Take a fresh look at your lifestyle.

రోజువారీ కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

  • మళ్లీ 20 వేలు దాటిన కేసుల సంఖ్య
  • తాజాగా 23,529 మందికి పాజిటివ్‌..311 ‌మంది మృతి
  • ఒక్క కేరళలోనే 12,161 కేసులు

దేశంలో కొరోనా రోజువారీ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. మంగళవారం 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా బుధవారం మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్‌ ‌పరీక్షలు నిర్వహించగా..23,529 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. క్రితం రోజు కేసుల 18,870తో పోలిస్తే 24శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇదే సమయంలో మరణాలు కాస్త తగ్గడం ఊరటనిస్తుంది. క్రితం రోజు 378 మంది కొరోనాతో మరణించగా..బుధవారం ఆ సంఖ్య 311గా ఉంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్‌ ‌పొట్టనబెట్టుకుంది.

కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళలోనే వెలుగు చూడటం గమనార్హం. ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా..155 మంది కొరోనాతో మరణించారు. ఇదిలా ఉండగా..కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటం సానుకూలాంశం. బుధవారం మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కోవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతుంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 88.34కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave a Reply