Take a fresh look at your lifestyle.

కత్తులు మనకు దొరకయా?

ఆదమరిచి వోట్లేస్తే ఐదేళ్లు ఆగమైతం
తెలంగాణ ఏర్పడిన నాడు ఎటు చూసిన చీకట్లే
నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
అసైన్డ్ ‌భూములకు పట్టాలిస్తాం
దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షతోనే సిఎం అయ్యాను
దుబ్బాకకు రఘునందన్‌రావు ఏకానా పని చేయలేదు…
దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌కొత్త ప్రభాకర్‌రెడ్డి చీమకు కూడా అన్యాయంచేయలేదు..గర్వపడలేదు..దర్పం చూపలేదు..అటువంటి మంచి వ్యక్తిపై కత్తి దాడి జరిగింది..ఎప్పుడైనా దుబ్బాక ప్రాంతంలో కత్తిపోట్ల సంస్కృతిని చూశామా? కత్తులు మనకు దొరకయా? వాడికన్న పెద్ద కత్తులు తేగలం. కానీ, పద్దతి కాదనీ ఊరుకున్నామనీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తరపున దుబ్బాకలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డకంటే మరేమీ ఉండదనీ, దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దుబ్బాక పాఠశాలలో చదువుకున్నాననీ, ఇక్కడి పాఠశాల పెట్టిన భిక్ష వల్లనే తాను సిఎం అయ్యానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నా రావల్సిన విధంగా పరిణతి రాలేదన్నారు. ఎలక్షన్స్ ‌వొస్తే అనేక పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారనీ, అయితే అభ్యర్థుల మంచి చెడులు, పార్టీ చరిత్ర, నడవడికను చూసి ఎవరి చేతుల్లో ఉంటే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి వోటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో వోటు అనేది వజ్రాయుధమని, ఈ వోటును ఆదమరిచి వేస్తే ఐదేళ్లు ఆగమైతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. చావును కూడా లెక్క చేయకుండా పోరాడి తెలంగాణను సాధించుకున్నామనీ, తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్రంలో ఎటు చూసినా చీకట్లే ఉండేవన్నారు. 2014నుంచి సంక్షేమానికి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పింఛన్లను 5వేల రూపాయలు చేస్తామనీ, దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి వాహనం, కేసీఆర్‌ ‌కిట్లు, ఆడపిల్ల పుడితే 13వేల రూపాయలు, మగపిల్లాడు పుడితే 12వేల రూపాయలు ఇస్తున్నామనీ, వీటిపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. రైతులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయనీ, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని, నమ్మి వ్యవసాయాన్ని స్థిరీకరిస్తున్నట్లు తెలిపారు. దీని కోసమే 24గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతో పాటు దేశంలో ప్రాజెక్టుల ద్వారా నీళ్లనిస్తూ రైతుల వద్ద పన్నులను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 7500కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరను ఇచ్చి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని సిఎం కేసీఆర్‌ అన్నారు. సిఎం కేసీఆర్‌కు ఏం పని లేదనీ రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి ఉచిత కరెంటు అవసరం లేదు, 3 గంటల పాటు కరెంటు సరిపోతుందనీ కాంగ్రెస్‌ ‌నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అంటున్నారనీ, రైతుబంధు దుబారానా…అని ప్రజలను సిఎం అడిగారు. అదే విధంగా రైతులను దృష్టిలో పెట్టుకుని ధరణిని తెస్తే…కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్త అది కూడా తీసేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేతలు మొదలుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ ‌వరకు అంటున్నాడనీ…ధరణి తీసేయాలా..అని ప్రజలను అడిగినప్పుడు వొద్దు..వొద్దు ఉండాల్సిందేనని ప్రజల నుండి సమాధానం వొచ్చింది. ధరణి వల్ల రైతుల భూములు చాలా భద్రంగా ఉంటాయనీ, రాహుల్‌ ‌గాంధీకి ఎద్దు, ఎవుసం ఏం తెలుసునని మాట్లాడుతున్నాడనీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తే భూమాత తెస్తారా? భూమేతనా? అని సిఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ధరణి ఉండటం వల్లే నేరుగా రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయనీ, ధరణి వల్ల రైతుల భూములు భద్రంగా ఉంటాయని సిఎం కేసీఆర్‌ ‌భరోసా ఇచ్చారు.

దుబ్బాకకు రఘునందన్‌రావు ఏకానా అభివృద్ధి చేయలేదు…
రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు అన్నీ అబద్దాలు చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడనీ, ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు దుబ్బాకకు ఏకానా పని కూడా చేయలేదని సిఎం కేసీఆర్‌ ‌మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో తాను ప్రచారానికి వొచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదనీ, ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. తాను రాకపోవడం వల్ల అబద్దాలకోరు గెలిచాడన్నారు. ఈసారి ఆ మోసకారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. అసైన్డ్ ‌భూములు గుంజుకుంటామంటూ బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అసైన్డ్ ‌భూములకు కొత్త ప్రభుత్వంలో పట్టాలిస్తామన్నారు. ఎంపిగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి చాలా సౌమ్యుడు అని, దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా నిలబడతా అని ఆయన అడుగలేదనీ, ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తానే కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరానని అన్నారు.

దుబ్బాక పట్టణం రోజు రోజుకూ విస్తరిస్తున్న దృష్ట్యా త్వరలోనే రింగ్‌రోడ్డుతో పాటు ఆర్డీవో కార్యాలయం, మిరుదొడ్డి, చేగుంట మండల కేంద్రాలలో డిగ్రీ కళాశాలతో పాటు ప్రభాకర్‌రెడ్డివి కోరినవన్ని చేస్తానని అన్నారు. అయితే, గత ఉప ఎన్నికల్లో జరిగిన పొరపాటు జరగకూడదని, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తేనే ఆయన కోరినవన్ని నెల రోజుల్లో చేస్తానని అన్నారు. దుబ్బాక అంటే తనకు ప్రత్యేక అభిమానం, అనుబంధం ఉంటుందని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సభలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు, ఎమ్మెల్సీలు వంటేరు డాక్టర్‌ ‌యాదవరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌ ‌హుస్సేన్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కొత్త పుష్పలత కిషన్‌రెడ్డి, వనిత భూంరెడ్డి, కడతల రవీందర్‌రెడ్డి, బాణాపురం కృష్ణారెడ్డి, సోలిపేట సుజాత, సతీష్‌రెడ్డి, రొట్టే రాజమౌళి, కోమటిరెడ్డి వెంకట్‌నర్సింహారెడ్డి(కేవీఎన్‌ఆర్‌), ‌జీడిపల్లి రాంరెడ్డి, తీపిరెడ్డి మహేష్‌రెడ్డి, మూర్తి శ్రీనివాస్‌ర్డెడ్డి, రణం శ్రీనివాస్‌గౌడ్‌, ‌లాయర్‌ ‌చంద్రశేఖర్‌రెడ్డి, చిందం రాజ్‌కుమార్‌తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply