Take a fresh look at your lifestyle.

ఔను!..సిగ్గు పడుతున్నాం!

దేశ చిత్రపటం పై
దిక్కులను కలిపే సరళరేఖలైన
పాదముద్రల ఆనవాలు.
గానం చేస్తున్న
విరామమెరుగని విషాదగీతాలు
వింటూనే వున్నాం!
నిప్పులు చెరిగేటి  దారి పొడవునా
పొరలు పొరలుగా తెగిపడుతూ
సోలి, తూలి పడుతున్న
కోట్లాది దేహాల తన్లాటల
అనివార్యమైన జీవయాత్ర

ఎవరి దేహాన్ని వారు మోసుకునే వేళ
గుండె కవాటాల్ని చిదిమే దృశ్యమోటి
దేహం చీల్చుకుంటూ దూసుకెళ్తుంది.
అప్రమత్తమయ్యేందుకు కూడా
అస్సలు అవకాశమే ఇవ్వని వేళ
సాదృశ్యం కాని కరవాలమొకటి
నిలబెట్టి నిలువునా నిష్కర్షగా
రెండు ఖండాలుగా తెగ్గోస్తూంది.
అప్రయత్నంగా ఆవహించే దుఃఖం
ఇంకిపోయిన కన్నీటి చెలిమెను
తడిమి తడిమి పలుకరిస్తుంది.

ఖండాలను ఆవరించిన సంద్రాలిప్పుడు
వాస్తవాల లోతులను విశ్లేషిస్తున్నాయి.
తీరాలు చేరేటి దారులను మరిచిన
అలల చివరలు కలవరంతో
ఉబికి వచ్చే హృదయ ఘోషను
పంటిబిగువున దాచుకుంటున్నాయి.
‘‘విశ్వాసాల’’ సౌధాలు పగుళ్ళూడి
నిజంగానే నిర్జనమై,నిస్తేజమై,
నిశ్శబ్ధ పరిష్వంగంలో జారుకున్నాయి.
సద్దు మణగని సంధ్యవేళన
పొద్దుతిరుగుడు పూవు నీడలు
మట్టి దేహాలపై వచ్చి వాలాయి.
పగటి వెలుగులను వెక్కిరిస్తూ
కీచురాయొకటి పాట పాడింది.
విశ్రాంతి కోరిన పాదాల కునుకు
నిర్దయ ఘాతానికి నిష్క్రమించింది.

హఠాత్తుగా రాలిపోయిన పేగుబంధ మొకటి
కూలిపోయిన జ్ఞాపకాలను తట్టి లేపింది.
దాచిపెట్టిన మట్టిజాడల సమాధి లోంచి
నెత్తుటి బంధాల ఆర్తనాదమొకటి
కలత నిద్రన పలుకరించి మెలుకవచ్చింది.
అమ్మ ఒడికై అర్రుచాచే ఆర్థి గీతం
గుక్కపట్టిన రోదనై ఎదను తడుతూంది.
దాటి వచ్చిన మైళ్ళదూరపు మలుపులవుతల
మట్టి పొదల ఆనవాల్ల స్మృతుల తడిమే
తల్లి ప్రేమ ఇప్పుడు ‘ఎలీజీ’ కి బదులుగా
నిదుర పుచ్చే ఓ జోల పాడుతుంది.

 – వాడపల్లి అజయ్‌ ‌బాబు. 8909260409

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!