Take a fresh look at your lifestyle.

వణుకుతున్న అ’భాగ్య’నగరం

ఓ వైపు వరుణుడి ప్రకోపానికి..
కుమ్మేసిన కుండపోత వర్షం
వణుకుతున్న అ‘భాగ్య’నగరం
తడిసి ముద్దైన తెలంగాణం !

మరో వైపున కోకపేటలో..
వేలం పాటకు కురిసిన..
కోట్ల కాసుల కనకవర్షాలు
పొంగిపొర్లిన ఖజానాలు!

నాగోల్‌ ‌నానిపోయింది
వనస్థలిపురం వణికిపోయింది
సిద్దిపేట తడిసి తడబడింది
నల్గొండ నీటి తేలింది !

రోడ్లన్నీ మహా నదులై..
కాలనీలన్నీ తటాకాలై..
చిన్న చినుకుకే వణికిన..
అభాగ్యుల బతుకులు !

కుంభవృష్టితో విలవిలలు
కూలిన బడుగుల గూళ్లు
తెగిన కట్టలు రహదారులు
మునిగిపోయిన పాడిపంటలు !

నిండుకుండలైన కుంటలు
పొర్లిన చెరువుల అలుగులు
పొంగుపొర్లుతున్న వాగులు వంకలు
జోరుగా దునుకుతున్న చెక్‌డ్యామ్‌లు !

పడవల్లా తేలుతున్న మంచాలు
కొట్టుకుపోతున్న ఇంటిసామాన్లు
ఊడ్చుకుపోయిన అభాగ్యుల ఆశలు
మిగిలిన నిరాశల బురద మడుగులు !

కన్నీటి జలధారలు కలిసి..
పెరిగిన వరద ఉదృతులు
అల్పజీవుల్ని అనాథల్ని చేసిన..
అల్పపీడనాల ఆవేశవానలు !

చేతులెత్తేసి రెడ్‌ అలర్ట్ ‌జారీలు
జరభద్రమని ప్రభువుల పలుకులు
మేమున్నామంటూ అనంత హామీలు
దిక్కుతోచక దీనుల చూపులు !

dr-burra-madhusudhan-reddy
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 9949700037

 

Leave a Reply