Take a fresh look at your lifestyle.

ప్రతిపక్షాలు ఐసోలేషన్‌లో ఉన్నాయి

  • దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడంలేదు
  • ప్రతికూల పరిస్తితుల్లోనూ  రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ ‌రావు

కొరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంటే ప్రతిపక్ష నేతలు మాత్రం ఏసీ రూముల్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మేం ప్రతీరోజూ రైతుల మధ్య, ప్రజల మధ్య తిరుగుతుంటే రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్‌రావు మెదక్‌ ‌జిల్లా కుల్చారం మండలంలోని రంగంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమస్యలు ఉంటే, మేం వారి మధ్యే ఉన్నాం. మమ్ముల్ని అడుగుతారు కదా.అని ప్రశ్నించారు. కరోనా వచ్చిన కష్ట కాలంలోనూ దేశంలోని మరే రాష్ట్రమూ చేయని విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొంటున్నామని చెప్పారు. కొల్చారం మండలం రంగంపేటలో వడ్ల మార్కెట్‌ ‌లో ఇప్పటి వరకు 599 మంది రైతుల వద్ద వడ్లను కొన్నామనీ, దీనికి సంబంధించి రూ. రెండు కోట్ల రూపాయలకు పైగా రైతుకు చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి గన్నీ బ్యాగులు, లారీల సమస్య లేదన్నారు. కరోనా ఇబ్బంది పరిస్థితుల్లో ఎమ్మెల్యే, అధికారులు, ఐకేపీ సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారనీ, రైతు శ్రేయోభిలాషి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు.

బీజేపీ,కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో రైతులు తమ పంటలు అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారనీ, కర్ణాటకలో ప్రభుత్వం శనగలు కొనుగోలు చేయడం లేదు. బీదర్‌ ‌రైతులు నారాయణ ఖేడ్‌, ‌జహీరాబాద్‌ ‌కు తెచ్చి అమ్మందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాగే, చత్తీస్‌ ‌ఘడ్‌ ‌ప్రభుత్వం సీలింగ్‌ ‌పెట్టి రైతుల నుంచి పంటలు కొంటున్నాయనీ, సరిహద్దు గ్రామాలకు చెందిన రైతులు తమ పంటలు ఇక్కడ తెలంగాణలో అమ్మెందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రం వడ్లు,జొన్నలు, శనగలు, మినుములు, పెసర్లు కొనడం లేదనీ, మేం ఇవన్నీ మద్ధతు ధర ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం కొంటున్నదని చెప్పారు. రాష్ట్ర మంతా లాక్‌ ‌డౌన్‌ ఉన్నా…రైతులకు లాక్‌ ‌డౌన్‌ ‌లేదనీ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ధైర్యముంటే ప్రజల మధ్య తిరగాలి కానీ, హైదరాబాద్‌ ‌లో కూర్చుని గవర్నర్‌ ‌కు వినతి పత్రాలు ఇస్తే సరిపోదని ఎద్దేవా చేశారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల ప్రజల్లో మనో ధైర్యం నింపేందుకు ప్రజల మధ్య తిరుగుతున్నారనీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగి నిజా నిజాలు తెలుసుకోవాలని సవాల్‌ ‌విసిరారు. ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే… ప్రతిపక్షాలు ఎసీ రూంలో కూర్చుని విమర్శలు చేయడం సరికాదనీ, ఇప్పటికైనా వారు తమ పద్దతి మార్చుకోవాలని ఈ సందర్భంగా హరీష్‌రావు సూచించారు.

Leave a Reply