Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఈడబ్ల్యుఎస్‌ ‌రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం

ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగుతాయి సీఎం కేసీఆర్‌

‌తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యుఎస్‌) ‌రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆ సామాజిక వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌సౌకర్యం అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖరరావు గురువారం వెల్లడించారు. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇప్పటికే 50 శాతం మేర రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ‌తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈడబ్ల్యుఎస్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్ల అమలు కానున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో దేశంలోని ఆర్థికంగా వెనకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే, ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదు. తాజాగా సీఎం కేసీఆర్‌ అ‌గ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయంతో ఆ వర్గాలకు కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Leave a Reply