Take a fresh look at your lifestyle.

కమ్యూనిస్టు ఉత్తమ విలువలకు నిలువుటద్దం డాక్టర్ పోలవరపు జశ్వంతరావు

కమ్యూనిస్టు ఉత్తమ విలువలతో విప్లవ జీవితం గడిపిన డాక్టర్ పోలవరం జశ్వంతరావు ఆగస్టు 27న హైదరాబాద్ హాస్పటల్లో కరోనా వ్యాధితో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో 73 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. జస్వంత్ సిపిఐ ఎంఎల్ పార్టీ కేంద్ర కార్యదర్సివర్గ సభ్యునిగా, రాష్ట్ర పార్టీ నిర్వహణలో వెలుగుతున్న జనశక్తి తెలుగు పత్రిక కు, ఆలిండియా పార్టీ నిర్వహిస్తున్న క్లాస్ స్ట్రగుల్ ఇంగ్లీషు పత్రికకు సంపాదకునిగా, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శిగా అలుపెరగని కృషిని కొనసాగించారు. జశ్వంత్ తండ్రి జగన్ మోహన్ రావుది కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర గల తమిరిస గ్రామం. ఆయన గుంటూరు జిల్లాలో తాసిల్దార్ గాచేసి చివరికి ఆర్డీవోగా పదవి విరమణ చేశారు. జస్వంత్ డిగ్రీ తర్వాత 1965-66 లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థిగా చేరారు. అక్కడి నుంచి జస్వంత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. జస్వంత్ మెడికల్ విద్యార్థుల బృందం కాలేజీ ప్రిన్సిపాల్ కులతత్వ అహంభావ ధోరణులకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. ఆ తరువాత విద్యార్థి ఫెడరేషన్ నాయకత్వాన అనేక సమస్యలపై నిరంతరం ఆందోళన సాగిస్తూ విద్యార్థులను సంఘటితం చేసేవారు. 1970 ఏప్రిల్ 22న కాకినాడలో జరిగిన లెనిన్ జయంతి సభ విజయవంతం కావడంలో జశ్వంత్ బృందం ప్రధాన పాత్ర నిర్వహించారు. 1973-75 కాలంలో ఇటీవలనే క్యాన్సర్ వ్యాధితో మరణించిన కరీం గారు కన్వీనర్గా యువ సాహితీ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి సమకాలీన రాజకీయ సమస్యలపై చర్చావేదికలు నిర్వహించటం, నాటకాలు వేయడం చేసేవారు. ఆ క్రమంలోనే విప్లవపార్టీ రాజకీయాలను సొంతం చేసుకున్నారు.

ఎమర్జెన్సీ కాలంలో పార్టీ నాయకుడిని కలిశారనే నెపంతో జస్వంత్ తో పాటు మరికొందరు పార్టీ నాయకులపై పోలీసులు తూర్పుగోదావరి కుట్ర కేసును బనాయించారు. కేసు పెట్టక ముందు పోలీసులు చిత్రహింసలకు గురి చేసినా ఏ మాత్రం బెదరలేదు. కుట్ర కేసు ఫలితంగా జస్వంత్ రాజమండ్రి సెంట్రల్ జైలులో 18 నెలలు జైలు జీవితం అనుభవించారు. 1980లో కుట్ర కేసును కొట్టివేశారు. 1978 లో జశ్వంత్ ప్రముఖ వామపక్ష నాటక రచయిత సుంకర సత్యనారాయణ గారి మూడవ కుమార్తె శేషమ్మతో పార్టీ దండల పెళ్లి విజయవాడలో జరిగింది. శేషమ్మ బాబాయిలు సుబ్బారావు, వీరభద్ర రావు, శివరామయ్య, మేనత్త అన్నే అనసూయమ్మ అందరూ వామపక్ష కుటుంబం కావడంతో శేషమ్మ జస్వంత్ కు అన్ని విధాలా జీవిత భాగస్వామిగా సహాయ సహకారాలు అందించింది. డాక్టర్ కావలసిన జశ్వంత్ రోగులకు శస్త్ర చికిత్స చేయటానికి బదులు రాజకీయ అర్థశాస్త్రం పట్ల మక్కువ పెరగడంతో సమాజానికి శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ పరిణామాన్ని గమనించిన పార్టీ నాయకత్వం జశ్వంత్ ను అన్ని విధాలా ప్రోత్సహించి తరిమెల నాగిరెడ్డి రూపొందించిన తాకట్టులో భారతదేశం వెలుగులో ఆర్థిక విషయాలపై పట్టు సంపాదించాలని మార్గదర్శనం చేసింది. కాకినాడలో ఉండగానే జనశక్తి కి ఆర్థిక అంశాలపై వ్యాసాలు పంపించే క్రమంలో జనశక్తి సంపాదక బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదిగారు. మార్క్సిస్టు మేధావి తరిమెల నాగిరెడ్డి నడిపిన జనశక్తి పత్రిక నిలబెట్టిన విలువలకు ఏ మాత్రం తగ్గకుండా 57 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న జనశక్తి పత్రిక కు జస్వంత్ 40 సంవత్సరాల పాటు జనశక్తి పత్రిక ఎడిటర్ గా కృషి చేయడం ఎంతో గొప్ప విషయం. సమాజాన్ని, ప్రజలను వేధిస్తున్న అనేక రాజకీయ ఆర్థిక ఉద్యమ సమస్యల పరిష్కారానికి పదునైన ఆయుధంగా జనశక్తి ని అందించారు.

పార్టీ కేంద్ర కమిటీ నాయకులు అయిన తర్వాత ముందుగా vanguard తర్వాత ముక్తి గామి, ముంబై నుండి జనశక్తి ఇంగ్లీషు పత్రికలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. నక్సల్ బరి ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్ నేతృత్వంలో 2005 లో ప్రారంభమైన class struggle కు ఆఖరి క్షణాల వరకు ఎడిటర్ గా బాధ్యత వహించారు. పార్టీ పత్రికలను ఆర్గనైజర్లు గా రూపొందించటంలో జశ్వంత్ అన్ని శక్తులను వడ్డీ నిర్విరామంగా కృషి చేశారు. నాగిరెడ్డి కుట్ర కేసు గా పేరుగాంచిన కుట్ర కేసు విచారణ సందర్భంగా నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం కోర్టు స్టేట్మెంట్ను చదివి వినిపించారు. దానినే ముందుగా ఇంగ్లీషులో తర్వాత తెలుగులో ముద్రించారు. నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం లో పేర్కొన్న విశ్లేషణలు ఈ నాటికీ ఏవిధంగా సరిగ్గా ఉన్నాయో ప్రతి చాప్టర్లో తాజా గణాంకాలను జోడించి నేటి పరిణామాలను వివరించే బృహత్తర కర్తవ్యాన్ని జస్వంత్ చేపట్టి పూర్తి చేశారు. ఆ విధంగా తాకట్టులో భారత దేశాన్ని సుసంపన్నం చేసే బాధ్యతను నిర్వహించారు. జస్వంత్ తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శిగా, ట్రస్టు ఆశయాలను కొనసాగించే దానిలో భాగంగా మార్క్సిస్టు మహోపాధ్యాయ రచనలను ప్రచురించటం తోపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన చారిత్రక పత్రాలను ట్రస్టు సభ్యుల టీం వర్క్ తో తీసుకురావటం గొప్ప విషయం. సమకాలీన రాజకీయ సమస్యలపై రాష్ట్రస్థాయిలో ట్రస్ట్ సదస్సులు నిర్వహించి మంచి కృషి చేసింది.

50 సంవత్సరాల పాటు విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేయటం ఎన లేని విషయం. ఈ మొత్తం కాలంలో కమ్యూనిస్ట్ విప్లవోద్యమంలో ఎదురైన మితవాద, అతివాద దుందుడుకు విధానాలపై రాజీలేని సైద్ధాంతిక పోరాటం చేసిన వాడు. సీనియర్ నాయకుల నుంచి, నిరంతరం సాగే ప్రజా ఉద్యమాల నుంచి నేర్చుకుంటూ తను సైద్ధాంతిక పునాదిని పదును పెట్టుకున్న మార్క్సిస్టు మేధావి. జస్వంత్ నిలబెట్టిన కమ్యూనిస్టు విలువలను, త్యాగపూరిత జీవితాన్ని పుణికిపుచ్చు కుందాం. జస్వంత్ కొనసాగించిన ఆశయాల సాధన కోసం బోల్షివిక్ దీక్షను పూనుదాం.

ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు
సెల్ : 98481 20105

Leave a Reply