Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ అభ్యర్థికోసం కాంగ్రెస్‌ ‌కసరత్తు

హుజూరాబాద్‌ ‌శాసనసభ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. చాలా కాలంగా ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా పట్టులేకపోవడంతో అభ్యర్థి ఎంపిక కష్టతరంగా మారింది. అందునా ఇప్పుడు ఇక్కడ జరిగే ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. అటు కమలాపూర్‌గాని, ఇటు హుజూరాబాద్‌గాని నియోజకవర్గమేదైనా దాదాపు దశాబ్దానికి పైగా ఇక్కడ టిఆర్‌ఎస్‌ ఆధిపత్యం వహిస్తూ వొచ్చింది. నిన్నటి వరకు ఇక్కడ టిఆర్‌ఎస్‌కు ఎదురులేని నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్‌ ‌కాషాయ కండువ కప్పుకోవడంతో ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు కూడా ఈ ఎన్నిక పరీక్షగానే నిలిచింది. ఎన్నికల్లో తల పండిన సీనియర్‌ ‌నాయకుడు ఈటల రాజేందర్‌పైన ఇంతవరకు ఏ ఎన్నికలో పోటీ చేయని సాదాసీదా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌బరిలోకి దింపుతుంది. ఒక విధంగా ఇద్దరు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పక్షాన తెలంగాణ సాధన ఉద్యమంలో కలిసి పనిచేసినవారే కావడం విశేషం. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి అదే పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ ‌గెలుపుకోసం ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్‌రావుకు ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ ‌బాధ్యతలను అప్పగించాడు. హరీష్‌రావు రంగంలోకి దిగాడంటేనే అక్కడ గెలుపు ఖాయమన్న నమ్మకం అటు నాయకుల్లో, ఇటు కార్యకర్తల్లో బలంగా ఉంది.

ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ ఇం‌కా అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే మల్లగుల్లాలు పడుతున్నది. ఈటల రాజేందర్‌కు గతంలో గట్టి పోటీ ఇచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి సరైన సమయానికి పార్టీకి చెయ్యి ఇవ్వడం ఆ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. స్థానిక నాయకులెవరూ బిజెపి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎదుర్కునే స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ‌ప్రస్తుత పరిస్థితిలో తాను పోటీచేయనని చెప్పడంతో ముద్దసాని కశ్యప్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు వినిపించాయోలేదో వారిద్దరినీ టిఆర్‌ఎస్‌ ‌లాగేసుకోవడం మరింత గందరగోళంగా మారింది. హుజూరాబాద్‌లో ఎస్సీ, బిసి వోటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో ఆయా సామాజిక వర్గాల నేతలకోసం గాలింపు ప్రారంభించింది కాంగ్రెస్‌.

ఎస్సీలు ఇక్కడ బలంగా ఉండటంతో స్థానిక డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణరెడ్డిని, లేదా వరంగల్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్యను బరిలో దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ఉం‌ది. బిసి వర్గాల్లో మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ సామాజిక వర్గాల సంఖ్య ప్రాధాన్యతా క్రమంలో ఉండడంతో అ వర్గాల నేతల కోసం అన్వేషిస్తున్నారు. విచిత్రంగా మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన కొండా దంపతులైతే ఇందుకు సరైన వ్యక్తులన్న ప్రచారం జరుగుతుంది. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నిక కావడంతో ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేయాలన్నది ఆయన అభిలాష. అందుకే ఎట్టి పరిస్థితిలో హుజూరాబాద్‌ ‌స్థానాన్ని చేజార్చుకోకుండా ఉండేందుకు అభ్యర్థి విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.

కొండా సురేఖ మాజీ మంత్రిగా, గతంలో కూడా కాంగ్రెస్‌ ‌నాయకురాలిగా కొనసాగిన నేపథ్యంలో అమెకు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సత్సంబంధాలున్నాయి. అంతేగాక 2008లో హనుమకొండ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో పాల్గొన్నప్పుడు కమలాపూర్‌ ‌ప్రజలకు పరిచయమైన నాయకురాలు. ఆమె స్వంత నియోజకవర్గం పరకాల హుజూరాబాద్‌ ‌పక్కనే ఉండటం వల్ల కొత్తగా వోటర్లకు పరిచయం కావాల్సిన అవసరంలేదు. అన్నిటికీ మించి కొంతకాలంగా ఆమెకు టిఆర్‌ఎస్‌ ‌తన రాజకీయ భవిష్యత్‌తో అడుకుందన్న ఉక్రోషముంది. దీంతో టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలదని కాంగ్రెస్‌ ‌భావిస్తుంది. దానికి తగినట్లు ఎదుటి పక్షాలు భయపడితే భయపడే తత్వం కాదు సురేఖది.

ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలదన్న నమ్మకం ఉండడటంతో ఆమె వైపే అధిష్టానం కూడా మొగ్గే అవకాశాలు లేకపోలేదు. బిజెపి నుండి బరిలో దిగుతాడనుకుంటున్న ఈటల రాజేందర్‌ ఒక వేళ ఆయన భార్యను దింపినా అమెకు పోటీగా కాంగ్రెస్‌ ‌కూడా మహిళా నాయకురాలిని నిలబెట్టినట్లు ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆమెకూడా సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. అయితే స్థానిక కిసాన్‌ ‌మోర్చ నాయకుడు పత్తి క్రిష్ణారెడ్డి పేరుకూడా వినిపిస్తున్నది. వీరిద్దరిలో ఎవరికైనా పార్టీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కాగా మరో ఎన్‌ఆర్‌ఐ ‌పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన రెండు ప్రధాన పార్టీలకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలన్న లక్ష్యంగా శనివారం దీనిపై కొత్తగా ఏర్పాటైన పొలిటికల్‌ ఎఫైర్‌ ‌కమిటి సమావేశం కాబోతున్నది. బహుషా సాయంత్రంలోగా అభ్యర్థి ప్రకటన వెలువడుతుందనుకుంటున్నారు.

Leave a Reply