Take a fresh look at your lifestyle.

దళితుడు సిఎం అయితేనే ఆత్మ గౌరవం..!

  • కేసీఆర్‌ ‌కేవలం కల్వకుంట్ల రాజ్యం నిర్మిస్తున్నారు..
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు దళితులకు కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలి: బిజెపి నేత వివేక్‌

కేసీఆర్‌ ‌నిజంగా దళితుల ఆత్మ గౌరవాన్ని కోరుకుంటే రాష్ట్ర తదుపరి సిఎంగా కేటీఆర్‌ని కాకుండా, దళిత వ్యక్తి పేరు ప్రకటించాలని బిజెపి స్టేట్‌ ‌కోర్‌ ‌కమిటీ మెంబర్‌ ‌మాజీ ఎంపీ వివేక్‌ ‌వెంకటస్వామి డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌కు సిఎం పదవిపై ఆశ పెరిగిందని… కల్వకుంట్ల రాజ్యం నడపాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారని కెసిఆర్‌పై మండిపడ్డారు. శుక్రవారం ఓయూ లో జరిగిన దళిత రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పాల్గొనలేక పోవడంతో వీడియో ద్వారా ఆయన తన సందేశాన్ని పంపారు. తెలంగాణ వొచ్చాక రాష్ట్ర అభివృద్ధి పేరుతో కెసిఆర్‌ ‌తానే స్వయంగా సీఎం అయ్యారన్నారు. రెండు ఉప ముఖ్యమంత్రి పోస్టుల్లో దళితులకు ఒకటి ఇచ్చి దళితుల దృష్టి మరల్చారని విమర్శించారు. ప్రస్తుతం సిఎం, డిప్యూటీ సిఎం రెండు పోస్టుల్లో దళితులు లేరని గుర్తు చేశారు. రెండోసారి అవకాశం వొచ్చినా తన కుమారుడినే తప్ప, దళితుడిని సిఎం చేయాలని లేదన్నారు. కేసీఆర్‌ ‌దళిత ద్రోహని వివేక్‌ ‌దుయ్యబట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితులకి మూడెకరాల భూమి అని చెప్పి, ఇప్పుడు ఖజానా ఖాళీ పేరుతో చాలామంది దళితులను మోసం చేశారన్నారు. ఇరిగేషన్‌ ‌దందా పేరుతో ఏపి కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచిపెట్టేందకు సిఎం దగ్గర పైసలున్నాయన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టారే తప్ప, దళితులకు ఇవ్వడానికి కెసిఆర్‌ ‌ముందుకు రాలేదని విమర్శించారు. దళితుల వోట్లు దండుకునేందుకే ఎన్నికల వేళ కొత్త పథకాలను పెడుతున్నారన్నారు. హుజూరాబాద్‌లో బిజెపి గెలుస్తుందని ఇంటెలిజెన్స్ ‌రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ‘‘దళిత బంధు’’ పథకాన్ని అనౌన్స్ ‌చేసినా 70 శాతం ప్రజలు ఈటలనే గెలుపిస్తామని కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. ఈటల రాజీనామాతోనే పది లక్షల పథకాన్ని కెసిఆర్‌ ‌పెట్టారనే అవేర్‌నెస్‌ ‌ప్రజల్లో వొచ్చిందన్నారు.

దళిత ఆఫీసర్లకు కెసిఆర్‌ ‌రాజ్యంలో గౌరవం లేదు
రాష్ట్రంలో దళిత ఆఫీసర్లకు గౌరవం ఎక్కడుందని వివేక్‌ ‌ప్రశ్నించారు. సిఎం ఆఫీసులోని కీలక పోస్టుల్లో దళితులకు కీలక పదవులు ఇవ్వాలన్నారు. అలాగే, పది మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లను వేయాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో 250 మంది రిటైర్డ్ ఆఫీసర్లకు రి ఎంప్లాయిమెంట్‌ ‌కల్పిస్తే, అందులో ఒక్క దళిత అధికారికి అవకాశం ఇవ్వలేదన్నారు. చాలా మంది ఎస్సీలకు చీఫ్‌ ఇం‌జనీర్లుగా అయ్యే అవకాశం వొచ్చినా ఇవ్వలేదన్నారు. మాజీ అధికారులు మురళీ, ప్రవీణ్‌లను కేసీఆర్‌ ఎం‌తో అవమానపరిచారని చెప్పారు. వోట్ల కోసం కేసీఆర్‌ ‌చేస్తున్న జిమ్మిక్కులపై దళితులకు అవగాహన కల్పించాలని రౌండ్‌ ‌టేబుల్‌ ‌మీటింగ్‌లో దళితనేతలను కోరారు.

కమీషన్ల రూపంలో దండుకున్న వేల కోట్లను ప్రజలకు పంచాలి
కమీషన్ల రూపంలో కేసీఆర్‌ ‌దండుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచాలని వివేక్‌ ‌వెంకట స్వామి డిమాండ్‌ ‌చేశారు. బిజేపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ సభకు ఆయన సంఘీభావం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినట్లు మీడియాకు తెలిపారు. కేసీఆర్‌ ‌ప్రజా వ్యతిరేక, నిర్లక్ష్య పాలనకు వ్యతిరేకంగా బిజేపి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కేసీఆర్‌ ‌తెలంగాణ నినాదాన్ని వాడుకొని ఆస్తులు పెంచుకొని, స్టేట్‌ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో కెసిఆర్‌ ‌తన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం కాకుండా అధికారాన్ని కాపాడుకునే దిశలో పని చేస్తున్నారన్నారు. కొరోనా వేళ పాత సెక్రటేరియట్‌ను కోవిడ్‌ ఐసోలేషన్‌ ‌సెంటర్‌గా మార్చకుండ కూల్చీవేసారని మండిపడ్డారు.

కేవలం హుజురాబాద్‌ ఎన్నికల్లో వోటమి భయంతోనే ‘‘దళిత బంధు’’ స్కీమ్‌ ‌తెచ్చారన్నారు. రైతుబంధు మాదిరిగానే రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని వర్గాలు వారికి ఈ స్కీమ్‌ అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. చింత మడకలో ఇచ్చినట్లే రాష్ట్రంలో ప్రతికులానికి 10 లక్షలు ఇవ్వాలన్నారు. మంథని, హుజూర్‌నగర్‌, ఆదిలాబాద్‌ ఎన్నికల్లో గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పి కేసీఆర్‌ ‌మోసగించారని అన్నారు. ఎన్నికల తర్వాత పోడు భూముల సమస్య పరిష్కారానికి కనీసం అధికారులతో ఒక మీటింగ్‌ ‌కూడా పెట్టలేదన్నారు. పోడు భూముల సమస్యపై కాగజ్‌ ‌నగర్‌ ‌బిజేపి నేత హరీష్‌ ‌బాబు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, పోలీసులతో దీక్ష భంగం చేశారని గుర్తు చేశారు. దళిత సిఎంపై ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఆ జాతి బిడ్డలకు కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే, రాష్ట్ర మంత్రి వర్గంలో బిసీలకు పెద్ద పీఠ వేయడంతో పాటూ, కీలక పదవులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply