
చైర్మన్
దొడ్డి కొమురయ్య ఫౌండేషన్
అంబేద్కర్ ఇప్పుడు జాతీయవాద చిహ్నాలలో ప్రముఖ స్థానం ఆక్రమించాడు .జాతీయోద్యమ కాలంలో, తదనంతరం కూడా అంబేద్కర్ ను విమర్శించిన వామపక్షం ఇప్పుడు అతనిని హిందూ మత సంస్కర్తగా,సమాజ మార్పు కోరిన తత్వవేత్తగా , గొప్ప మేధో సాంప్రదాయాన్ని నెలకొల్పిన సజీవ మేధో శ్రముడిగా సొంతం చేసుకొని కీర్తిస్తున్నారు .సైద్ధాంతికంగా అంబేద్కర్ తత్వంతో ఏకీభవించని సంఘ పరివారం కూడా తన శ్రేణులకు హిందూ మతములో కొన్ని రుగ్మతలను తొలగించడానికి కృషి చేశారని ఉపరితలంగా,రేఖామాత్రంగా చెపుతోంది.అంబేద్కర్ అసమాన కృషి విస్తృత కృషి ప్రాచుర్యంలో ,అనుభవంలో వచ్చినందున కేవలం దళిత చట్రానికి పరిమితం చేసిన అంబేద్కర్ ను ఈ రోజు మానవతా విలువల ప్రాతిపదిక సామాజిక వ్యవస్థ నిర్మాతగా,సాంఘిక ఆర్ధిక ,రాజకీయ విప్లవకారుడిగా అధ్యయనం చేస్తూ కీర్తిస్తున్నారు.
ఆధునిక భారతదేశ సామాజిక న్యాయం ఆర్థిక స్థిర సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం రాజకీయాలకు అంబేద్కర్ ప్రతీకగా నడుస్తున్నాడు .వైస్రాయ్ కౌన్సిల్ లో ఉన్నప్పుడు కార్మిక మంత్రిగా ఎనిమిది గంటల పని దినాలు సమాన వేతనాలు మరియు సెలవులు సాధించిపెట్టాడు ప్రశంసనీయమైన నాయకత్వంతో జాతీయోద్యమ కాలంలో నే కార్మిక వర్గానికి,అణగారిన వర్గాలకు మహిళలకు విద్యా హక్కు తో సహా అనేక ప్రయోజనాలను అందించాడు.
మానవుడు ఎక్కడైనా మేధో సంపన్నుడు,ప్రజా హితుడు,బలవంతుడు కావాలంటే ముందు అతడు వాటిని తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో ,ప్రజలలో సాధించాలి. దీనికి ప్రతీకగా వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుమన ప్రజలను చీలికలు పేలికలుగా మారుస్తున్న కుల వ్యవస్థను బలహీనం చేసాడు.కులం అనేది నేటికి కూడా బలమైన సామాజిక,రాజకీయ క్రూరమైన వాస్తవికత.ఇది మనుషుల మధ్య అధికారిక సమానత్వాన్ని అనుమతించదు.ఈ రుగ్మతను గుర్తించిన అంబేద్కర్ వారి హక్కుల కోసం జీవితమంతా శ్రమించాడు. జాతీయోద్యమ ప్రజల సంకల్పంతో ప్రజల నుండి వచ్చిన బలమైన ప్రేరణ,ఆశీస్సులతో ప్రస్తుత,భవిష్యత్ సమస్యల పరిష్కారానికి కావాల్సిన స్వేచ్ఛ,సమానత్వం మూల సూత్రాలతో రాజ్యాంగాన్ని రూపొందించి ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రకటన చేసాడు.
కుల నిర్ములన కోసం కులాంతర వివాహాలు, సహా పంక్తి భోజనాలు ,కుల కాలనీల రద్దు వంటి అనేక సామాజిక పద్ధతులను ప్రోత్సహించారు.అలాగే రాజ్యాంగ పద్ధతులను అనుసరించి దళితులకు 15 వ ప్రకరణ వివక్షల రద్దు,17 అంటరానితనం నిషేధము,46 విద్యా ఆర్థిక రక్షణలు,330,332 ప్రకరణలతో చట్ట సభలలో స్థానాల కేటాయింపును కల్పించాడు.
జాతీయోద్యమ కాలంలోనే వ్యవసాయ ఆర్ధిక రంగ సంస్కరణలపై విశేష కృషి చేసారు. ఆ అధ్యయనాలు స్వతంత్ర భారత్ పాలకులకు పాలన విధానాలు, పథకాల రూపకల్పనకు ఆధారం అయ్యాయి. వ్యవసాయం అభివృద్ది చెందాలంటే మేలు రకం సాధనాలు,సేంద్రీయ ఎరువులు వాడాలని,ప్రభుత్వ యజమాన్యంలోనే కమతాల విస్తీర్ణం,వాటిని సంఘటితం చేసి సమిష్టి వ్యవసాయం చేయాలని ప్రతిపాదించి హరిత విప్లవ పునాదులను వేశారు.
పారిశ్రామిక రంగంములో సామ్యవాదం నెలకొల్పాలని ప్రతిపాదించారు.కీలక పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో నడపాలని దానికి రాజ్యాంగపరమైన చట్టాలు రూపొందించారు.భీమా రంగము పూర్తిగా జాతీయం చేయాలని అది వ్యక్తి భద్రతకు,ఆర్ధిక నియంత్రణకు కావాల్సిన వనరులను సమకూరుస్తుందని తెలియచేశారు.ప్రభుత్వం ముఖ్యపాత్ర నిర్వహించే మిశ్రమ ఆర్థిక విధానాలను ఉంటూ సంపద కొద్దీ మంది చేతిలో ఉండకుండా సమానపంపిణి ఉండాలని 39 సి ప్రకరణను రూపొందించారు.హానికర పన్నుల వలన, తప్పుడు ఆర్ధిక విధానాల వలన అనుత్పాదక ఖర్చుల వలన ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించాడు.
సమాజములో సగభాగమైన మహిళల విమోచకుడిగా అద్వితీయ కృషి చేసారు.అస్తిహక్కు,వివాహ,విడాకుల హక్కు అనేక రక్షణలు హిందూ కోడ్ బిల్ ద్వారా కల్పించాడు.మతోన్మాద సంఘ పరివార్ శక్తులు ఈ బిల్లును ను నిర్భిర్యం చేసే ప్రయత్నాలకు నిరసనగా తన న్యాయ శాఖ మంత్రి పదవిని త్యజించాడు.
భారతీయ మూలాల ఉన్న బౌద్ధ తత్వశాస్త్రం మంచి నైతిక ఆధారాలను కలిగి ఉందని మరియు ఆధునిక సమాజం యొక్క నైతిక పునాదులను భర్తీ చేయగలదని అంబేద్కర్ నమ్మాడు. కొత్త సామాజిక, మత క్రమానికి మార్గదర్శక సూత్రంగా ఆయన ‘సోదరభావం’ ఇచ్చారు. అక్టోబర్ 14, 1956 న, లక్షలాది మంది అనుచరులతో కలిసి, అతను బౌద్ధమతంలోకి మారి, గతిశీల సామాజిక మరియు మతపరమైన మార్పు యొక్క అవసరాన్ని చర్చించడానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. మత మార్పిడి యొక్క ప్రధాన అత్యవసరం కుల క్రమాన్ని,ఆధిపత్యాన్ని తిరస్కరించడం అని ప్రకటించాడు.
అధ్యయనం పోరాటం హక్కులు సాధించటం,వాటికి చట్ట బద్ధతను కల్పించడం జీవితంగా గడిపిన జ్ఞాన శాస్త్ర సంపన్నుడు ,మానవహక్కుల యోధుడు అంబేద్కర్ ప్రాసంగీకత ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. ఏ సనాతన విధానాలు భారత దేశాన్ని వేలాదిగా అంధకారంలో నెత్తివేసాయో, హేతుబద్ధత,తార్కిక జ్ఞానాన్ని నిలువరించాయో,భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరాకరించాయో ఆ విధానాల వారసులు అధికారం చేపట్టిన స్థితి దాపురించింది.అంబేద్కర్ రాజ్యాంగ విప్లవానికి ప్రతిఘాతక విధానాలను అమలు చేస్తూ సమస్త రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను,భీమా రంగాన్ని,విద్యా రంగాన్ని ప్రవేట్ కు కట్టబెడుతున్నారు.సామాజిక సమరసత విచ్చిన్నం చేస్తున్నారు.
అంబేద్కర్ పోరాట ఫలాలను అందుకున్న పౌర సమాజం,ప్రజాతంత్రవాదులు ,శ్రామికవర్గ సమాజము చెల్లించిన మూల్యం నుండి ఎదిగిన ఉపాధ్యాయులు,శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులు సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి ఉద్యమోన్ముఖము కావాలి.మానవాభివృద్ధి ఎజెండా లేకుండా పాలన కొనసాగిస్తున్న వారి పట్ల సామాన్య ప్రజలలో చైతన్యాన్ని కలిగించి వారిని బలహీనం చెయ్యాలి.సజీవ మేధావి వర్గం ఈ పనికి పూనుకోకపోతే అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగసభ ఎంతగానో శ్రమకోర్చి నిర్మించిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో అశాంతితో బాధపడుతున్న వర్గం హింసాత్మకంగా కూల్చివేస్తుంది.ఈ పరిస్థితి ఉత్పన్నం కాకముందే పౌర సమాజం,ప్రభుత్వాలు మేల్కోవాలి.