Take a fresh look at your lifestyle.

కేం‌ద్రంతో రైతు సంఘాల చర్చలు విఫలం

కేంద్రంతో రైతులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి. వరుసగా 8వ దఫా కూడా చర్చల్లో ఎలాంటి పురోగతి కానరాలేదు. దీంతో మరోమారు వివాదస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య 9వ విడత చర్చలు జరగనున్నాయి. అటు రైతు సంఘాల నేతలు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఇప్పటికే 8 విడతల చర్చలు ముగిశాయి. అయితే ఈ 8 చర్చల్లోనూ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదర లేదు. చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తుంటే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామి ఇవ్వడం మినహా మరే డిమాండ్‌ను ఒప్పుకోమని, మరే అంశమూ చర్చించబోమని రైతులు తేల్చి చెప్పారు.

అయితే ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదని, జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రాక్టర్‌ ‌ర్యాలీ నిర్వహించి తమ సత్తా చూపించబోతున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీనికి రిహార్సల్‌గా జనవరి 7న ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్‌ ‌ర్యాలీ నిర్వహించారు. అయితే ట్రాక్టర్‌ ‌ర్యాలీపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్‌ ‌ర్యాలీ నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ట్రాక్టర్‌ ‌ర్యాలీపై వివరణ ఇవ్వాలని రైతులను సుప్రీం కోరింది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ర్యాలీ ఆపబోమని రైతులు తేల్చి చెప్పారు

Leave a Reply