దేశంలో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోన్న తరుణంలో ప్రస్తుతం ‘‘నో ఎన్పీఆర్’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని వాయిదా వేసినప్పుడు, జన గణన అందులోకే వస్తుందన్నారు. అధికారులు కరోనా పై పోరాడుతున్నారని, ఇలాంటి సందర్బంలో వారు ఇంటింటికి వెళ్లి ఏ విధంగా సర్వే చేస్తారని పేర్కొన్నారు. అన్నింటితో కలిపి అది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, కరోనా వ్యాప్తి సందర్బంలో రాజకీయాలు వద్దని, కోవింద్ 19 తప్పా, పొలిటికల్ కరోనా వైరస్ ల జోలికి వెళ్లనని కిషన్ రెడ్డి అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ పై కేసీఆర్ దేశాన్ని ఏకం చేస్తానన్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఇలా స్పందించారు. ‘‘కేసీఆర్ సీఏఏ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు పెట్టడం తప్పుకాదని, అలాంటి వాటిని ప్రస్తుతం వాయిదా వేసుకుంటే మంచిదని హితవు పలికారు’’.
కరీంనగర్ లో ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు దేశానికి ఎందుకు వచ్చారనే అంశంపై ప్రస్తుతం సెకండరీ అని అన్నారు. అయితే, ప్రస్తుతం దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుంచుకోవాలన్నారు. మత ప్రచారానికి చాలా రోజుల క్రితమే ఆ బృందం దేశానికి వచ్చిందని, అప్పటికే వారికి కరోనా సోకినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. వారు సందర్శించిన ప్రార్థన మందిరాలు, ప్రయాణించిన రైలు బోగీ ప్రయాణీకుల్ని అలర్ట్ చేశామన్నారు. దేశ ప్రజల్లో ఆత్మసైర్థ్యాన్ని నింపేందుకే పార్లమెంట్ నడిపిస్తున్నామన్నారు. మనీలాతో పాటూ,వివిధ విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి రక్షణపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. క్వారెంటైన్ నుంచి త్వరలో విడుదల కానున్న తెలుగు వారిని నేరుగా కలువనున్నట్లు ఆయన తెలిపారు. విధి నిర్వహాణలో ఉన్నా అధికారిని భయపెట్టడం సరికాదని, ఆయనకు కేంద్రం పూర్తి భద్రతను కల్పిస్తుందని ఏపి అధికారి రమేష్ కుమార్ వ్యవహారంకి సంబంధించి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు