Take a fresh look at your lifestyle.

లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీక

  • ముస్లిమ్‌ సోదరులకు సిఎం రేవంత్‌ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు
  • ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్ష్న
  • సామాజిక ఉద్యమ కెరటం ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం : జయంతి సందర్భంగా సిఎం నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్‌ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్‌ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్‌, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిమ్‌ మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమి స్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తొలి వంద రోజుల్లోనే పాత బస్తీలో మెట్రో రైలు లైన్‌కు శంకుస్థాపన చేయటంతో పాటు మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులను పెంచిందని గుర్తు చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రార్ధించారు.

సామాజిక ఉద్యమ కెరటంగా ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం : జయంతి సందర్భంగా సిఎం నివాళి
ఒక సామాన్యుడిగా మొదలై..సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమమని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావ్‌ పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్‌ 11) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలేకు ముఖ్యమంత్రి ఘన నివాళులు అర్పించారు.

వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అయిదు వందల రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఇప్పటికే అమలు చేసిందన్నారు. పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సిఎం తెలిపారు.

Leave a Reply