Take a fresh look at your lifestyle.

ముంచుకొస్తున్న ‘టెలికామ్‌’ ‌సంక్షోభం

  • ఒక లక్ష డెబ్బైఐదువేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలన్న సుప్రీమ్‌కోర్టు
  • సమయం కోరుతున్న సర్వీస్‌ ‌ప్రొవైడర్లు.. దగ్గర పడుతున్న లైసెన్స్ ‌రెన్యూవల్‌..
  • రెండు వారాల తరువాత పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం

కొరోనా వైరస్‌ ‌ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నది..దీని గురించే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే భారత దేశం మరో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుంది. ఈ సారి  సంక్షోభం టెలికాం రంగం నుంచి రానున్నది. ప్రస్తుత కొరోనా చర్చలో పడి దీని గురించి ఎక్కడా వార్తలు రావడం లేదు. అయితే టెలికాం రంగంలో రానున్న సంక్షోభం భారతదేశాన్ని తీవ్రంగా కుదిపి వేయనున్నది. గత 17 సంవత్సరాలుగా టెలికాం కంపెనీల నుంచి రావలసిన అడ్జెస్టెడ్‌ ‌గ్రాస్‌ ‌రెవెన్యూ ఆదాయం గురించి భారత ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరిగింది. ప్రస్తుత ప్రభుత్వం జియోకి అండదండగా నిలుస్తున్న నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే తీర్పునిస్తూ.. టెలికాం కంపెనీలు ఒక లక్ష డెబ్బైఐదువేల కోట్ల రూపాయలు  భారత ప్రభుత్వానికి చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా బెంచ్‌ ఈ ‌విధమైన తీర్పును ఇచ్చింది. దీనితో టెలికాం కంపెనీలన్నీ తాము ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికీ డబ్బులు కట్టలేమని తేల్చి చెప్పాయి. వెంటనే ప్రభుత్వం మధ్యేమార్గంగా ఒక ప్రతిపాదన చేస్తూ.. కంపెనీలు తమకు తామే సెల్ఫ్ అసెస్మెంట్‌ ‌చేసుకుని ఎంత మేరకు చెల్లింపులు చేయగలరో చెప్పాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తమపై విధించిన పెనాల్టీలో మూడవవంతు మొత్తం కడతామని, అయితే ఈ చెల్లింపులకు 20 సంవత్సరాల సమయం కావాలని టెలికాం కంపెనీలు కోరాయి. దీనికి సుప్రీమ్‌కోర్టు ఒప్పు కోలేదు. అయితే బకాయిలు చెల్లించడానికి కొంత సమయం ఇస్తామని సుప్రీమ్‌కోర్టు చెప్పింది. అయితే సుప్రీమ్‌కోర్టు 20 సంవత్సరాల కాలం ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఆ రంగం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కనీసం 15 సంవత్సరాల కాల వ్యవధి ఇస్తే గాని ఈ టెలికాం కంపెనీలు బకాయిలు తీర్చలేవు. కొన్ని టెలికాం కంపెనీల మనుగడ కూడా ప్రశ్నార్థకం కానున్నది అని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌ ‌లీడర్‌గా జియో, వొడా ఫోన్‌, ఎయిర్టెల్‌ ఉన్నాయి. అయితే వోడాఫోన్‌ ‌కంపెనీకి బకాయిలు తీర్చడానికి 20 సంవత్సరాల కంటే తక్కువ సమయం దొరికితే ఈ కంపెనీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుంది. టెలికాం రంగం సంక్షోభం కేవలం టెలికాం రంగాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. బ్యాంకింగ్‌ ‌రంగాన్ని కూడా ప్రభావితం చేయనుంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బ్యాంకులు టెలికాం రంగం సంక్షోభం వలన మరింత నష్టాల్లో కూరుకుపోతాయి. ప్రభుత్వం ప్రస్తుతం బ్యాంకులను నిధులు ఇచ్చి నిలబెడుతోంది. టెలికాం రంగం సంక్షోభం కూడా జోడైతే బ్యాంకుల సంక్షోభాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. ఎందుకంటే దాదాపుగా అన్ని టెలికాం కంపెనీలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఉన్నాయి. టెలికాం కంపెనీలు బ్యాంకు లోన్లను తీర్చకపోతే బ్యాంకులలో నిరర్ధక ఆస్థులు (ఎన్‌పీఏ) పెరుగుతాయి. దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం కొరోనా ఎఫెక్ట్ ‌వలన, ఇంటి నుంచే పనిచేయటం అన్నది దాదాపు అన్ని కంపెనీలు చేస్తున్నాయి. ‘వర్క్ ‌ఫ్రం హోం’  అన్నది పూర్తిగా ఇంటర్నెట్‌ ‌పై ఆధారపడి ఉన్న అంశం. టెలికాం కంపెనీలు అన్నీ కూడా సంక్షోభంలోకి వెళితే ఇంటర్నెట్‌ ‌సేవలు ప్రియం కానున్నాయి. అప్పుడు ‘వర్క్ ‌ఫ్రం హోం’ అన్నది ఖరీదైన అంశంగా మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే టెలికాం రంగ కంపెనీల సంక్షోభం ఫోర్త్ ‌ఫేజ్‌ ‌లో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం జియోకి అనుకూలంగా వ్యవహరించినట్లయితే రానున్న కాలంలో భారత ప్రజలు ఇంటర్నెట్‌ ‌సేవలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరోవైపున టెలికాం సంస్థల బకాయిలు 20 సంవత్సరాలలోపు చెల్లించేవిధంగా అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్డును కోరింది. అత్యున్నత న్యాయస్థానం రెండువారాల తర్వాత  కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపింది.  కేంద్ర ప్రభుత్వం టెలికాం బకాయిల విషయంలో  సుప్రీంకోర్డుకు  విజ్ఞప్తి  చేసిన విషయాలలో అడ్జస్టెటెడ్‌ ‌గ్రాస్‌ ‌రెవెన్యూ (ఏజీఆర్‌), ‌చెల్లింపుల్లో మరో రెండు విషయాలు ఉన్నాయి. అక్టోబర్‌ 24‌నాటికి చెల్లించాల్సిన వడ్డీ, పెనాల్టి ఫ్రీజింగ్‌ను,, 8శాతం డిస్కౌంట్‌ను కూడా పరిరక్షించాలని కోరుతున్నాయి.  కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు చేసిన విజ్ఞప్తి వల్ల మిలియన్ల వినియోగదారులపై ప్రభావం చూపనున్నది. ఆర్థికరంగంపై, ఉద్యోగరంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నది.ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్డు  కేంద్ర  ప్రభుత్వ విజ్ఞప్తిని రెండు వారాల్లో పరిశీలిస్తామని తెలియచేసింది. అంతేకాకుండా  ఏజీఆర్‌  ‌బకాయిలకు సంబంధించి  రీఅసెస్‌మెంట్‌, ‌సెల్ప్ అసెస్‌మెంట్‌లపై నిషేధం విధించింది. వోడాఫోన్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాల్సిన వాటిలో రూ.6854  కోట్లు మాత్రమే చెల్లించింది. వాస్తవానికి ఈ కంపెనీ రూ.58,254లు కోట్లు చెల్లించాల్సి ఉంది.లైసెన్స్ ‌ఫీజులు, స్ప్రెక్టమ్‌ఉపయోగించిన చార్జీలు,వడ్డీలు, అపరాధవడ్డీలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్‌ ‌సంస్థ ప్రభుత్వానికి రూ.18004కోట్లు చెల్లించింది. ఈ సంస్థ రూ.43,980 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Leave a Reply