Take a fresh look at your lifestyle.

అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు – జాతీయ సమైక్యతకే విఘాతాలు

“జాతీయ సమైక్యత సాధనకు ఉపకరించాల్సిన రాష్ట్రాలు, పలు కారణాలతో విభేదించడం, ప్రజల్లో స్థానిక భావనాగ్నికి ఆజ్యం పోయడం అతి ప్రమాదకరంగా మారుతున్నది. పాకిస్థాన్‌, ‌చైనా లాంటి పలు పొరుగు దేశాల సరిహద్దు వివాదాలతో నిత్యం మన త్రివిధ దళాలు పోరాటం చేయడం, ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. దేశ బాహ్య సరిహద్దులను రక్షించుకుంటున్న భారతానికి అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు చుట్టు ముట్టడం అత్యంత ప్రమాదకరం. ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ప్రతీక అయిన భారతం నేడు అదే కుల మత భాషా ప్రాంత వర్ణ వర్గ జాతి విభేదాలతో సమైక్య భావాలకు తూట్లు పొడవడం, స్వప్రయోజనాలకు స్వీయ భావనను పోషించడం, సామరస్యాన్ని పణంగా పెట్టడం అతి దురదృష్టకరంగా మారుతోంది. ఇటీవల బయట పడ్డ అస్సాం-మిజోరామ్‌ ‌సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో 157 మంది ప్రజలు ప్రాణాలు వదలడం అత్యంత విచారకరం. వసుదైక కుటుంబ భావనలు బలపడుతున్న వేళ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగడం, రాష్ట్రాల పునర్విభజన సమయంలో స్పష్టతలు కొరవడడం, రాజకీయ పార్టీల కుర్చీలాటలో వివాదాలకు ఊతం ఇవ్వడం హాస్యాస్పదంగా తోస్తున్నది.”

‘అవిచ్ఛిన్న సమైక్య భారతంలో విచ్ఛిన్నకర ఆలోచనల రాష్ట్రాలు’ ఉన్నాయన్న డా: బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భావనలను నేటి ‘అంతర్‌ ‌రాష్ట్ర సరిహద్దు వివాదాలు’ నిజం చేస్తున్నాయి. జాతీయ సమైక్యత సాధనకు ఉపకరించాల్సిన రాష్ట్రాలు, పలు కారణాలతో విభేదించడం, ప్రజల్లో స్థానిక భావనాగ్నికి ఆజ్యం పోయడం అతి ప్రమాదకరంగా మారుతున్నది. పాకిస్థాన్‌, ‌చైనా లాంటి పలు పొరుగు దేశాల సరిహద్దు వివాదాలతో నిత్యం మన త్రివిధ దళాలు పోరాటం చేయడం, ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. దేశ బాహ్య సరిహద్దులను రక్షించుకుంటున్న భారతానికి అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు చుట్టు ముట్టడం అత్యంత ప్రమాదకరం. ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ప్రతీక అయిన భారతం నేడు అదే కుల మత భాషా ప్రాంత వర్ణ వర్గ జాతి విభేదాలతో సమైక్య భావాలకు తూట్లు పొడవడం, స్వప్రయోజనాలకు స్వీయ భావనను పోషించడం, సామరస్యాన్ని పణంగా పెట్టడం అతి దురదృష్టకరంగా మారుతోంది. ఇటీవల బయట పడ్డ అస్సాం-మిజోరామ్‌ ‌సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో 157 మంది ప్రజలు ప్రాణాలు వదలడం అత్యంత విచారకరం. వసుదైక కుటుంబ భావనలు బలపడుతున్న వేళ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగడం, రాష్ట్రాల పునర్విభజన సమయంలో స్పష్టతలు కొరవడడం, రాజకీయ పార్టీల కుర్చీలాటలో వివాదాలకు ఊతం ఇవ్వడం హాస్యాస్పదంగా తోస్తున్నది. నేటి సువిశాల భారతంలో ముఖ్యమైన అంతర్‌ ‌రాష్ట్ర వివాదాల లోతుల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం.

Interstate conflicts - disruptions to national unity

అస్సాం-మిజోరామ్‌ ‌వివాదం :
ఇటీవల కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ ‘భారత్‌లోని ఒక అంగుళం భూభాగాన్ని కూడా చైనా లాంటి దేశాలకు వదిలేదు లేదు’ అంటూ మన భారత మనోగతాన్ని పొరుగు శత్రువుకు వినిపించారు. అదే సమయంలో తన పార్టీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తమ రాష్ట్రానికి చెందిన ఒక అంగుళం భూభాగాన్ని తాము వదులు కోవడానికి సిద్ధంగా లేదని, ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని’ తెలిపారు. ఇలాంటి అంతర్‌ ‌రాష్ట్రాల వివాదం కాల్పుల వరకు వెళ్ళడం, ఐదుగురు అస్సాం పోలీసులు మరణించడం సిగ్గు చేటని విజ్ఞత కలిగిన పౌరులకు అర్థం అవుతున్నది. బ్రిటీష్‌ ‌కాలం నుంచి నేటి వరకు నెలకొన్న ‘బరాక్‌ ‌లోయ – లుషాయ్‌ ‌హిల్స్’ ‌ప్రాంతం అస్సాం-మిజోరామ్‌ల మధ్య సరిహద్దు వివాదానికి కారణం అవుతున్నది. బ్రిటీష్‌ ‌కాలంలో మిజోరామ్‌ను ‘లుషాయ్‌ ‌హిల్స్’‌గా కూడా పిలిచేవారు. 1950లో అస్సాం రాష్ట్రం ఏర్పడింది. 1987లో జరిగిన పుర్విభజనలో మిజోరామ్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు ఏర్పడడం, ఆస్సాంలోని కొంత భూభాగం ఇతర కొత్త రాష్ట్రాల్లోకి వెళ్ళడంతో అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు ప్రారంభమైనాయి. 1875 నోటిఫికేషన్‌ ‌ప్రకారం లుషాయ్‌ ‌హిల్స్, ‌చచ్చర్‌ ‌ప్రాంతాలు నిర్వచించబడ్డాయి, 1933 నోటిఫికేషన్‌లో లుషాయ్‌ ‌హిల్స్, ‌మణిపూర్‌ల మధ్య సరిహద్దు ఏర్పడింది. 1875 నోటిఫికేషన్‌ ‌ప్రకారం నడవాలని మిజోరామ్‌, 1933 ‌నోటిఫికేషన్‌ ‌ప్రకారం అంగీకరిస్తామని అస్సాం తమ సరిహద్దు వాదనలు వినిపిస్తున్నాయి. అస్సాం-మిజోరామ్‌ల మధ్య 164.6 కిమీ సరిహద్దు ఉన్నది. గత అర్థ శతాబ్దంగా నెలకొన్న వివాదాలు ఇటీవల బయట పడడం, వివాదస్పద భూభాగాన్ని ‘నో మ్యాన్స్ ‌ల్యాండ్‌’‌గా ‘యథాస్థితి (స్టాటస్‌ ‌క్వో )’ కొనసాగించాలనే నిబంధన విధించబడింది. నేడు ఆ భూభాగం కోసమంటూ రెండు రాష్ట్రాలు అనునిత్యం గిల్లికజ్జాలు పెట్టుకుంటూ పోరాడుతున్నాయి.

అస్సాం-మేఘాలయ వివాదం :
అస్సాం-మేఘాలయ రాష్ట్రాల మధ్య దాదాపు డజన్‌ ‌ప్రాంతాల్లో (అప్పర్‌ ‌తరబరీ, గజాంగ్‌ ‌రిజర్వ్ ‌ఫారెస్ట్, ‌హహిమ్‌, ‌బోక్లపర, కనపర-పిలాలగ్‌కట, రటచెర్ర, కమ్రూప్‌, ‌చచ్చర్‌ ‌లాంటి) సరిహద్దు వివాదాలు ఉన్నాయి. బ్రిటీష్‌ ‌నిర్ణయం ప్రకారం నేడు అస్సాంలోని ‘కర్బి ఆన్‌గ్లాంగ్‌’ ‌జిల్లాని ‘మికిర్‌ ‌హిల్స్’ ‌తమ భూభాగమని మేఘాలయ వాదిస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిమీ సరిహద్దు వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి రావడం హర్షదాయకం, అభినందనీయం. స్వల్ప వివాదాలు ఉన్న 6 సరిహద్దు ప్రాంతాలను వెంటనే పరిష్కరించుకుందామని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధిక వివాదంలో లాంగ్‌పిహ్‌, ‌బార్దుర్‌, ‌నోగ్వా, మటముర్‌, ‌దేశ్‌డెమెరియా, ఖాందులి ప్రాంతాలు చిక్కుకున్నాయి.

అస్సాం-నాగాలాండ్‌ ‌వివాదం :
అస్సాం-నాగాలాండ్‌ ‌మధ్య 434 కిమీ పొడవైన సరిహద్దు ఉంది. అస్సాంలోని శివసాగర్‌, ‌నాగావ్‌, ‌జోర్హట్‌, ఉరిమ్‌ఘట్‌, ‌గోలఘాట్‌ అటవీ ప్రాంతాలు నాగా హిల్స్‌లోకి వస్తాయని నాగాలాండ్‌ 1963 ‌నుంచి వాదిస్తున్నది. 1968, 1979, 1985, 2007, 2014లో జరిగిన సరిహద్దు వివాదాల్లో హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. ఉరిమ్‌ఘట్‌ ‌ప్రాంతంలోని గ్రామాల వందల ఇళ్లకు నాగాలాండ్‌ అల్లరి మూకలు నిప్పంటించడం గమనించాం. నేడు రెండు రాష్ట్రాలు యథాస్థితిని పాటిస్తూ, సామరస్య ధోరిణితో చర్చలు జరిపి పరిష్కరించు కోవాలని తీర్మానించడం శుభ పరిణామంగా చెప్పవచ్చు.

అస్సాం-అరుణాచల్‌ ‌ప్రదేశ్‌:
ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు తమకు చెందాల్సిన అధిక భూభాగాన్ని అస్సాంలోకి చేర్చారని అరుణాచల్‌ ‌వాదిస్తున్నది. అస్సాం, అరుణాచల్‌ల మధ్య 804 కిమీ సరిహద్దు ఉంది. 1987లో అరుణాచల్‌ ఏర్పడిన తరువాత కమిటీ సిఫార్సు ప్రకారం కొంత అరుణాచల్‌ ‌ప్రాంతాన్ని అస్సాంకు మార్చాలని సూచిస్తూ, మరో భాగాన్ని అస్సాం నుంచి అరుణాచల్‌కు మార్చాలని సిఫార్సు చేసింది. స్థానిక ప్రజలు క్షేత్రస్థాయిలో, ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో నేటికీ పోరాటం చేస్తునే ఉన్నాయి.

లఢక్‌-‌జమ్ము కాశ్మీర్‌ :
‌ముస్లిమ్‌ ‌జనాభా అధికంగా ఉన్న కార్గిల్‌ ‌జిల్లాను లఢల్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, తమ జిల్లాను జమ్ము కాశ్మీర్‌ ‌కేంద్రపాలిత ప్రాంతంలో కలపాలని పోరాటం చేస్తుండటం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చైనా సరిహద్దు వివాదాల కన్న ఈ అంతర్గత పోరు అధికంగా బాధ పెడుతున్నది. లఢక్‌లోని లేహ్‌ ‌జిల్లాలో భౌద్దమతస్థులు అధికంగా ఉన్నారు. లఢక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించని చైనా సమస్యలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నది. లఢక్‌లో లేహ్‌ ‌ప్రాంత భౌద్దులు, కార్గిల్‌ ‌ప్రాంత ముస్లిమ్‌ల మధ్య శాంతి నెలకొనడం కొంత కష్టంగానే తోస్తున్నది.

లఢక్‌ – ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వివాదం:
హిమాచల్‌లోని ‘సర్చు’ ప్రాంతానికి లఢక్‌ ‌వ్యాపారవేత్తలు చొరబడడంతో వివాదం మ్నెదలైంది. జమ్ము కాశ్మీర్‌ ‌రాష్ట్రం ఉన్న సమయంలో మనాలీ-లేహ్‌ ‌జాతీయ రహదారిలో లఢక్‌ ‌వెళ్ళే మార్గంలో పోలీస్‌ అవుట్‌ ‌పోస్ట్ ఉం‌డేది. హిమాచల్‌లోని లహాల్‌, ‌స్పిటి జిల్లాలకు లఢక్‌లోని లేహ్‌ ‌జిల్లా సరిహదులకు మధ్య కొంత కాలంగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. లేహ్‌, ‌మనాలీ రహదారిలో సర్చు పట్టణం ఉంటుంది. రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణీకులు సర్చులో స్వల్ప విరామం కోసం ఆగుతారు. పోలీస్‌ అవుట్‌ ‌పోస్ట్ ఉం‌డడంతో ప్రయాణికులకు అవాంతరాలు కలుగుతున్నాయి.

హిమాచల్‌ ‌ప్రదేశ్‌-‌హర్యానా వివాదం:
హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని పారిశ్రామిక ‘పర్వానూ’ ప్రాంతం హర్యానాలోని ‘పంచ్‌కుల’ జిల్లాకు మార్చాలని హర్యానా ప్రభుత్వం అనాదిగా కోరుతున్నది. రెండు రాష్ట్రాల మధ్య అటవీ భూభాగ సరిహద్దు వివాదం కూడా కొనసాగుతున్నది. ఈ అటవీ ప్రాంతంలో ‘ప్రధానమంత్రి గ్రామ్‌ ‌సడక్‌ ‌యోజన’, పియంజియస్‌వై కింద రోడ్డు నిర్మాణానికి కూడా అంగీకారం రావలసి ఉంది.

ఒడిసా – ఝార్ఖండ్‌ ‌వివాదం :
ఒడిసాలోని ‘కియోంఝర్‌’ ‌జిల్లాకు చెందిన ‘జగన్నాథపూర్‌’ ‌గ్రామం పట్ల ఇరురాష్ట్రాలు పోరాడుతున్నాయి. కియోంఝర్‌ ‌జిల్లా పర్వతాల్లో జనించిన ‘బైతరణి’ నదీ జలాల వినియోగంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నది. ఈ నదీ జలాలు అధికంగా ఒడిసా ప్రాంతాలకు, కొద్ది మ్నెత్తంలో ఝార?ండ్‌కు ఉపయోగపడుతున్నాయి.

ఒడిసా-పశ్చిమ బెంగాల్‌ ‌వివాదం :
‘బాలసూర్‌’ ‌జిల్లాలోని 82 గ్రామాల పట్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నది. ఒడిసా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 08 జిల్లాలు సరిహద్దు వివాదంలో నలుగుతున్నాయి. ఒడిసాలోని ఇనుప ఖనిజ వనరులున్న ‘మయూర్‌భంజ్‌’ ‌జిల్లా సరిహద్దుల్లో కూడా వివాదం నలుగుతోంది.

ఒడిసా-ఛత్తీస్‌ఘడ్‌ ‌వివాదం :
ఒడిసాలోని నాబరంగ్‌పూర్‌, ‌జర్సుగూడ జిల్లాల్లోని కొన్ని గ్రామాల పట్ల రెండు రాష్ట్రాలు వివాదంతో ఊగుతున్నాయి. రెండు రాష్ట్రల జల వివాదాల పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ‘మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌’‌ను ఏర్పాటు చేసింది.

ఒడిసా- ఆంధ్రప్రదేశ్‌ ‌వివాదం :
ఒడిసాలోని ‘కోరపుట్‌’ ‌జిల్లాకు చెందిన మూడు గ్రామల్లో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఇటీవలే ఎన్నికలు కూడా నిర్వహించింది. దీనికి తోడుగా ఒడిసాలోని గంజమ్‌, ‌గజపతి, రాయగడ జిల్లాల్లోని పలు గ్రామాలు తమవే అంటూ ఆంధ్ర వాదిస్తున్నది. 1960 నుంచి రెండు రాష్ట్రాల మధ్య ‘కోటిలా గ్రామ పంచాయత్‌’‌కు చెందిన 21 గ్రామాలు వివాదంలో ఉన్నాయి. ఒడిసాలోని కోరపూట్‌, ఆం‌ధ్రప్రదేశ్‌, ‌విజయనగరం జిల్లాలోని సాలుర్‌ ‌ప్రాంతా ప్రజలు రెండు రాష్ట్రాల పథకాలను అనుభవిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కూడా ఉన్నదని, 2006లో ఒడిసా కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు కూడా చేసింది.

మహారాష్ట్ర – కర్నాటక వివాదం:
1956 నుంచి కర్నాటకలోని మరాటీ అధికంగా మాట్లాడే ప్రజలున్న ‘బెల్గామ్‌’ ‌జిల్లా ప్రాంతమంతా తమదే అంటూ మహారాష్ట్ర వాదనకు దిగుతోంది. బ్రిటీష్‌ ‌పాలనలో బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న బెల్గామ్‌ ‌ప్రాంతం 1956 రాష్ట్రాల పునర్విభజనలో కర్నాటకాకు కేటాయించబడిన విషయం మనకు తెలుసు.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ‌నీటి యుద్ధాలు :
ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణల మధ్య జల వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో రెండు రాష్ట్రాల మంత్రులు శ్రీశైలం జలాలపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి చేయి దాటడం మ్నెదలైంది. కృష్ణ, గోదావరి నదులపై ఉన్న, నిర్మిస్తున్న ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల జల యుద్ధాన్ని నివారించడానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించి, కృష్ణ, గోదావరి రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డులను (కెఆర్‌యంబి, జిఆర్‌యంబి) వేరువేరుగా ఏర్పాటు చేసింది. నదీ జలాల వివాదాలను 14 అక్టోబర్‌-2021 ‌నుంచి ఈ బోర్డుల పరిధిలోకి 36 కృష్ణా నదిపై ప్రాజెక్టులను, 71 గోదావరి నదుల ప్రాజెక్టులను తెస్తున్నామని, ఈ బోర్డులే ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్‌, ‌పాలన, రెగ్యులేషన్‌ ‌పనులను చూసుకుంటాయని, దీని కోసం ఒక్కో రాష్ట్రం 200 కోట్లును బోర్డుల పేరున జమచేయాలని సూచించింది.

భారతదేశంతో ఇరుగుపొరుగు దేశాలు 15,107 కిమీ పొడవు సరిహద్దులను, 7,517 కిమీ తీర ప్రాంతాలను కలిగి ఉంది. ఇండియాకు బాహ్య ముఖ్య శత్రు దేశాలుగా చైనా, పాకిస్థాన్‌ ‌నిత్యం కాలు దువ్వుతున్నారు. ఈ దేశాలతో పాటుగా మయన్మార్‌, ‌నేపాల్‌, ‌భూటాన్‌లు కూడా సరిహద్దు వివాదాలను రేపుతున్నాయి. సరిహద్దు దేశాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలను గమనిస్తూ, అవసరమయునపుడు వారికి సరైన బుద్ది చెప్పడానికి భారత్‌ ఎన్నడు వెనకడుగు వేయలేదు. బాహ్య శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారతంలో అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు అంతర్గత అశాంతికి కారణం కావడం సోచనీయం. వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వ మద్యవర్తిత్వంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ‘స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాల’ వేళ ప్రతిన బూనుదాం. ‘ఆజాద్‌ ‌కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply