Take a fresh look at your lifestyle.

అమరగానం

తూర్పు పవన గాలుల జడికి

ఎరుపెక్కిన తిరుగుబాటు గళానివి!

మట్టి మనుషుల శ్రమ సుగంధాన్ని

పాటగా ఎలుగెత్తి ప్రజల గుండెల్లో

పదిలంగా నాటిన ప్రజాగాయకుడువి!

ఉస్మానియా అలజడుల నడుమ

ఎరుపు పాటవై నక్సల్బరి

వసంత కాల మేఘ ఘర్జనలో

పాటలని  పదును ఈటెలుగా

దోపిడీ శక్తుల గుండెలకు

గురిపెట్టిన విలుకాడివి నీవు!

జనం గుండె చప్పుళ్లకు

నీ పాటలే దరువై

శివమెత్తి నర్తించే నీ ఆటలు

కన్నీళ్ళ వాడల్ని కదిలించి

కత్తుల కవాతు దండుగ మార్చేశాయి!

అమరుల అమ్మల కన్నీళ్లను

ఆర్తితో తుడుస్తూ ఓదార్పు

వందనాలు అందించిన కొడుకువి!

గంగ దాటెళ్ళి పోయే విప్లవ చెల్లెళ్ళ

పాదం మీది పుట్టుమచ్చవై

తోడబుట్టకున్నా అన్నవై

రుణంతీర్చుకుంటానని బాసచేసినోడివి!

అడవులు పల్లెలు మైదానాలు

నీ పాటను పలవరిస్తూ

కొత్త లోకంకోసం కలల్ని కంటూ

తూరుపు దారిలో రేపటి

ప్రభాత వెలుగు క్రాంతులయ్యాయి!

దుక్కి దున్నే దుర్గన్న

మోటకొట్టే మల్లన్న

రిక్షా తొక్కే రహీమన్న

కలుపు తీసే లచ్చుమమ్మ

గనిలో శ్రామికుడు

కార్ఖానాలో కార్మికుడు

జంగల్ లో అడవి బిడ్డలు

లోకపు పీడితుల గొంతువై

పాటగా నినదించిన

విప్లవ శంఖానాదం నీవు!

గోచీబతుకుల కాపరిలా

గొంగడి భుజాన వేసుకుని

కర్ర కరవాలం చేతబట్టి

అరుణారుణ గీతాలతో

నింగి నేలా ఎరువును పులిమి

జనగోసను జెండాగా మార్చి

ఆకాశమంతా నిండిన

 రేల పాటవు నీవు!

శత్రువు పేల్చిన బుల్లెట్ను

వెన్నులో దాచుకుని

పొడుస్తున్న పొద్దుమీద

నడిచి వచ్చిన వీర గానానివి!

దగా పడ్డ తెలంగాణా గొంతువై

జన తెలంగాణా సాధనకై పిడికిలి బిగించి ఉద్యమించిన పోరు తెలంగాణా

సాంస్కృతిక సైనుకుడివి!

మరణం అందరకీ సహజమైనా

నీవు లేకున్నా మరణం లేని

నీ పాట అందరి హృదయాల్లో

చిరంజీవై జ్వలిస్తూనే ఉంటుంది!

జీవితాన్ని పాటను మాటను

జనాల జాగృతికోసం అంకితం చేసిన

ప్రజా యుద్ధ నౌకవు నీవు!

నీ అంతిమ యాత్రలో

 కదిలి వచ్చిన అశేష జనవాహిని

నీ పాటకు మోకరిల్లిన అభిమానులే!

నీవూ నీ పాట నీ కాలి

గజ్జెల చప్పుడు నీకుమల్లే

అమరత్వం పొంది నీ దారిలో సాగుతూన్న

జన నాట్య కళాకారులకు

మార్పు కోరే అభ్యుదయ శక్తులకు

వేగు చుక్కగా నిలిచి ఉంటుందిలే !

( గద్దరన్న స్మృతికి నివాళిగా )

—————————-

డా. కె. దివాకరా చారి

9391018972

Leave a Reply