Take a fresh look at your lifestyle.

రాజ్‌భవన్‌ ‌నోట… ప్రగతి భవన్‌ ‌మాట

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలమేరకు రాజ్‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడిందనేందుకు శుక్రవారం రాష్ట్ర శాసన సభ,మండలి  బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసం లో  గవర్నర్‌ ‌తమిళిసై సౌందరాజన్‌ ‌ప్రసంగం చెప్పకనే చెబుతోంది. ప్రసంగ పాఠాన్ని క్రితం రోజున్నే రాజభవన్‌ ‌వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం, అందులో ఒకటిరెండు చిన్న సవరణతో గవర్నర్‌ ‌సంతృప్తిని వ్యక్తం చేయడం శుభపరిణామం. అయినప్పటికీ తామిచ్చిన సమాచార పూర్తిపాఠాన్ని గవర్నర్‌ ‌చదువుతారా, గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి తనకు మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ ‌రవి తరహాలో  తన సొంత  ప్రసంగ పాఠాన్ని వినిపిస్తారా అన్న మీమాంసలో అధికార బృందం ఆందోళన చెందింది. తాజాగా రిపబ్లిక్‌ ‌వేడుకల సందర్భంగా గవర్నర్‌  ‌తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌ ‌చేసిన విషయం తెలిసిందే. దానిపై రాజభవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య మాటల తూటాలు పేలిన విషయం కూడా తెలియందికాదు. దాని పర్యవసానం ఈ ప్రసంగంపైన ఉంటుందా అన్న అనుమానాలకు తావేర్పడింది. కాని, ఎలాంటి అరమరికలు, విమర్శలు లేకుండా అంతా సాఫీగా కొనసాగడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై  సౌందరాజన్‌ ‌బాధ్యతలు చేపట్టినతర్వాత ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్‌ ‌ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. గత బడ్జెట్‌ ‌సమావేశాల్లో గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ‌సెషన్‌ ‌ముగిసింది. ఈసారి కూడా అలానే కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచించింది. కాని ఈ విషయం కోర్టుకు ఎక్కడం, న్యాయస్థానం కూడా తమ జోక్యం కన్నా, సామరస్య ధోరణిలో  దీన్ని పరిష్కరించుకోవాలని సూచించడంతో గందరగోళానికి తెరపడినట్లైంది. ఇదిలా ఉంటే గవర్నర్‌కూడా తన ప్రసంగంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతీ అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా  మా ప్రభుత్వం అంటూ చెప్పడం చూస్తుంటే అభిప్రాయభేదాలు పక్కకు పెట్టినట్లు స్పష్టమైంది. కొంతకాలంగా కొనసాగుతున్న ప్రోటోకాల్‌ ‌వివాదం కూడా దీంతో సమసిపోయినట్లైంది.గవర్నర్‌ను వేదిక మీదకు తీసుకొచ్చే క్రమంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెను సాదరంగా ఆహ్వానించడం, శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్‌ ‌గుత్త సుఖేందర్‌రెడ్డి , శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెంటనడవటం పాత విషయాలను పక్కకు పెట్టినట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యంగా చాలాకాలంగా ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్‌ ‌పాలనపై దుమ్మెత్తి పోస్తున్న క్రమంలో గవర్నర్‌ ‌తన ప్రసంగమంతా తెలంగాణ అభివృద్ధిలో ముందడుగులో ఉందన్న విషయాన్ని స్పష్టంచేశారు. తెలంగాణ అనేక విషయాల్లో దేశానికి ఎలా ఆదర్శవంతంగా నిలిచిందన్న విషయాన్ని ఆమె వివరాణ్మతంగా చెప్పారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అవిరళ కృషి ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు.  ఎనిమిదేళ్ళ బిఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రం అంధకారం వీడి ఇరవైనాలుగు గంటలపాటు వెలుగులు విరజిమ్మితున్నదన్నారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందన్న అపవాదకు సమాధానమన్నట్లు వ్యవసాయరంగాన్ని ఎలా తీర్చి దిద్దిందనడానికి, తెలంగాణ దేశానికే ధాన్యాగారమైందని, తమ ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలే అందుకు కారణమని చెప్పారు. మిషన్‌ ‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించడం, రైతులు పండించిన ప్రతీ బియ్యం గింజను కొనుగోలు చేయడం, సకాలంలో వారికి ధాన్యం డబ్బులను అందజేయడం లాంటి చర్యలవల్ల  గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు చాలావరకు మెరుగుపడ్డాయన్న అంశాన్ని అమె వివరించారు.

దానికి తోడు రైతు బంధు, రైతు బీమా వల్ల సమాజంలో రైతుకు అత్యంత గౌరవ స్థానం  ఏర్పడిందని చెప్పారు.  తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గీటురాయిగా నిలిచింది. దాన్ని కేవలం మూడున్నర ఏళ్ళ అతిస్వల్ప వ్యవధిలో  రికార్డు స్థాయిలో పూర్తి చేయడం తమ ప్రభుత్వానికి గర్వకారణం. పర్యవసానంగా తాగునీటికోసం తల్లడిల్లుతున్న పరిస్థితులనుండి  వందశాతం గ్రామాల్లో ఉచితంగా స్వచ్ఛమైన , సురక్షితమైన జలాలను సరఫరా చేసుకుంటున్న పరిస్థితి.  దళితుల అభ్యున్నతికోసం చేపట్టే చర్యల విషయంలో తమ ప్రభుత్వం అనేక సవాళ్ళను అధిగమించి, దళిత బంధు లాంటి పథకాలను తీసుకువొచ్చి వారి అర్థిక ప్రగతికి బాటలు వేసిందన్నారు. అలాగే రాష్ట్ర రాజధానిలో 41 బిసి కులాల వారి కోసం ఆత్మగౌరవ భవనాలు చేపట్టడం, బిసి రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలను మూడువందల పదికి పెంచడం ఒక ఎత్తుకాగా, సివిల్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు అమలుచేయడం విశేష అంశంగా అమె తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణలో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా వొస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాష్ట్రం ప్రగతిని సాధిస్తోందంటూ గవర్నర్‌ ‌తన ప్రసంగమాసాంతం తెలంగాణపై ప్రశంసలను కురిపించారు. అయితే బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న అపవాదు  మోస్తున్న గవర్నర్‌ ఈ ‌ప్రసంగంలో ఎక్కడ కేంద్రం గురించిన ప్రస్తావన లేవనెత్తకపోవడం కొసమెరుపు..

Leave a Reply