మహబూబ్‌గర్, 19 మే( ప్రజాతంత్ర ప్రతినిధి) : నగర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వము మరో 17 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ ల తో మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి పనులను పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌గర్ పెద్ద చెరువు పై మినీ శిల్పారామం ఏర్పాటుకు ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పనులు చేపట్టేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అంతేకాక అప్పన్నపల్లి బ్రిడ్జి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఐదు కోట్ల రూపాయలతో సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులు చేపట్టేందుకు కు మున్సిపల్ పరిపాలన శాఖ అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.
అంతేకాక పెద్ద చెరువు కట్ట అభివృద్ధి మరియు చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంపొందించెందుకుగాను నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఈనెల 13న జీవో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు .గతంలో పెద్ద చెరువు పై కనీసం మనుషులు నడిచేందుకు కూడా అవకాశం లేకుండేదని, ఐతే ఇప్పుడు పెద్ద చెరువు రూపు రేఖలు మరిపోయాయని ,ఇందులో భాగంగానే కట్టపై దారి ఇంకా వేడల్పు చేసి పచ్చ దనాన్ని పెంపొందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహబూబ్‌గర్ మున్సిపాలిటీలో చౌరస్తాల అభివృద్ధి కై రూపొందించిన డిజైన్లు పరిశీలించి అనుమతించారు. అశోక్ థియేటర్ చౌరస్తా, క్లాక్ టవర్, అంబేద్కర్ చౌరస్తా ,తెలంగాణ చౌరస్తా, సుభాష్ చౌరస్తా,పిల్లలమర్రి చౌరస్తా తదితర చౌరస్థల అభివృద్ధికి రూపొందించిన డిజైన్లను పరిశీలించారు. చౌరస్తా ల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్ అభివృద్ధి డిజైన్లు అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలని మంత్రి సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలో రహదారుల విస్తరణ అభివృద్ధికి ముందు, పనులు జరుగుతున్నప్పుడు, అలాగే పనులు పూర్తయిన తర్వాత ఫోటోలను సేకరించి ఉంచాలని ఆయన మున్సిపల్ కమిషనర్ సురేందర్ ను ఆదేశించారు. రహదారుల విస్తరణ, జంక్షన్ ల అభివృద్ధి తో మహబూబ్‌నగర్ పట్టణం ఇంకా సుందరంగా తీర్చిదిద్దబడుతుందన్నారు.