర్వెంట్స్‌ ఎదుర్కొంటున్న సవాళ్ళు
దేశ పాలన వ్యవస్థలో పౌర సేవకులు వెన్నెముకగా నిలుస్తున్నారు. భారతీయ సివిల్‌ సర్వీసెస్‌లో ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ ఏ అండ్‌ బి విభాగాలు ఉన్నాయి. దేశ సివిల్‌ సర్వెంట్లను ప్రతి ఏట జాతీయ స్థాయి పోటీ పరీక్షను నిర్వహిస్తున్న యూపిఎస్‌సి నిబద్దత అమూల్యమైనది. నేటి సివిల్‌ సర్వెంట్స్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రెడ్‌-టేపిజమ్‌, నియమ నిబంధనల్లో లొసుగులు, ప్రజల హక్కులు/భాద్యతల్లో అవగాహన లేమి, అపరిమిత రాజకీయ జోక్యం, పారదర్శక పాలన లోపాలు, జవాబుదారీతనం లేకపోవడం, విలువల పతనం, రాజకీయ కక్షపూరిత బదిలీలు, అవినీతిమయ ఆలోచనల వరదలు, నిజాయితీ పాలనకు అడ్డుగా నిలుస్తున్న బలమైన అక్రమ వ్యవస్థలు, అశ్రిత పక్షపాత పాలకులు లాంటి అంశాలు ప్రస్తుత సివిల్‌ సర్వెంట్లను వెంటాడుతున్నాయి. వీటికి లొంగిన కొందరు అధికారులు సివిల్‌ సర్వెంట్స్‌ వర్గానికే చెడ్డ పేరు తెస్తున్నారని గమనిస్తున్నాం.

పాలకులకు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం
ఆధునిక శాస్త్రసాంకేతిక విప్లవం, సామాజిక మార్పులు, ప్రజా అవసరాలను ఆకళింపు చేసుకుంటూ కాలానుగుణంగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు మారుతూ పలు సందర్భాల్లో సవాళుగా కూడా నిలుస్తున్నాయి. నైతిక విలువలకు పట్టం కట్టడంతో పాటు పారదర్శక పాలనకు మారు పేరుగా పౌర సేవకులు తమ విధులను నిర్వహించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు, ప్రజలతో మమేకమై సేవలను విస్తరించడం, సివిల్‌ సర్వెంట్స్‌ ప్రజా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనిస్తున్నాం. సమ్మిళిత సుస్థిరాభివృద్ధి సాధనలో సివిల్‌ సర్వెంట్స్‌ భూమిక వెలకట్టలేనిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విలువలు వేగంగా పతనమవుతున్న సంధి కాలంలో నేటి సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘అడకత్తెరలో పోక చెక్క’’ వలె అమాయక ప్రజలు, అవినీతి రాజకీయ నాయకుల నడుమ నలిగి పోవడం చూస్తున్నాం. భరత జాతి నిర్మాణంలో పాలకులు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, నిష్పాక్షిక వార్త పత్రికలు తమ తమ విధులను సక్రమంగా నిర్వహించిన నాడు దేశ సమగ్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని నమ్ముతున్నాం. రాజకీయ అవినీతిచెదలు సివిల్‌ సర్వెంట్స్‌ను కూడా విడిచి పెట్టడం లేదు. సివిల్‌ సర్వెంట్స్‌లో కూడా అవినీతి తిమింగలాలు తిష్ట వేయడంతో ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నది. పాలకుల పదవి తాత్కాలికమని, అధికారుల పదవి దీర్ఘకాలికమని గమనించి సివిల్‌ సర్వెంట్స్‌ ప్రజా సేవలో మునిగి ఆత్మ సంతృప్తిని పొందుతూ మంచి ఉన్నతాధికారులుగా ప్రజల గుండెల్లో నిలవాలి.

పౌర ప్రయోజనాలకు అంకితం కావాలి
సివిల్‌ సర్వెంట్స్‌ ధ్యేయం ప్రజా శ్రేయస్సు కావాలి. పౌరుల ప్రయోజనాల కోసమే వారు అంకితం కావాలి. పనిలో శ్రేష్టత, నిబద్ధతలను పునరుద్ధరించడానికి ‘నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే’ మరో సందర్భం కావాలి. ‘భారత పౌర సేవల పితామహుడు’గా ‘చార్లెస్‌ కార్న్‌వాలిస్‌’ పేర్కొందారు. 1864లో భారతీయ సివిల్‌ సర్వీస్‌లో చేరిన తొలి భారతీయుడు ‘సత్యేంద్ర నాథ్‌ ఠాగూర్‌’, 1951లో తొలి మహిళా సివిల్‌ సర్వెంట్‌ ఐఏఎస్‌ అధికారిణి ‘అన్నా రాజ్యం మల్హోత్రా’లు చూపిన బహుముఖీన ప్రతిభ నేటి పౌర సేవకులకు ప్రేరణ కావాలి. 1922 నుండి ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను భారత్‌లో నిర్వహించడం ప్రారంభమైంది. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ నియమ నిబంధనలకు మధ్య నిరంతర ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. నిబద్దత కలిగిన సివిల్‌ సర్వెంట్స్‌ దురాలోచన కలిగిన రాజకీయ నాయకులను విస్మరిస్తూ తమ విధులను నిక్కచ్చిగా నిర్వహిస్తూ ప్రజల మనస్సుల్లో దేవుడిగా నిలవాలని కోరుకుందాం, పౌర సేవకుల శ్రమకు కృతజ్ఞతలు తెలియజేద్దాం.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply