Take a fresh look at your lifestyle.

వైద్యం, విద్య, వ్యవసాయంలో మనమే టాప్‌

  • ‌దేశానికి దిక్సూచిగా తెలంగాణ
  • కెసిఆర్‌కు కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్‌

సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌దేశ వ్యాప్తంగా వైద్యం, విద్య, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మెడికల్‌ ‌కాలేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సిరిసిల్ల పట్టణంలో బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులంతా కలిసి సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ ర్యాలీని నిర్వహించిన అనంతరం అంబేడ్కర్‌ ‌విగ్రహం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కెటిఆర్‌ ‌మాట్లాడుతూ…ధాన్యం ఉత్పత్తిలో, వైద్య విద్యను ప్రోత్సహించడంలో, వైద్య సహాయం అందించడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేసిన కృషి అనన్య సామాన్యమైందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతియేటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేయడంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ 43 శాతం సాధించిందని అన్నారు.

రెండు దశాబ్దాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేవలం ఒకే ఒక్క  ప్రభుత్వ హాస్పిటల్‌ ఉం‌దని, ప్రస్తుతం జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలలో ఏరియా హాస్పొటళ్లు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారని, వారందరు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్నారని అన్నారు. సిరిసిల్ల మెడికల్‌ ‌కాలేజీ ప్రారంభం కావడం ద్వారా జిల్లాలో సూపర్‌ ‌స్పెషాలిటి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పారా మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేశామని, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు మెడికల్‌ ‌కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తమ హయాంలో 21 మెడికల్‌ ‌కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో 8 మెడికల్‌ ‌కాలేజీలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, తెలంగాణ వ్యాప్తంగా మెడికల్‌ ‌కాలేజీలు, నవోదయ పాఠశాలలు, నర్సింగ్‌ ‌కాలేజీలు, సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు.

బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు ఎన్నో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణలకు ధీటుగా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని అన్నారు. ఏదైనా చేసి రాష్ట్రంలో కెసిఆర్‌ను గద్దె దించాలని చూస్తున్నారని, దిల్లీ నుండి రాజ్యం నడిపించాలని చూస్తున్నారని, వారి ఆటలను గమనించాలని కోరారు. కాంగ్రెస్‌, ‌బిజెపిలకు బాస్‌లు దిల్లీలో ఉంటారని, దిల్లీ పెద్దల చెప్పుచేతల్లో ఉండే తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో తమకు ‘‘బాస్‌’’‌లు  ప్రజలేనని, ప్రజలంతా తమ బిఆర్‌ఎస్‌ ‌వైపే ఉంటారని తాము పూర్తి నమ్మకంగా ఉన్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్‌ ‌మానేరు, కాళేశ్వరం జలాలలో సస్యశ్యామలంగా మారిందని, త్వరలో మల్కపేట రిర్వాయర్‌ ‌ప్రారంభం కాబోతుందని అన్నారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో రాజన్న సిరిసిల్ల అగ్రగామిగా నిలుస్తుందని, దీనికి కృషి చేసిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞత తెలపాలని కోరారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ ‌మాట్లాడుతూ…ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతియేటా 10 వేల డాక్టర్లను తయారు చేయడంలో సిఎం కెసిఆర్‌ ‌కృషి ప్రశంస నీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనే కసితో సిఎం కెసిఆర్‌ ఉన్నారని, తామంతా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో చొప్పదండి, మానకొండూర్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ‌రసమయి బాల్‌కిషన్‌, ‌టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్లు జిందం కళ, రామతీర్ధపు మాధవి, బిఆర్‌ఎస్‌ ‌జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేమువాడ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి చల్మెడ లక్ష్మినర్సింహరావు, రాష్ట్ర టెక్స్‌టైల్స్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గూడూరి ప్రవీణ్‌, ‌జిల్లా రైతు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్యలతో పాటు జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply