Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్‌

  • అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్ఠను కాపాడుకునే వ్యూహంలో పార్టీలు
  • రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచికున్న కాంగ్రెస్‌లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ధీమా
  • మోదీ సమ్మోహనాష్త్రంపై బిజెపి ఆశలు
  • బిఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న దానిపై చర్చ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసి, ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తుండగా ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ రానున్న పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెడుతున్నాయి. మరో మూడు నాలుగు నెలల్లో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే పార్టీలు సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీపడిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు మరోసారి తమ సత్తా చాటుకునే అవకాశం లభించడంతో వ్యూహరచల్లో  మునిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ ఆధిక్యతను చాటుకునేందుకు పెద్ద ఎత్తున్నే కసరసత్తు చేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి అనూహ్యంగా 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వానికి రాగలిగింది.

అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి అధిక సంఖ్యలో లోకసభ స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేక పోలేదు. అందుకు ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండడమే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలన్న తమ అభిప్రాయాన్ని అసెంబ్లీ ఎన్నికల ద్వారా వెల్లడిరచారన్నది మన కండ్లముందున్నది. ఈ నేపథ్యంలో ఈసారి  రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం పదహారింటిని గెలుచుకుంటామన్న ధీమాను కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను పకడ్బందీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అందుకు గాను ప్రతీ లోకసభ నియోజకవర్గానికి కనీసం ఇద్దరేసి అభ్యర్థుల పేర్లను పరిగణనలోకి తీసుకుని, అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నవారితో పాటు, ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాయకుల్లో కొందరికి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించనుంది.

అయితే అభ్యర్థులెవరైనప్పటికీ వారిని గెలిపించుకునే బాధ్యత మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మరోసారి పడనుంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా రెండిరటికి సరైన న్యాయం చేయడం కష్టం. అందుకుగాను పిసీసీ అధ్యక్షత బాధ్యతను మరొకరికి అప్పగించడం సరైందిగా ఆ పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకు సరైన వ్యక్తి అన్వేషణలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు అభించింది.  అలాంటప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిని బిసీ వర్గానికి చెందిన వారికి ఇస్తే సమన్యాయం పాటించినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకుగాను పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మధుయాష్కి గౌడ్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ లాంటివారి పేర్లు వినిపిస్తున్నాయి..

మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కలిపించకపోవడంతో ఈ పదవిని మైనార్టీ వర్గాల వారికి కల్పించాలని అనుకునే క్రమంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఈ పదవితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులపై కన్నేసిన జానారెడ్డి, జగ్గారెడ్డిలను కూడా అధిష్టానం ఆలోచించే అవకాశాలున్నాయంటున్నారు. కాగా వివాద రహితుడు, సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేరు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు పిసీసీ మార్పు అవసరమా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీలో కూడా ఇలాంటి చర్చనే జరుగుతున్నది. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తాను అధ్యక్ష పదవికి న్యాయం చేయలేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇటీవల అధిష్టానానికి విన్నవించుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కూడా అయిన కిషన్‌ రెడ్డి మరోసారి పార్లమెంటుకు పోటీ చేయనుండడంతో అధిష్టానం దీనిపైన ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది.

అయితే గతంలో చేసిన పొరపాటే మళ్ళీ చేయడం సరికాదని అధిష్టానం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్‌ని తొలగించడం రాష్ట్ర ఎన్నికలపై పడిరదన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న బిజెపి, ఈసారి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. అందుకు గత రెండేళ్ళుగా బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడిగా తీసుకొచ్చిన హైప్‌ని కారణంగా చెప్పుకుంటున్నారు. ఆయన్ను అలాగే అధ్యక్షుడిగా కొనసాగిస్తే మరిన్ని స్థానాలు బిజెపికి లభించేవంటున్నారు. ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందు మరోసారి అలాంటి ప్రయోగం చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మార్చినా అందుకు సమర్థులెవరన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతున్నది. తాజా శాసనసభ ఎన్నికల్లో బిసీనే రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి ప్రకటించింది.

అయితే ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎంపికలో కూడా బిసీకే ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయి. బండి సంజయ్‌ మరోసారి కరీంనగర్‌ నుండి ఎంపి అభ్యర్థిగా పోటీచేయబోతుండడంతో ఆయనపై అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను పెట్టే అవకాశంలేదు. ఇప్పటికే ఆయన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా బిసీ నాయకుల్లో గతంలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన డాక్టర్‌ లక్ష్మణ్‌ ఇప్పుడు ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, పార్లమెంటు బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చేర్పుల కమిటీ చేర్మన్‌ ఈఓల రాజేందర్‌కు ఈ అవకాశం లభించే అవకాశాలపై చర్చ జరుగుతున్నది. వీరెవరూ కాని పక్షంలో గతంలో ఇక్కడ  బిజెపి రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్‌కు ఈ బాధ్యతనలు అప్పగించవచ్చనుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం ఛండీఘడ్‌ కేంద్రంగా పంజాబ్‌ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

అలాగే మధ్యప్రదేశ్‌ బిజెపి ఇన్‌ఛార్జిగా ఉన్న మురళీధర్‌రావు పేరు కూడా వినిపిస్తున్నది. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ళపాటు ఏకఛత్రాదిపత్యంగా ప్రత్యేక  తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బిఆర్‌ఎస్‌ మొదటి నుండీ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవాలని చెబుతూ వొచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కేవలం 9 స్థానాలను మాత్రమే బిఆర్‌ఎస్‌ గెలుచుకోగలిగింది. ఆనాడు రాష్ట్రంలో పెద్దగా లేదనుకున్న బిజెపి నాలుగు స్థానాలను, కాంగ్రెస్‌ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఇప్పుడు  రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బిఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న విషయంలో చర్చ జరుగుతున్నది. ఒకవైపు దేశ వ్యాప్తంగా మోదీ సమ్మోహన అస్త్రం పనిచేస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోఉండడంతోపాటు, దాదాపు పది పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నిటినీ గెలచుకున్న తరుణంలో బిఆర్‌ఎస్‌కు దక్కనున్న స్థానాలు ఎన్ని అన్నదానిపై ఇప్పుడు చర్చజరుగుతున్నది.

Leave a Reply