- రైతే రాజన్నది మా విధానం
- ప్రతి రైతుకూ రైతుబంధు అందాలన్నదే సిఎం కేసీఆర్ ఆలోచన
- రాబోవు రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం
- పారదర్శకంగా పట్టాదారు పుస్తకాలు
- పట్టాదారు పుస్తకాల పంపిణీలో మంత్రి హరీష్‌రావు
ప్రతి రైతుకు రైతుబంధు రావాలన్నదే.. సీఎం కేసీఆర్ ఆలోచన. రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వాలు రైతు రాజు కావాలన్నది నినాదంగా చెప్పేవాళ్లు.. తెలంగాణ హయాంలో రైతే
రాజు విధానంగా చేసి చూపిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 195 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… అవినీతి లేకుండా, పారదర్శకంగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా అందిస్తుందన్నారు. 20 ఏండ్లలో ఇంత మంచి కాలం కాలేదు. ప్రతి చెరువు నిండి మత్తడి పారుతుందనీ, గడిచిన 70 ఏండ్ల నుంచి గత ప్రభుత్వాలు రైతు నడ్డి విరిచాయనీ, కానీ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది వల్ల 3 ఏండ్ల నుంచి పట్టణాల నుంచి ప్రజలు గ్రామాల బాటపట్టారన్నారు. జిల్లాలో 2700 చెరువులు నిండాయనీ, గత ప్రభుత్వాల హయాంలో చెరువుల కట్టలు తెగి పోయేవి. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. గతేడాది లక్షా 20 వేల ఎకరాలు సాగయితే… ఈ ఏడాది 2 లక్షల 30 వేల ఎకరాల వరకు వరిసాగైందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మాకర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
సిద్ధిపేట సిపి ఆఫీసులో సిసిటివి కంట్రోల్ రూంను ప్రారంభించిన హరీష్‌రావు
సిసిటివి కెమెరాలు ప్రజలకు అండగా ఉండటంతో పాటు మరింత రక్షణ, భద్రతను కల్పిస్తాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు సిసిటివి కంట్రోల్ రూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిసిటివి కంట్రోల్ రూంతో ఇక సిద్ధిపేట జిల్లా పూర్తిగా భద్రతా వలయంలోకి వచ్చిందన్నారు. సిద్దిపేట పట్టణంలో ఏ కాలనీలో ఏం జరుగుతుందో కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించవచ్చన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలలో ప్రథమంగా కమాండ్ కంట్రోల్ రూంను బ్రహ్మాండంగా నిర్మించుకున్నామనీ, సిద్దిపేట జిల్లా అన్నింటిలో ఆదర్శంగా ఉందనీ, సిసి కెమెరాలు ఏర్పాటులో కూడా ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఒక్క సిసి కెమెరా 5గురు పోలీస్‌లతో సమానమనీ, వీటి ఏర్పాటుతో పని భారం తగ్గడంతో పాటు కేసుల విచారణలో పారదర్షకత పెరుగుతుందన్నారు. వెజిటేబుల్, నాన్ వెజ్ మార్కెట్, రంగనాయక సాగర్‌పై ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాంకు సూచించారు.
సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీ, నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్, రంగనాయక పురం, మెట్టు బండలు, మెడికల్ కళాశాల, లింగారెడ్డిపల్లి, రంగధాంపల్లి, గాడిచర్లపల్లి గ్రామాల్లో త్వరలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.రాబోవు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని సిసి కెమెరాలను సిద్దిపేట కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తామన్నారు. పోలస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ… మంత్రి హరీష్‌రావు ఇచ్చిన ప్రత్యేక నిధులతో సిద్దిపేట పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధిలోనూ ప్రజల రక్షణలోనూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలోని 464 గ్రామాలలో, 5 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటివరకు 4205 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో 210 కేసులను ఛేదించి బాధితులకు న్యాయం చేసినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ శంకర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ఏసీపీ శ్రీనివాస్(అడ్మిన్), సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిసిఎస్ ఏసిపి సురేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, వన్ టౌన్ సీఐ సైదులు, టూటౌన్ సిఐ పరశురామ్ గౌడ్, రూరల్ ఎస్ఐ శంకర్, పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన నేరాలను సిసి కెమెరాల ద్వారా ఏ విధంగా ఛేదించారనే విషయమై పోలీస్ కమిషనర్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు పరిశీలించడంతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో పరిశీలించారు.