Take a fresh look at your lifestyle.

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”

(ఆగస్ట్ -13,‌ ప్రపంచ అవయవ దాన దినోత్సవం ను పురస్కరించుకొని)

ఒక కోటీశ్వరుడు కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారును, ఫలానా రోజున అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు పేపర్లో ప్రకటన వేశాడు. ఆ కారు అంటే తనకు చాలా ఇష్టమని, తాను చనిపోయిన తరువాత కూడా ఈ కారు తనకే చెందాలి కాబట్టి అంత్యక్రియలు చేస్తున్నట్లు ఆ ప్రకటన సారాంశం.కారుకు అంత్యక్రియలు ఏమిటని ఆశ్చర్య పోయిన జనాలు ఆ తంతు చూడటానికి చాలా మంది వచ్చారు. కారుకు సరిపోయేలా అక్కడ ఓ పెద్ద గొయ్యి తవ్వి ఉంది, ఇంతలో కారులో కోటీశ్వరుడు వచ్చారు. తల తల మెరిసిపోతున్న ఖరీదైన కారుని మట్టిలో పాతి పెడుతున్నారని, అక్కడ చేరిన వారందరికీ మనసు ఓ రకంగా బాధ అనిపించింది. కొందరయితే ఆయన మీద ఆగ్రహంతో గొడవకు దిగారు. ‘‘ఇంత విలువైన కారు ని పాతి పెట్టడానికి నీకు మనసెలా ఒప్పింది, ఎవరికైనా ఇస్తే వాడుకుంటారు కదా ! అమ్మితే వచ్చిన డబ్బుతో ఎందరికో ఆకలి తీర్చ వచ్చు కదా,మీరు చచ్చిపోయాక కారు ఏమి అయితే మీకు ఎందుకు ? మరీ ఇంత మూర?త్వమా!’’ అంటూ నిలదీశారు దానికి ఆయన ఇలా వివరించారు. ‘‘నిజమే ఖరీదైన కారును మట్టిపాలు చేస్తున్నానని మీకు కోపం వచ్చింది, కోటి రూపాయలు పెడితే కొత్త కారు వస్తుంది. కానీ నాకు గుండె కావాలి 10 కోట్లు ఇస్తాను, ఎవరైనా ఇవ్వగలరా ? ఇవ్వలేరు! ఖరీదు కట్టలేని అలాంటి విలువైన అవయవాలను ఎన్నింటినో చనిపోయిన మనిషి తో పాటు మట్టిలో పాతి పెడుతున్నాం లేదా కాల్చి బూడిద చేస్తాం,అప్పుడు ఎవరు ఈ పద్ధతులను ప్రశ్నించలేదు ఎందుకు’’ అని నిలదీశాడు. ఆ ప్రశ్నలు విని అందరూ తెల్లబోయారు.
కారు మీద ప్రేమతో నో, మూర?త్వం తోనో నేను ఈ పని చేయ లేదు, అవయవ దానం విలువ మీకు గుర్తు చేయాలని ఇదంతా చేశాను. ఇప్పటికైనా ఆలోచించండి అవయవ దాతలు కండి అని చెప్పి ఆయన కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు……….
పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ. ఆరోగ్యవంతమైన మనిషి నుంచి అవయవాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో రోగికి వాటిని అ మార్చడం ను అవయవదానం అంటారు . ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం సాధించిన అద్భుత విజయం ఇది, రోగి శరీరంలో పూర్తిగా పాడై విధులను సక్రమంగా నిర్వర్తించలే ని స్థితి ఉత్పన్న మైనప్పుడు అటువంటి వారికి అవయవ మార్పిడి అవసరమవుతుంది, దీన్ని ప్రణాళిక, నిబద్ధత కలిగిన యంత్రాంగం, సంస్థలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నిర్వహించవచ్చును. ప్రపంచంలో తొలి అవయవ దానం చేసిన దాత రోనాల్డ్ ‌లీ హె రిక్‌. ఆయన తన కవల సోదరుడికి 1954లో మూత్రపిండాన్ని దానం చేశారు. ఈ చికిత్స నిర్వహించిన వైద్యుడు జోసెఫ్‌ ‌ముర్రే కి 1990లో నోబెల్‌ ‌బహుమతి ప్రధానం చేశారు. కేవలం 100 నిమిషాల జీవనకాలం ఉన్న ఓ చిన్నారి నుండి మూత్రపిండాలను తీసి 2015లో మరొకరికి అమర్చారు. స్కాట్లాండ్‌ ‌దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంటిలోని కార్నియాను మరొకరికి దానం చేయడం ద్వారా అతి వృద్ధ అవయవ దాత గా చరిత్రలో నిలిచారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో అవయవదానానికి సంబంధించి అనేక చట్టాలు రూపొందించారు. అర్జెంటీనాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అవయవదానానికి అర్హులే నని తీర్మానం ఇస్తూ 2005 నవంబర్లో చట్టం తెచ్చారు. బ్రెజిల్‌, ‌చిలీ ,కొలంబియా లోనూ ఇదే తరహా చట్టాలున్నాయి. ఐరోపాలోని వివిధ దేశాల్లో అవయవదానంపై పటిష్ఠ చట్టాలు అమలు అవుతున్నాయి. స్పెయిన్‌ , ఆ‌స్ట్రియా , బెల్జియం లలో అత్యధిక సంఖ్యలో అవయవ దాతలు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. స్కాట్లాం డ్‌ ‌లో పౌరులంతా అవయవ దాన పత్రంలో తమ పేర్లు తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. భారత దేశంలో కార్నియా మార్పిడి మాత్రమే పూర్తిస్థాయిలో అమలు అవుతోంది. భారత ప్రభుత్వం 1994లో మానవ అవయవ మార్పిడి చట్టం తీసుకువచ్చింది. దీనికి 2011లో కొన్ని మార్పులు చేశారు. దేశంలో 2013లో మరణానంతర అ అవయవదాన సందర్భాలు అధికంగా నమోదయ్యాయి…..
సమస్య తీవ్రత…..
మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల లోనే బ్రెయిన్‌ ‌డెడ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయి.అలాంటి వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరిస్తే అవయవాల కొరత సగానికి సగం తీరుతుంది. చాలా దేశాల్లో బ్రెయిన్డెడ్‌ ‌కేసుల్లో ఆ శరీరాలపై సర్వహక్కులు ప్రభుత్వా లవే. కుటుంబ సభ్యుల అనుమతి తో నిమిత్తం లేకుండా అవయవాలను స్వీకరించి అవసరమైన వారికి అమరుస్తారు.అవసరానికి అందుబాటులో ఉన్న అవయవాలకి మధ్య విపరీతమైన తేడా ఉంది మనదేశంలో. ఆ పరిస్థితిని అంకెల్లో పెడితే….అవసరమైన అవయవాలు అందుబాటులో లేక సంవత్సరానికి 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు లక్షల 20 వేల మంది మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉండగా, 15వేల మూత్రపిండాలు మాత్రమే లభిస్తున్నాయి. లక్ష మంది కాలేయ జబ్బులతో మరణిస్తున్నారు. కేవలం వెయ్యి మంది కే కాలేయం దొరుకుతుంది. కళ్ళ కోసం 10 లక్షల మంది, గుండె మార్పిడి కోసం 50 వేల మంది, ఊపిరితిత్తుల కోసం 20 వేల మంది వేచి చూస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ ‌లలో లో గత ఎనిమిదేళ్లలో మొత్తం అన్ని రకాల అవయవ మార్పిడి ఆపరేషన్‌ ‌లు కలిపి 2216 మాత్రమే జరిగాయి. అయితే ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే ఇవి పెరగడం సానుకూల అంశం.2010 లో ఒకే ఒక గుండె మార్పిడి జరగగా 2017 లో 32 జరిగాయి. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్‌ ‌లు నలభై ఆరు నుంచి 221 కి పెరిగాయి. తెలంగాణలో ఈ సంవత్సరం జనవరి నుండి జూలై 24 వరకు జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు మొత్తం 351. జీవించి ఉండగానే, మరణించిన తర్వాత…. రెండు రకాలుగా అవయవ దానం చేయవచ్చు. మూత్రపిండాలు రెండు ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఒకటి తీసి అవసరమైనా మరొకరికి పెట్టవచ్చు. అలాగే కాలేయంలో కొంత భాగం కూడా మరొకరికి దానం చేయవచ్చు.
కానీ ఎక్కువగా అవయవదానం జరిగేది మరణించాక అంటే బ్రెయిన్డెడ్‌ ‌సందర్భాలలో. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో , కొన్నిరకాల అనారోగ్యాల లో ఉరి వేసుకోవడం లాంటివి జరిగినప్పుడు మొదట మెదడు దెబ్బతింటుంది . అది తీవ్రంగా దెబ్బతిని ఇక కోలుకునే అవకాశం లేని పరిస్థితిని బ్రెయిన్డెడ్‌ అం‌టారు. ఆ పరిస్థితిలో వైద్య పర్యవేక్షణలో కృత్రిమ శ్వాస అందిస్తే శరీరంలోని మిగతా అవయవాలన్నీ పని చేస్తూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు అనుమతిస్తే వాటిని తీసి ఇతరులకు అమరుస్తారు. సహజ మరణం తర్వాత కూడా అ కళ్ళు ఇతర కణజాలాన్ని దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత పార్ధివదేహాన్ని మెడికల్‌ ‌కాలేజీలో విద్యార్థులు విద్యని అభ్యసించే ఈ క్రమంలో లో డిసెక్షన్‌ ‌కొరకు ఉపయోగిస్తారు. బ్రెయిన్‌ ‌డెత్‌ ‌కోమా ఒకటి కావు. కోమాలో ఉన్న వ్యక్తికి వెంటిలేటర్‌ ‌తప్పనిసరి కాదు. అటువంటి వ్యక్తి మెదడు తిరిగి కోలుకునే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. మనదేశంలో దీన్ని నిర్ధారించడానికి నలుగురు వైద్యులతో కూడిన బృందం ఆరు గంటలపాటు ఒకటికి రెండు సార్లు పరీక్షించాలి. ఆ తరువాతే ఆయా వ్యక్తులను బ్రెయిన్‌ ‌డెడ్‌ ‌గా నిర్ధారించి అవయవాలని సేకరిస్తారు.
 వీరిని సంప్రదించవచ్చు
భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వాటిలోముఖ్యంగా తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం, అఖిలభారత అవయవ దాతల సంఘం, మోహన్‌ ‌ఫౌండేషన్‌, ‌కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఆర్గాన్‌ అం‌డ్‌ ‌టిష్యూ ట్రాన్స్ ‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌, ‌శతాయు , లాంటి వెబ్‌ ‌సైట్లు అవయవ దానం చేయాలనుకునే వారిని ప్రోత్సహిస్తున్నాయి. అవయవ మార్పిడి అవసరమైన వారు రాష్ట్రాల రాజధాని కేంద్రాలలో ఉన్నటువంటి జీవన్‌ ‌దాన్‌ ‌కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అలాగే అవయవ దాతల సమాచారం వివిధ హాస్పిటల్స్  ‌ద్వారా వారికి చేరుతుంది అందుబాటులో ఉన్న అవయవాలను బట్టి అవసరమైన వారికి సమాచారం ఇచ్చి వెంటనే శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పిస్తారు. ఉస్మానియా గాంధీ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ‌ల్లో అయితే ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అవయవ దానానికి సంబంధించిన సమాచారం కోసం జీవన్దాన్‌ ‌పథకానికి చెందిన ఈ క్రింది నెంబర్లకు ఫోన్‌ ‌చేయవచ్చు..
తెలంగాణ : 9603944026,8885060092.
ఆంధ్రప్రదేశ్‌ : 180042564444.

‌సామాజిక బాధ్యత
అవయవ దాన కార్యక్రమం పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పాఠశాల స్థాయి నుండే ఆ మేరకు అవగాహన పెంచాలి. ప్రభుత్వంతోపాటు ప్రసార మాధ్యమాలు చురుగ్గా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది. వాహన రవాణా లైసెన్సు స్వీకరణ సమయంలోనే ప్రతి వాహన యజమాని తో ‘‘ నేను అవయవ దాత ను’’ అనే అంగీకార పత్రంపై సంతకం పెట్టించాలి . దేశంలోని ప్రతి కళాశాల , విశ్వవిద్యాలయంలోనూ ఇందుకు సంబంధించి ఒక సమన్వయ కర్త ను నియమించాలి. సమీప ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ రక్తదానంతో పాటు ఇతర అవయవ దానాలు పైన ప్రజలలో చైతన్యం తీసుకురావడం వీరి బాధ్యత కావాలి. దేశంలోని ప్రతి వైద్య విద్యార్థికి అవయవదాన చైతన్య కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను కోర్సులో భాగంగా నిర్దేశించాలి. అవయవ దానం చేసిన వారి కుటుంబీకుల నుండి ఎట్టిపరిస్థితుల్లోనూ శస్త్రచికిత్స, వైద్య సేవలకు సంబంధించి ఖర్చులను వసూలు చేయరాదు. పైగా అవయవ దాతల పేరిట కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ ‌చేయగలిగితే అది అద్భుతమైన ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందుకోసం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునేందుకు ఒక ఒక ప్రత్యేక కమిటీని నియమించాలి. అవయవ స్వీకర్త ప్రతినెల ఔషధాల కోసం కనీసం 15 వేల నుండి 20000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి శస్త్ర చికిత్స అనంతరం వారికి కనీసం రెండు మూడు సంవత్సరాల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు కొంతమేర ఆర్థిక సహాయం అందించాలి. పేదరికం వల్ల అవసరమైన మందులు కొనుగోలు చేయలేక , అనారోగ్యం సమస్యలు తలెత్తి స్వీకర్త కు జరగరానిది జరిగితే మొత్తంగా అవయవ దాన ప్రక్రియే అర్థం లేనిది అవుతుంది. ప్రభుత్వం చట్టాలు చేసినా నా ఇప్పటికీ డబ్బు కోసం మూత్రపిండాలు అమ్ముకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని దళారులు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక ఒక అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొన్ని సందర్భాల్లో అవయవాలను అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. అలాంటప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణ ఖర్చులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలి . అవయవ స్వీకర్త లే అవయవ దానానికి సంబంధించిన ప్రచారకర్తలుగా మారి ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాలి. అవయవ మార్పిడి కి సంబంధించిన కార్యక్రమంలో ఆర్థిక లావాదేవీలు హద్దుమీర రాదు . ఏ మాత్రం గతి తప్పిన నైతిక విలువలను పణంగా పెట్టి రోగులను వైద్య శాలలు మోసం చే సే ప్రమాదాలు కొట్టిపారేయలేం . రోగులు చిన్నపాటి కోమాలోకి వెళ్లిన కూడా బ్రెయిన్డెడ్‌ ‌గా చూపించేందుకు వాళ్లు ప్రయత్నించవచ్చు. మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి..!
image.png
 డా : అశోక్‌ ‌పరికి పండ్ల, తెలంగాణ
నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,
9989310141

Leave a Reply