Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన స్థాయిలో ముందుకు రాలేదు.

 చేయని తప్పుకు ప్రజలు దశాబ్దాల పాటు భారం మోయాల్సిందేనా..?

అసలు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..ప్రజా సంపదకు సంరక్షకులుగా ఉంటూ పాలన సాగించాల్సింది పోయి ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ..అక్రమాలకు పాల్పడితే నియంత్రించే వ్యవస్థ ఉందా..లేదా. ఒక సామాన్యుడు ఏదైనా రుణం పొందడానికి తానే పూర్తి బాధ్యత వహించి అనేక విధాలుగా పత్రాలు సమర్పించి, గ్యారంటీలు ఇచ్చినా సవాలక్ష వివరణలు కోరుతూ..వంద శాతం నియమ నిబంధనలు వర్తించేలా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉన్నప్పుడు కేవలం అయిదేళ్లకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం తరఫున ఇష్టా రీతిన రుణాలు తీసుకునే అవకాశం ఎలా వుంది. దీనికి అసలు నియంత్రణ లేదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు పాల్పడినప్పుడు, రుణాలు పొందింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల నుండి అయినప్పుడు, అనేక దశలలో చట్టబద్ధంగా అనేక అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా అడ్డుకునే అవకాశం లేదా.

మన చట్టాలు అంత లోప భూయిష్టంగా..లొసుగులతో ఉన్నాయా. అంతా కుమ్మక్కయితే ప్రజా ధనం లూటీ కావల్సిందేనా. ప్రజాస్వామ్యంలో భాగంగా ప్రభుత్వాలను ఎన్నుకోడమే ప్రజలు చేసిన నేరమా. తాము చేయని తప్పుకు కొన్ని దశాబ్దాల పాటు ఆ భారం మోయవల్సిందేనా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సామాన్య ప్రజలకు కలుగుతున్న సందేహాలివి.
ఇక అసలు అంశం కాళేశ్వరం విషయానికొస్తే కాగ్‌ నివేదిక ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చుకు, కలిగే ప్రయోజనానికి ఎటువంటి పొంతన లేదని తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి తన కలల ప్రాజెక్టుగా రూ. 40000 కోట్ల అంచనాతో ప్రారంభించగా అది తలకిందులై నిర్మాణానికి ఏకంగా రూ.120000 కోట్లు ఖర్చు కావడం, అందులో ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులు, ఇతర సంస్థల నుండి వాణిజ్య రుణాలుగా అత్యధిక వడ్డీతో తెచ్చినవి కావడంతో అది ప్రభుత్వానికి ఆర్థికంగా పెనుభారంగా మారింది. అదట్లుంచితే తలపెట్టిన కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌గా పేర్కొంటూ భూపాలపల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం కలిగించలేకపోవడమే కాకుండా దానికి సంబంధించి విద్యుత్‌ వినియోగ చార్టీల భారం కూడా ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని కాగ్‌ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చుకు, కలిగే ప్రయోజనానికి సంబంధించి చాలా పెంచి చూపించారని తప్పుబట్టింది. కాగా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు ద్వారా మార్చ్‌ 2022 వరకు కేవలం 44,888 కొత్తగా సాగులోకి వొచ్చిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అనుమతులు పొందడం మొదలుకుని పెరిగిన ఖర్చు, పనుల నిర్వహణ, ఆయకట్టు విస్తీర్ణం, కలిగే ప్రయోజనాలకు సంబంధించి జరిగిన అనేక ఉల్లఘనలను 260 పేజీలతో కూడిన కాగ్‌ నివేదిక బయట పెట్టింది.

బాధ కలిగించే విషయమేమిటంటే ఇంత పెద్ద ఎత్తున ఇష్టారాజ్యంగా ప్రభుత్వ సొమ్ము, అదీ సుదీర్ఘ కాలం పాటు దుర్వినియోగమవుతున్నా, అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతున్నా ఎక్కడా నియంత్రణ లేకపోవడం చూస్తే రాజ్యాంగ వ్యవస్థలు తమ విధిని నిర్వర్తించడంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీసిపై ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టక పోవడం విచారకరం. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో నిర్శహించడం కష్టమే. అట్లని రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి వహించాలని కాదు..తమకు సాధ్యమయిన మేరకు విచారణ జరిపి, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది నిజమే అయితే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. నిజానిజాలను స్పష్టంగా, పారదర్శకంగా బయట పెట్టాలి.
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ,ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన స్థాయిలో ముందుకు రాలేదు.

తదనంతర కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశంసించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అందులో భారీ ఆర్థిక అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడమే కాదు…స్వయంగా 10 సం.లు దేశ ప్రధానిగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ తన కళ్ళ ఎదురుగా కేసీఅర్‌ కుటుంబం ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే తగిన చర్యలు తీసుకోలేక పోయానని…తెలంగాణలో తమ పార్టీకి అధికారం ఇస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనడం ఎన్నికల ప్రకటననే అవుతుంది. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఆర్థిక అవినీతిలో బీజేపీ అగ్ర నాయకుల ప్రమేయం ఉందని, కాంట్రాక్టులో భారీ శాతం వాట వారిదే అని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే విచారణ చేపట్టడం..దాన్ని కేంద్ర విచారణ సంస్థ సీబీఐకి అప్పజెప్పలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేయడం హాస్యాస్పదం. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్‌ కుమార్తె కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీ ల విచారణ టీవీ సీరియల్స్‌ను తలపిస్తున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల లోపాయికారీ ఒప్పందాల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం కాళేశ్వరం ఆర్థిక అవినీతి గుట్టు బహిర్గతం కాదు..నేరాలు రుజువు కావు..ఎటువంటి చర్యలు కూడా ఉండవు. కాగా ఇంత పెద్ద ఎత్తున ప్రజల పొమ్ము దుర్వినియోగమైనప్పుడు విచారణ జరిపేందుకు అసాధారణ కేసుగా భావించి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కాగ్‌ వంటి వ్యవస్థ ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగిందని నివేదిక పేర్కొన్నప్పుడు న్యాయవ్యవస్థలు సుమోటోగా జోక్యం చేసుకునే వెసులు బాటు ఉండాలి. అందుకు అనుగుణంగా చట్టాలలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడమే కాకుండా పరోక్షంగా ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనగలుగుతుంది. ఏది ఏమైనా ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన ఉద్యమకారులు ఇప్పుడు ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని ఆవేదన చెందడమే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా ప్రజల సొమ్ము ఇంతగా లూటీ కాకుండా ఉండేదనే స్థితికి చేరుకోవడం బాధ కలిగిస్తున్నది.
-వి.రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర ప్రతినిధి

Leave a Reply