Take a fresh look at your lifestyle.

ఈ ‌పాపం ఎవ్వరిది ?

ఆగక కురుస్తున్న వాన నీరు
ఏరులై సాగుతున్న మురుగు
కట్టలు తెంచుక పొంగి వచ్చే వరద
కలిసిపోయి కాపురాలను
ఖాళీ చేయించి ఇళ్లలో తిష్టవేశాయి
రాదారులన్నీ గోదారులై
పడవలే రవాణా సాధనాలయ్యాయి
పొట్టకూటికోసం పట్టణానికి
వలస వచ్చిన నిర్భాగ్యులు
‘అభాగ్యనగరం’ మురికి వాడల్లో
పేకమేడల్లాంటి ఇరుకు ఇళ్ళల్లో
తలదాచుకుని కూలీనాలీతో
బిక్కుతు బ్రతుకీడుస్తుంటే
పాడు వరదలకు కొట్టుకు పోతూ
గూడులేని పక్షులయ్యారు
పదో పరకో కడుపు మాడ్చి
కూడబెట్టుకుని వడ్డీల బేడిల
అప్పుతో కొన్న అల్పాదాయ జనాల
ఆవాసాలు నిండా నీటమునిగి
దిక్కులేక పునరావాస కేంద్రాలలో
తలదాచుకుంటున్న దుఃఖస్థితి
స్వార్థం నిండిన ఆసాములు
చెరువులను, కుంటలను
కబ్జాచేసి లోతట్టు జాగాల్లో కట్టిన
అపార్టుమెంట్లు జలసంద్రాలైనందుకు
ఆశగా కొని నివసించే అమాయకులు
ఘోల్లుమంటూ విలపిస్తున్నారు
కాంక్రీట్‌ ‌జనారణ్యంలో
కనిపించని కన్నీరులాగే
కురిసిన వాన చుక్కలకు
నేల ఒడి కరువై ధారలుగా
కాలువలుగా, వరదలుగా సాగి
నోళ్ళు తెరచుకున్న మాన్‌ ‌హోల్‌ ‌లలోకి
ఆడుకునే పసి పిల్లల్ని
ఆదమరచిన అభాగ్యుల్ని లాగి
అన్యాయంగా మింగేస్తున్నాయి
పల్లమెరిగిన నీరు దారిలేక
కోట్లు పెట్టి కొన్న విల్లాలను
పూరి గుడిసెలనూ నింపేశాయి
మనిషి తానే అధికుడినని విర్రవీగుతూ
నీడనిచ్చి బ్రతుకునిచ్చిన
పుడమితల్లిని తూట్లు పొడిచి
జీవ ధాతువులను
ప్రాణాధార వాయువుని
అంతెరగని స్వార్థంతో పర్యావరణాన్ని
ధ్వంసం చేస్తున్నందుకు
ప్రకృతి ప్రకోపించి విలయతాండవంతో
క్యుములోనింబస్‌ ‌లు
అల్పపీడనాలు, ద్రోణులు,
అతివృష్టి, అనావృష్టిలు,
కరువులు కాటకాలు
అంతు చిక్కని కరోనా లాంటి
అంటు వ్యాధులతో
విధ్వంసం సృష్టించి
మనిషి మనుగడనే ప్రశ్నిస్తూ
ఈ పాపం మీదేనంటూ ఘోషిస్తోంది
దిక్కుతోచక ముందు చూపులేని
అధికారం నిస్సహాయతతో
చేతులెత్తేసి మొహం చాటేస్తోంది
ఇహనైనా మానవాళి మేల్కొనాలి
తల్లి వంటి ప్రకృతిని పొదిమి పట్టుకోవాలి
బ్రతుకులోని పచ్చదనాన్ని పాడుచేసి
చేజేతులా మోడు కానివ్వొద్దు
( వరుసగా కురుస్తున్న వర్షానికి కుదేలైన మన ‘అభాగ్యనగరం‘ బ్రతుకు చిత్రానికి చలించి)

– డా. కె. దివాకరా చారి, 9391018972

Leave a Reply