- రూ.లక్ష అప్పు నుంచి వేల కోట్లకు ఎదగడంపైనే స్పెషల్ ఫోకస్…
- త్వరలో తెలంగాణలో దూకుడు పెంచనున్న విజయశాంతి
- రాములమ్మ భవిష్యత్‌కు బిజెపి పెద్దలు పక్కా స్కెచ్
- గ్రేటర్లో ప్రచారం లేనట్లే?
- తెలంగాణ కోసమే…తమిళనాడులో ప్రచారం మాత్రమే?
(ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్) పుట్టింటికి(బిజెపి) వెళ్లేందుకు ఖాయమైన విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ భవిష్యత్ సుస్థిరంగా ఉండటం కోసం, తెలంగాణ సిఎం కేసీఆర్ టార్గెట్‌గా ఢిల్లీ బిజెపి నేతలు పక్కా స్కెచ్ వేస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి తాజా పరిణామాలు, ఢిల్లీ బిజెపి వర్గాలు. విజయశాంతికి ఉన్న పాపులారిటీతో బిజెపి పార్టీని సౌత్ ఇండియాలో బలోపేతం చేసుకోవడంతో పాటు తెలంగాణలో రాజకీయంగా బలంగా స్థిరపడే విధంగా కేంద్ర బిజెపి నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. బిజెపిలో చేరగానే దూకుడును పెంచి భవిష్యత్‌లో తెలంగాణలో బిజెపిని అధికారంలో తెచ్చే విధంగా రాములమ్మ తన ఆలోచనలన్నింటినీ ఇప్పటికే కేంద్రంలోని బిజెపి పెద్దలకు వివరించడంతో పాటు ముఖ్యంగా అధికారం నుంచి సిఎం కేసీఆర్‌ను దింపడమే లక్ష్యంగా రాములమ్మ వేసే ప్రతి స్టెప్‌కు కేంద్రంలోని బిజెపి నాయకత్వం సంపూర్ణ సహకారం అందిస్తామన్న స్పష్టమైన హామీని విజయశాంతికి ఇచ్చారనీ విశ్వసనీయ సమాచారం. దీని కోసమే బిజెపిలో చేరిక విషయమై అటు జాతీయ బిజెపి పెద్దలు, ఇటు రాములమ్మ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ ఉద్యమంతో పాటు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా పార్లమెంటు హాలులో క్రియాశీలక పాత్రను పోషించిన రాములమ్మ బిజెపిలో చేరగానే తెలంగాణ రాజకీయాలలో దూకుడు పెంచే ఆలోచనలో ఉన్నట్లు, ముఖ్యంగా అధికార టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా పని చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమైనట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు మంగళవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. ఆరేడేండ్ల కిందట లక్ష రూపాయలు లేని కుటుంబం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు సంపాదించిందనీ, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాత్రం నేడు సుమారు 4 లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పుల తెలంగాణ మార్చిన వైనంపైనే రాములమ్మ, బిజెపి నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టారనీ, ఇదే అంశంపై ప్రజల్లోకి వెళ్లాలనీ నిశ్చయించుకున్న విజయశాంతికి కేంద్ర బిజెపి నాయకత్వం కూడా పూర్తి బాసటగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అవినీతిపై భవిష్యత్‌లో విజయశాంతి చేసే పోరాటాలకు బిజెపి ఢిల్లీ పెద్దల నుంచి పూర్తి మద్దతు ఉంటుందనీ చెప్పినట్లు తెలుస్తుంది.
తెలంగాణలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పుట్టింటికి(బిజెపి)వెళ్లడంపై ప్రస్తుతం రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. తెలంగాణ మాదిరిగానే రాములమ్మకు తమిళనాడులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బిజెపిలో చేరాక తమిళనాడులో కేవలం ప్రచారం మాత్రమే చేయనున్నారనీ సమాచారం. తెలంగాణ రాజకీయాలల్లోనే ఉండాలన్నది ఆమె ఆలోచనగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆమె బిజెపి పెద్దలకు ఇప్పటికే చెప్పారనీ సమాచారం. ఇదిలా ఉంటే, విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్, ఛరీష్మాను ఈ ఎన్నికల్లో సంపూర్ణంగా వాడుకోవాలని బిజెపి భావిస్తుండగా…విజయశాంతి సైతం తన పూర్తి సహకారాన్ని అందించాలనే ఆలోచనలోనే ఉన్నారనీ తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులను, టిఆర్ఎస్లోని అసంతృప్త నేతలందరినీ, కాంగ్రెస్‌లోని తన అనుచరవర్గంను, అభిమానులను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి తద్వారా గ్రేటర్లో బిజెపి పుంజుకునేలా విజయశాంతి తనదైనశైలిలో అడుగులు వేస్తున్నారనీ తెలుస్తుంది. కాగా, బిజెపితోనే రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతికి బిజెపి జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపికి విజయశాంతికి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఛరీష్మా ఉన్న లీడర్ సౌత్ ఇండియాలో చాలా అవసరం. ప్రస్తుతం బిజెపి బలపడుతున్న టైంలో విజయశాంతి వంటి లీడర్ బిజెపిలో చేరడం వల్ల బిజెపికి కూడా రాజకీయంగా చాలా కలిసి వొస్తుందన్న ఉద్దేశంతోనే బిజెపి జాతీయ నేతలే విజయశాంతిని బిజెపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.
బిజెపిలో చేరే విజయశాంతికి కేంద్రంలో మంచి పదవీ ఇవ్వొచ్చనీ సమాచారం. విజయశాంతిని రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. తద్వారా రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు విజయశాంతి కీ రోల్ పోషించేవిధంగా పక్కా ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అటు బిజెపి, ఇటు విజయశాంతి ఇద్దరిదీ కూడా రాష్ట్రంలో కేసీఆర్‌ను అధికారం నుంచి గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా తెలుస్తుంది. దీని కోసం విజయశాంతి వద్ద ఉన్న ఐడియాస్‌కు తగ్గట్టుగా జిజెపి జాతీయ నాయకత్వం చాలా పకడ్బందీ వ్యూహంను అమలు చేస్తూ…ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తంగా విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వొచ్చేసింది. దుబ్బాక ఫలితానికి ముందు వరకూ సందిగ్ధంలో ఉన్న రాములమ్మ ఆ తరువాత మాత్రం పార్టీ మార్పుపై ఓ నిర్ణయానికి వొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లి వొచ్చిన అనంతరమే బిజెపి తరపున ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆమె ప్రచారం ఉండకపోవచ్చనీ తెలుస్తుంది. అయితే, ఆమె ఇటీవలి కాలంలో తన ఫేస్బుక్ ద్వారా అధికార టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా, పార్టీ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ఆగడాలపై రెగ్యులర్‌గా పెడుతున్న పోస్టులన్నీ పరోక్షంగా బిజెపికి ఉపయోగపడే విధంగానే ఉంటున్నాయనీ, ప్రత్యక్షంగా పార్టీలో చేరకపోయినా..సోషల్ మీడియా పోస్టులతో పరోక్షంగా గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు లబ్ది చేకూరే విధంగా తనవంతు సహకారాన్ని విజయశాంతి అందిస్తున్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.