Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు

  • జలకళతో నిండుకుండల్లా ప్రాజెక్టులు..పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • పొంగి ప్రవహిస్తున్న మూసీ నది…తడిసి ముద్దయిన హైదరాబాద్‌
  • ‌నగరంలో మళ్లీ భయంభయం…భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం..ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
  • భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్‌ ‌ట్వీట్‌
  • ‌పర్యటనలో వరదనీటిలో దిగబడ్డ ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి కారు
  • ఉమ్మడి కరీంనగర్‌ను ముంచెత్తిన వాన

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడింది. దీంతో హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా నాగోల్‌ ‌పరిధిలోని బండ్లగూడలో 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇక జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో బస్వాపూర్‌ ‌వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. బస్వాపూర్‌ ‌సమీపంలో మోయతుమ్మెద వాగుకు వరద పోటెత్తింది. సిద్దిపేట-హన్మకొండ రోడ్డులో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నంగునూరు, ధూళిమిట్ట మండలంలో చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లు తున్నాయి. నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దాచారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ ‌మండలంలో కురిసిన వానలకు ఏట్ల ఎర్రవల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో దేవరపల్లి గ్రామ ప్రజలు నాగరగూడ వైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసాయి.

కరీంనగర్‌, ‌మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌, ‌గంగాధర, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, చందుర్తి, మెట్‌పల్లిలో వర్షం కూరిసింది. కథలాపూర్‌ ‌మండలంలో కురిన వానలకు వరదకాలువ బ్రిడ్జిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో కథలాపూర్‌-‌భూషణరావు పేట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని చింతకుంట గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. వేముల వాడలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయ ప్రాంగణం జలమయమయింది. దేవాలయం ముందు, పాత ఆంధ్రబ్యాంక్‌ ‌వద్ద డ్రైనేజ్‌ ‌సరిగా లేకపోవడంతో మురికి నీరు పరిసర ప్రాంతాల్లోని దుకాణంలోకి చేరాయి. దీంతో షాప్‌లో ఉన్న సామాన్లు అన్నీ తడిసి ముద్దయ్యాయి. మెదక్‌, ‌సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 6.1 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా చేగుంట మండలంలో 21.7 సెంటీమీటర్లు, శివ్వంపేటలో 11.6 సెంటీమీటర్లు, తూప్రాన్‌లో 10.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 2.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది.

ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,597.36 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 641.80 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలకు గాను? పూర్తిస్థాయి 3.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వొచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,063 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 450 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా, 530.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 168.3418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది ఎగువన ఉన్న ఆలమట్టి రిజర్వాయర్‌లోకి 56,944 క్యూసెక్కుల వరద నీరు వొస్తుంది. ఆలమట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 95.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నాగార్జునసాగర్‌ ‌డ్యామ్‌కు దిగువన ఉన్న నీటిని రివర్సబుల్‌ ‌పంపింగ్‌ ‌చేస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుంది. బుధవారం సాయంత్రానికి 530 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ ‌నుంచి 450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు జలవిద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తితో 7062 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం 807.70అడుగులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద రాక పెరిగితే జలవిద్యుదుత్పత్తి మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 170.99 (39.79టీఎంసీలు)అడుగులకు చేరింది. మరోవైపు భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తోంది. దాంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేసి 11వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు, మూకమామిడి ప్రాజెక్టులోకీ వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 15.4 అడుగులకు పెరిగింది.

హైదరాబాద్‌లో మళ్లీ భయంభయం…భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం..ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన వాన తెల్లవారు జాము వరకు కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో పలు కాలనీలు మళ్లీ నీట మునిగాయి. గతేడాది మాదిరిగానే మళ్లీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నిద్రలేని రాత్రి గడిపారు. నాగోల్‌ ‌పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్‌ ‌మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వాన నమోదయ్యింది.

Widespread rains across the state

అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్‌, ‌మలక్‌పేట, నాంపల్లి, బంజారాహిల్స్, అమీర్‌పేట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. ఎడతెరపిలేని వానలతో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అంబర్‌పేట మూసీ పరివాహ ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగాయి. పటేల్‌నగర్‌, ‌ప్రేమ్‌నగర్‌లోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ముసారాంబాగ్‌ ‌బ్రిడ్జిపైనుంచి మూసీనది ప్రవహిస్తున్నది. దీంతో వంతెనపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నాగోల్‌ ‌పరిధిలోని అయ్యప్ప నగర్‌ ‌కాలనీ నీట మునిగింది. మల్లికార్జున నగర్‌, ‌త్యాగరాజనగర్‌ ‌కాలనీల్లోకి, సరూర్‌నగర్‌ ‌చెరువుకట్ట లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కోదండరాం నగర్‌, ‌సీపల బస్తీ, వీవీనగర్‌, ‌కమలానగర్‌లో వరద నీరు ప్రవహిస్తున్నది. మూసీ, ఈసీ నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. దీంతో గండిపేట, హిమాయత్‌సాగర్‌ ‌జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్‌ ‌ట్వీట్‌
‌రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైనట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సమస్యలు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబర్లకు కాల్‌ ‌చేయాలని నగర పౌరులకు కేటీఆర్‌ ‌సూచించారు.

వరద ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లగా వరదనీటిలో దిగబడ్డ ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి కారు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్బీనగర్‌లోని గడ్డి అన్నారంలో వరద ఉధృతి నెలకొంది. పలు కాలనీల్లో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి గురువారం ఉదయం వరద ముంపుకు గురైన కాలనీలలో పర్యటించిన సందర్భంగా హస్తినాపురంలో ఆయన కారు వరద నీటిలో చిక్కుకుంది. ఎంత ప్రయ్నతించినా కారు ముందుకు కదలలేదు.

ఉమ్మడి కరీంనగర్‌ను ముంచెత్తిన వాన
ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో గడిచిన బుధ, గురు వారాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. జగిత్యాల జిల్లాలోని కథలాపూర్‌లో అత్యధికంగా 145.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రాంగిలో 110.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలోని గోవిందరాంలో 119.0మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇల్లంతకుంటలో 90.8 మి.మీ., మల్లారంలో 80.0 మి.మీ., బోయిన్‌పల్లిలో 60 మి.మీ., గజసింగారంలో 58.8 మి.మీ., గంభీరావుపేటలో 56.5 మి.మీ., నాంపల్లిలో 56.0 మి.మీ., పెద్దలింగాపూర్‌లో 50.6 మి.మీ., మర్రిగడ్డలో 50.0 మి.మీ., వ్టటెంలలో 46.3 మి.మీ., ఆవునూరులో 35.5 మి.మీ., ఎల్లారెడ్డిపేటలో 34.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ ‌జిల్లా పరిధిలోని రేణికుంట, చిగురుమామిడిలో 85.9 మి.మీ., వెంకిపల్లిలో 72.0, వీణవంకలో 58.0, బోర్నాపల్లిలో 54.3, గట్టుదెద్దనపల్లిలో 52.5, ఈదుల్లగ్టటెపల్లిలో 50.0, నుస్తులాపూర్‌లో 50.0, గంగిపల్లిలో 43.8, కొత్తగట్టులో 37.8, పోచంపల్లిలో 36.8, జమ్మికుంటలో 30.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Leave a Reply