Take a fresh look at your lifestyle.

గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇష్టారీతిలో హామీలు

వంద రోజులు వేచి చూస్తాం…నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు
పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి
కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
కేటాయింపులు లేకపోయినా బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ రెడ్డి మౌనం ఎందుకని ట్వీట్‌


కూకట్‌ పల్లి ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి, ఆరున్నర లక్షల మంది రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని  కూకట్‌పల్లిలోని ఎన్‌కేఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్య్రమానికి  మాజీ మంత్రి బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…మోసపూరిత హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తున్నదని అన్నారు. తాము వంద రోజుల పాటు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఉచిత బస్‌ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ సరైనన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయటం వల్ల బస్సులలో ప్రయాణించే మహిళలు, పురుషులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఉచిత బస్‌ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఈ రోజు వరకు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదివేల రూపాయలు సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే రానున్న ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..కూకట్‌పల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో తాను గెలిచానంటే దానికి కేటీఆర్‌, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమమే ముఖ్య కారణమని, అలాగే ఎంతో నిబద్ధతతో పనిచేసే నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలే తనకు అండగా ఉండి ఇంత మెజారిటీ సాధించడానికి కృషి చేశారని వారిని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి గతంలో పదవుల పంపకం విషయంలో కొంత అన్యాయం జరిగిందని, భవిష్యత్తులో నియోజకవర్గానికి పెద్దపీట వేయాలని కోరగా దీనికి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. అలాగే ఎంతో విజన్‌ ఉన్న నాయకుడు కేటీఆర్‌ అని, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని అన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మరోసారి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు శంబిపూర్‌ రాజు, నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా, నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటాయింపులు లేకపోయినా బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ రెడ్డి మౌనం ఎందుకని ట్వీట్‌
తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ‘బీజేపీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు..తెలంగాణ ప్రాజెక్టులు అన్యాయంగా కేఆర్‌ఎంబీకి అప్పగింతపై ఎందుకు మౌనంగా ఉన్నారు… కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోనాలు తాకట్టు పెడతారా..?’ అని ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply