Take a fresh look at your lifestyle.

మహిళా రైతుల తలరాతలు మారేనా..?

2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  జనరల్‌ అసెంబ్లీ 2024 మే నెల 2వ తేదీన  ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 అగ్రిఫుడ్‌ వ్యవస్థల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు సవాళ్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు చర్యలను అవలంబించడానికి, వ్యవసాయంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, ప్రాసెస్‌ చేయడం, పంపిణీ చేయడం, వినియోగించడం లాంటి మొత్తం ప్రక్రియలను అగ్రిఫుడ్‌ సిస్టం లేదా వ్యవసాయ ఆహారవ్యవస్థ అని అంటారు. ఇందులో వ్యవసాయ కార్యకలాపాలు, ఆహార ఉత్పత్తి, సరఫరా గొలుసులు, ఆహార ఎంపికలను ప్రభావితం చేసే సామాజిక-ఆర్థిక కారకాలు ఉంటాయి. ఈ సందర్భంలో ప్రపంచం మరియు మనదేశంలో  వ్యవసాయ ఆహారవ్యవస్థల గురించి పరిశీలిద్దాం.

మహిళల ప్రాధాన్యతే ఎక్కువ….
ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ) ‘‘ఆహార వ్యవసాయవ్యవస్థలో మహిళల స్థితి ‘‘ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు, ప్రధానంగా 15-24 సంవత్సరాల వయస్సు గల యువతులకు  అధిక జీవనో పాధిని కలిగిస్తుంది. ప్రపంచ వ్యవసాయ కార్మిక శక్తిలో మహిళలు 43% మంది ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలు 60% నుండి 80% వరకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మరో నివేదిక  ‘‘అన్‌ జస్ట్‌ క్లైమేట్‌ ‘‘లో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలలో వాతావరణ మార్పు  అసమాన ప్రభావాన్ని తెలిపింది. దీర్ఘ-కాల సగటు ఉష్ణోగ్రతలలో కేవలం ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరుగుదల పురుషనేతృత్వ కుటుంబాలతో పోల్చితే స్త్రీనేతృత్వ కుటుంబాల మొత్తం ఆదాయంలో 34% తగ్గుదలకు దారితీస్తుందని వెల్లడిరచింది.

ఇక మనదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మహిళా ప్రధాన కార్మికులలో 55 శాతం వ్యవసాయ కార్మికులు, 24 శాతం సాగుదారులు. కేవలం 12.8 శాతం మాత్రమే మహిళా యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఇది వ్యవసాయంలో లింగ అసమానతను ప్రతిబింబిస్తుంది. వార్షిక పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2022-23 ప్రకారం వ్యవసాయంలో అత్యధికంగా మహిళా కార్మికుల పంపిణీ 64.40 శాతంగా ఉంది. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 76.20 శాతం, పట్టణ ప్రాంతాల్లో 11.70 గా నమోదైంది. విత్తనాలు నాటడం,కలుపు తీయడం, పంటకోత, గడ్డి కోత, పత్తి సేకరణ, విత్తనాలను వేరు చేయడం, నర్సరీ నిర్వహణ లాంటి  వ్యవసాయ పనులతో పాటు పశువుల పాలు పితకడం, పాల ప్రాసెసింగ్‌, నెయ్యి తయారీ,పౌల్ట్రీ రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగుదారులుగా, వ్యవస్థాపకులుగా మరియు కార్మికులుగా బహుళ పాత్రల్లో మహిళలు ఉన్నారు.

వ్యవసాయంలో మహిళా సాధికారత ప్రయోజనాలు..
వ్యవసాయంలో మహిళలకు సాధికారత కల్పించడం వల్ల మహిళలకే కాకుండా సమాజానికి, ఆర్థిక వ్యవస్థలుకు, పర్యావరణంనకు ప్రయోజనాలు ఉంటాయి. ఆహార భద్రత పెరుగుతుంది. మహిళలకు వనరుల శిక్షణ అందుబాటులో ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పాదకతను 20% వరకు పెంచవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రత మెరుగుపడుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబాలకు ఆదాయం ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. ఇది పేదరికాన్ని తగ్గించడానికి వారు శ్రేయస్సును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. వారి కుటుంబానికి మెరుగైన పోషకాహారాన్ని అందిస్తుంది.

పురుషులకంటే పర్యావరణాన్ని ఎక్కువగా రక్షించగలరు. స్త్రీలు వ్యవసాయ ఆధారిత జీవనోపాధికి సంబంధించి వారి ప్రయోజనాలను మరింత పెంచుకోవడానికి నిర్దిష్ట వ్యూహాలను అనుసరిస్తారు. కార్మికుల నుండి ఆవిష్కర్తలు, నిర్వాహకులుగా మారుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను నిర్ధారించడంలో, స్థానిక వ్యవసాయ జీవవైవిధ్యాన్ని సంరక్షించడంలో మహిళలకు నిర్ణయాత్మక పాత్ర ఉందని అనుభావిక ఆధారాలు ఉన్నాయి. రోజువారీ గృహ అవసరాలను తీర్చడానికి వివిధ సహజ వనరుల సమగ్ర నిర్వహణ వినియోగానికి గ్రామీణ మహిళలు బాధ్యతవహిస్తారు. మహిళా సాధికారత మహిళల సంక్షేమానికి అవసరం. వ్యవసాయోత్పత్తి, ఆహార భద్రత, ఆహారం, పిల్లల పోషణపై సానుకూల ప్రభావం చూపుతుంది.

వ్యవసాయంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు
భూమి,పశువుల యాజమాన్యం, సమాన వేతనం, నిర్ణయం తీసుకునే సంస్థలలో భాగస్వామ్యం, ఆర్థిక సేవల అందుబాటు విషయంలో వారు గణనీయమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ఒకే పరిమాణంలో స్త్రీ-పురుషులు నిర్వహించే పొలాల మధ్య భూ ఉత్పాదకతలో లింగ వ్యత్యాసం 24 శాతం ఉంది. మహిళలు పురుషులు సంపాదించే దానికంటే 20 శాతం తక్కువ సంపాదిస్తున్నారు. తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాల మహిళలకు 2017 లో 25 శాతంగా ఉన్న ఇంటర్నెట్‌ అందుబాటు 2021 వచ్చేసరికి 16 శాతానికి పడిపోయింది. బ్యాంకింగ్‌  అందుబాటులో లింగ వ్యత్యాసం 9 శాతం నుండి 6 శాతానికి పడిపోయింది. ఆహార అభద్రతలో అంతరం 2019లో 1.7 శాతం పాయింట్ల నుండి 2021 నాటికి 4.3 శాతానికి పెరిగింది. సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌ ఇండికేటర్‌ 5.ఎ.1పై నివేదించే 46 దేశాలలో 40 దేశాల్లోని మహిళల కంటే పురుషులకు వ్యవసాయ భూమిపై ఎక్కువ యాజమాన్యం  హక్కులు ఉన్నాయి.

గత ఇరవై ఏళ్లలో చాలా ప్రాంతాలలో వ్యవసాయంలో మహిళల వాటా తగ్గుతోంది. కొన్ని ప్రదేశాలలో స్త్రీలకు పనిగంటలు ఎక్కువ. మనదేశంలో భూ యాజమాన్య హక్కులు పురుషలతో పోల్చితే స్త్రీలకు తక్కువ. పశు యాజమాన్యంలో కూడా లింగ వివక్షత ఉంది. మహిళల పని పరిస్థితులు పురుషుల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. ఎక్కువ శాతం మహిళలు స్వంతంగా భూములు, వనరులును కలిగి లేరు. గ్రామీణ మహిళలలో తక్కువ అక్షరాస్యత కారణాన వారికి వ్యవసాయంలో వారికి ఆధునిక సాంకేతికలుపై అవగాహన కొరవడుతోంది. శిక్షణా కార్య్రమాలకు గైర్హాజరు అవుతున్నారు. లింగ వివక్ష వలన  మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. సకాలంలో రుణాన్ని, పండిరచిన ఉత్పత్తులకు సరసమైన ధరలు పొందలేక పోతున్నారు. కొన్ని కుటుంబాలలో ఇంకా లింగ వివక్షత కొనసాగుతుంది. స్త్రీలు వేతనం పొందని గృహ పనులలోనే ఉంటున్నారు. వ్యవసాయ కార్మికులుగా పురుషులకంటే స్త్రీలకు తక్కువ వేతనం చెల్లిస్తున్నారు.

పరిష్కారాలు
వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి మహిళా రైతుల హక్కులు కీలకం. భూమి, రుణం, నీరు, విత్తనాలు మార్కెట్ల వంటి వనరులు పొందడంలో  మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. మహిళా రైతులుకు సాంకేతికత శిక్షణ అవసరం. ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తే ఇంటి నుండే శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఉత్పత్తులకు కావలసిన వనలురులును పొందడానికి అంతర్జాల సౌకర్యం ఉపయోగపడుతుంది. నిర్బంధ సామాజిక నిబంధనలను మార్చడానికి లింగ-పరివర్తన విధానాలు ఖర్చుతో కూడుకున్నవి. అయితే అధిక రాబడిని కలిగి ఉంటాయి.

లింగ-పరివర్తన విధానాలను అమలు చేయడానికి మార్గాలను అభివృద్ధి చేయడంపై మరింత కృషి అవసరం. ఆహార భద్రత పోషకాహార ఫలితాలను పెంచడానికి అగ్రిఫుడ్‌ వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి వ్యవసాయ విస్తరణకు మహిళల ప్రాప్యతను మెరుగుపరచడం చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పాదకతలో లింగ అంతరాన్ని, అగ్రిఫుడ్‌-సిస్టమ్‌ ఉపాధిలో వేతన అంతరాన్ని తొలగిస్తే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి 1 శాతం లేదా దాదాపు 1 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు పెరుగుతుంది. ఇది ప్రపంచ ఆహార అభద్రతను సుమారు 2 శాతం తగ్గించి ఆహార అసురక్షిత వ్యక్తుల సంఖ్యను 45 మిలియన్ల మేర తగ్గిస్తుంది.

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230

Leave a Reply