పోరాటాల పురిటిగడ్డగా తెలంగాణకు ఓ ప్రత్యేక గుర్తింపుంది. నాటి రాజుల కాలం నుండీ, నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల నాడు కూడా పోరాటాల ద్వారానే ఇక్కడి ప్రజలు తమ హక్కులను సాధించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆరేళ్ళ కింద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా ఈ పోరాటాల ఫలితంగానే. అలాంటి విరోచిత పోరాట చరిత్రలోనిదే ‘మేడారం’ ఘట్టం. ఏడు దశాబ్ధాల కింద జరిగిన ఈ సంఘటన ఇక్కడి ప్రజల మనస్సులో శాశ్వతంగా ముద్రవేసుకుంది. అందుకే మాఘ శుద్ద పౌర్ణమి వొస్తుందంటేనే జనం మేడారం బాట పట్టడమన్నది సహజమైపోయింది. ‘గిరి’జనులపై కత్తికట్టి నాటి కాకతీయ చక్రవర్తి సేనలతో వీరోచిత పోరాటం చేసి, తీవ్రగాయాలతో అడవిలో అంతర్ధానమైన ‘సమ్మక్క’ అమె కూతురు సారలమ్మ స్మరణలో కేవలం గిరజనులే కాదు, ఆ తల్లులపై నమ్మకమున్న సమస్త జనులు మేడారంలో సంఘటితమవడమన్నది కొన్ని దశాబ్దాలుగా ఆచరణలో ఉంది. ఒకనాడు దట్టమైన కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతం క్రమేణా జనారణ్యంగా మారుతూ వొస్తున్నది. ఒకనాడు కాలిబాట, ఎండ్లబండ్లలో తప్ప ఇక్కడికి రావడానికి ఎలాంటి సదుపాయం లేని కాలం నుంచి ఇప్పుడు బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు చివరకు ఆకాశమార్గంలో కూడా చేరుకునే వసతులు ఏర్పడ్డాయి. ఇదిప్పుడు ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రత్యేక విశిష్టతను సంతరించుకుని, రాష్ట్ర పండుగగా పలువురిని ఆకట్టుకుం టోంది.
ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే ఈ జాతరకు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. గత రెండు మూడు జాతరాలను విశ్లేషించుకుంటే ఇంచుమించు కోటి మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని
ఉంటారన్నది ఓ అంచనా. ఈసారి కూడా ఆ సంఖ్య దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కింద ఈ ప్రాంతమంతా దట్టమైన అటవి ప్రాంతంగా ఉండటం వల్లనేమో అమ్మవార్లను ప్రతీ రెండేళ్ళకు ఒకసారి స్మరించుకునే ఆనవాయితీని పాటిస్తూ వొస్తున్నారు. అయితే వారి స్మృత్యర్ధం దేశ, విదేశాల నుండి లక్షల సంఖ్యలో జనం వొస్తుండడంతో ఇదొక మహా జాతరగా మారింది. ఇక్కడికొచ్చే జనంతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసి పోతుండడంతో, ఈ జనసమూహానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న భక్తులనేక మంది ముందస్తుగానే తమ మొక్కులను తీర్చుకోవడంతో జాతరకు నెలరోజుల ముందునుండే మేడారం ప్రాంతానికి రద్దీ పెరుగుతూ వస్తున్నది.. ఇప్పటికే లక్షల సంఖ్యలో జనం అమ్మవారలు గద్దెకు రాకముందే తమ మొక్కుబడులను తీర్చుకుని వెనుదిరుగుతున్నారు. జాతర సమీపిస్తున్న కొద్ది రోజుకు కనీసం నాలుగు నుండి అయిదు లక్షల మందికి తక్కువ లేకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నారంటే అతి ముఖ్యమైన ఈ నాలుగురోజుల జాతరలో ఇంకా ఎంతమంది పాల్గొంటారన్నది ఊహించడమే కష్టం.
ఈ నాలుగు రోజులూ విశిష్టమైనవే
మేడారం జాతరలో ప్రధానంగా నాలుగురోజులు విశిష్టమైనవి. అందులో మూడు రోజులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఎందుకంటే ఎంతో పవిత్రంగా, నమ్మకంగా గిరిజనులు కొలిచే ఈ వనదేవతలు వారికోసం మేడారంలో ఏర్పాటు చేసిన విశిష్ట స్థానాలపై ఆసీనులై భక్తుల దర్శనమిచ్చే రోజులవి. బుధవారం (ఫిబ్రవరి 5వ తేదీ)నాడు సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో ఈ జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. వాస్తవంగా అంతకుముందే సోమవారం(3వ తేదీ) రోజున సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును భద్రాచలం కొత్తగూడ జిల్లా గుండాల మండలం పూనిగండ్లనుండి ఆరెం వంశీకులు మేడారం చేర్చారు. సుమారు డెబ్బై కిలోమీటర్ల ఈ మార్గమంతా వారు కాలినడకనే రావడం విశేషం. ఆ మరుసటిరోజు జంపన్నను ప్రధాన పూజారి పోలెబోయిన సత్యం గద్దెకు తీసుకువచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న జంపన్న గద్దెవద్ద భక్తులు ఉయ్యాలను కట్టడంద్వారా సంతానాన్ని కోరుకుంటారు. మేడారం గద్దెలకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి దేవాలయంనుండి పూజాది క్రతువులు నిర్వహించి కాలినడకన జంపన్నవాగుమీదుగా సారలమ్మను బుధవారం మేడారంగద్దెకు చేరుస్తారు. వంశపారంపర్య పూజారి కాక సారయ్య తడిబట్టలతో ఎంతోనిష్టగా తీసుకువచ్చే తరుణంలో భక్తులు దారిలోసాగిలపడడం, మహిళలు కడవలతో నీళ్ళు గుమ్మరించడం అనాధిగావస్తున్న ఆచారం. ఆ మరుసటి రోజు (ఫిబ్రవరి 6)న చిలకలగుట్ట నుండి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టముంటుంది. ఇది జాతరలో అత్యంత ప్రధానఘట్టంగా భావిస్తారు. ఎంతో ఉద్వేగభరితమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే. దేవతను గద్దెకు తీసుకువచ్చే క్రమంలో ప్రధాన పూజారి కొక్కరి కిష్టయ్యతోపాటు మరికొందరు సహాయకులు ముందుగా గద్దెలవద్ద పూజలు నిర్వహించి ఆరోజు సాయంత్రం అమ్మవారిని తీసుకురావడానికి నూతన వస్త్రాలను ధరించి చిలకలగుట్టకు వెళతారు. భాజా భజంత్రీలు, కొమ్మువాయిద్యాలు, డోళ్ళ విన్యాసాలమధ్య కుంకుమ భరిణ, వెదురుబుట్టతో పూజారి గుట్టపైనుండి కిందకు తీసుకువచ్చేప్పుడు గౌరవ ప్రధంగా జిల్లా ఎస్పీ తనతుపాకీతో నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపడంద్వారా అమ్మవారు గద్దెకు వస్తున్నారన్న సంకేతాన్నివ్వడంకూడా ఈ జాతరలో ఒకభాగంగామారింది.
అమ్మవార్ల దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు ఈ సంకేతం వినిపించగానే అప్పటివరకు ఎంతో ఓపికగా ఉన్నవారంతా అమ్మవారిని చూసేందుకు ముందుకు సాగడంతో గద్దెల ప్రాంతమంతా మానవ తలకాయలేగాని మనుష్యులు కనిపించనంతగా కిక్కిరిసిపోతుంది. కదిలే జనసముద్రంగా మారుతుంది. గద్దెచుట్టూ ఉన్న క్యూలైన్‌లోని భక్తులు అమ్మను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. అదే క్రమంలో భక్తి పారవశ్యంత• శివసత్తుల పూనకాలతో ఊగిపోతుంటారు. వారి కేకలు, అరుపులతో ఆప్రదేశమంతా కోలాహలంగా మారుతుంది. ఎవరికి తోచినరీతినవారు బంగారం, వెండి, డబ్బులు, కొబ్బరి కాయలు,సమర్పిస్తే, కొందరు కోళ్ళను, గొర్రెలను, మేకలను అమ్మవారి మొక్కుబడిగా బలివ్వడంతో సమ్మక్కను గద్దెకు తీసుకువెళ్ళే మార్గమంతా జంతుబలుల రక్తశ్రణమవుతుంది. ఇంకొందరు వడిబియ్యం సమర్పిస్తే, వరం పడుతున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తాయి. శుక్రవారం మరింత శ్రేష్టమైన రోజు. ఏ ప్రాంతమైనా శుక్రవారం దేవతలకు ప్రత్యేకపూజలు జరుపుతారు. ఇక్కడకూడా సమ్మక్క, సారలమ్మలిద్దరూ శుక్రవారమంతా గద్దెలపైనే ఉండడం భక్తులకు మహదానందం కలిగించే అంశం. శనివారం సాయంత్రం అమ్మవారు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఇంతటి విశిష్టతున్న ఈజాతరను గుర్తించిన ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం 1996లోనే రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే దేశ విదేశాలనుండి లక్షల సంఖ్యలో ఈ జాతరకు జనం వస్తుండడంతో దీన్ని జాతీయపండుగగా గుర్తించాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినతర్వాత గత ఉమ్మడి ప్రభుత్వాలకన్నా అత్యధికంగా 175 కోట్లను ప్రకటించి, విశేష ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 75 కోట్లను మాత్రమే ప్రకటించడంపట్ల పలు విమర్శలు ఎదురవుతున్నాయి. నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతో తెల్లవారితే జాతర జరుగనున్న తరుణంలో ఇంకా చేపట్టినపనులు అసంపూర్తిగానే మిగిలటం విచారకరం. విచిత్రమేమంటే ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ ఇప్పటికే దాదాపు ఇరవై నుండి ముప్పై లక్షల మంది అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకుని వెళ్ళడం.
ప్రధానమైన ఈ నాలుగు రోజుల్లో మరిన్ని లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశంఉంది. ఇలాంటి పరిస్థితిలో కనీస అవసరాలైన మంచినీరు, మరుగుదొడ్ల నిర్మాణం పనులే ఇంకా పూర్తికాకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి పరిస్థితి కనిపిస్తున్నది. జాతర తేదీలు ప్రకటించి నప్పటినుండీ మేడారంలో పనులు చేపట్టినప్పటికీ, మంత్రులు, స్థానిక ఎంఎల్‌ఏలు నిత్యం పర్యవేక్షిస్తున్నప్పటికీ నిధులు సరైన సమయంలో విడుదలకాకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అధికారులు, నాయకులు తొందరపెట్టడంతో చేసిన పనులుకూడా నాసిరకంగానే దర్శనమిస్తున్నాయన్న అపవాదకూడా లేకపోలేదు. ఇదిలాఉంటే మేడారానికి భక్తులను చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సుమారు నాలుగువేల బస్సులను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని దాదాపు అన్నిజిల్లాలనుండి బస్సు సదుపాయాలను కల్పించారు. ప్రతీసారి ఇలా కొత్తగా నిర్మిస్తున్నట్లే ఈసారికూడా 8400 మరుగుదొడ్ల నిర్మాణంచేపట్టినా జాతరనాటిక అవన్నీ పూర్తి అయ్యే పరిస్థితిలేదంటున్నారు. అలాగే జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పన్నెండు వేలమంది పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేశారు. జంపన్నవాగు సమీపంలో పవిత్ర స్థానాలకుగాను లక్నవరం సరస్సునుండి నీటిని తరలించడంతోపాటుగా 890 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే వస్త్రాలు మార్చుకునే గదుల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగడంతో మహిళలు తీవ్రఅసంతృప్తికి, అసౌకర్యానికి లోనవుతున్నారు. జాతరలో పెద్దగా నడువలేని వారికోసం ఈసారి కొత్తగా బ్యాటరీ ఆటోలను ఏర్పాటుచేశారు. మొత్తంమీద సౌకర్యం, అసౌకర్యాల మిళితంగా మేడారం నాలుగురోజుల జాతర నేటి నుండి ప్రారంభంకానున్నది.
జాతర విశిష్టత:
కాకతీయ చక్రవర్తులు ఏలిన ఈ భూమిలోనిదైన మేడారం పరిగణాను కోయరాజైన పగిడిద్దరాజు పాలిస్తున్న కాలమది. వరుసగా నాలుగేళ్ళు అనావృష్టి ప్రభలి కప్పంకట్టలేకపోవడంతో ప్రతాపరుద్ర చక్రవర్తి ఆగ్రహానికి కారణమైంది. అంతే..పగిడిద్దరాజుపై చక్రవర్తి యుద్దాన్ని ప్రకటించాడు. ఆ యుద్దంలో పగిడిద్దరాజు, ఆయన కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు, విగతజీవులవగా. అవమాన భారాన్ని భరించలేక పగిడిద్దరాజు కుమారుడు జంపన్న సమీపంలోని సంపెంగవాగులోదూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నది కథనం. అప్పటినుండి ఈ వాగు జంపన్నవాగుగా పిలవడబడుతున్నది. కాగా పగిడిద్దరాజు భార్య అయిన సమ్మక్కకూడా కాకతీయ సేనలతో వీరోచితంగా పోరాటంచేస్తున్న క్రమంలో వెనుకబాటున శత్రుసైనికుడు ఆమెపై దాడిచేయడంతో తీవ్ర గాయాలతో సమీపంలోని చిలకలగుట్ట ప్రాంతంలో అంతర్ధానమైంది. కోయదొరలంతా ఆమెకోసం వెతకగా, చిలకలగుట్టమీదున్న నారవృక్షం సమీపంలోగల ఓ పుట్టవద్ద కుంకుమ భరిణ లభించిందని, ఆనాటినుండి ఆ భరిణనే సమ్మక్క స్మృతి చిహ్నంగా కోయలు భావిస్తూ, జరిపే వేడుక క్రమేణా జాతరగా మారింది.
ఆనాటి నుండి తల్లీకూతుళ్ళను వనదేవతలుగా భావిస్తూ ప్రతీ రెండేళ్ళకోసారి జరిపే ఈ జాతరకు క్రమేణ జనం విస్తృతం కావడంతో ఆమ్మవార్లను గద్దెకు తీసుకొచ్చిన తర్వాత చెల్లించాల్సిన మొక్కుబడులను, సంప్రదాయానికి భిన్నంగా కొందరు ప్రతీఏటా గద్దెలవద్ద పూజలుచేసి, తమ మొక్కులను తీర్చుకుని సంతృప్తి చెందుతుండడంతో ఇక్కడ నిత్యం జనకోలాహలంగామారింది. కేవలం కోయలే కాకుండా వివిధ మతాలు, కులాలవారుకూడా వీరిని తమ ఇలవేల్పుగా కొలవడంతోపాటుగా, తమ కోరికలు తీర్చిన ఈ దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) కానుకగా సమర్పించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. పిల్లలకు పుట్టు వెంట్రుకలు, పెద్దలు తలనీలాలు సమర్పించుకుకోవడంకూడా ఓ పంప్రదాయంగామారింది.