Take a fresh look at your lifestyle.

‌నోరుజారితే ఇక అంతే …

అసలే ఎన్నికల సీజన్‌. ఇలాంటి పరిస్థితిలో ఏ నాయకుడైనా నోరుజారాడే అనుకుందాం.. ఇక ఇంతే సంగతులు.  అందుకోసమే కాచుకుకూర్చున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు దొరికిందే ఛాన్స్‌గా ఆ నాయకుడితో పాటు, ఆయన  కొనసాగుతున్న రాజకీయ పార్టీపై క్షణాల్లో విరుచుకు పడుతాయి. సంబంధిత  నాయకుడు ఏ సందర్భంలో అన్నాడో, ఏ ఉద్దేశ్యంగా అన్నాడన్న విచక్షణకు ఏ మాత్రం అవకాశం లేకుండా తమ నిరసన గళాన్ని విప్పేస్తాయి. అంతటితోనే ఆగిపోతాయా అంటే కాదనే చెప్పాలి. ఊరు ఊరు, వాడవాడలా వరుసగా దిష్టిబొమ్మల దగ్ధాలు, ధర్నాలు, ప్రదర్శనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతోంది. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది. సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు రోజులపాటు( మంగళ, బుధ) నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపు నివ్వడంతో మారుమూల గ్రామాల్లో కూడా నిరసన ప్రదర్శనలు ప్రారంభమైనాయి.

ప్రదర్శనల్లో భాగంగా రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీల దిష్టి బొమ్మలను కూడా బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు దగ్ధం  చేస్తున్నారు. అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత విద్యుత్‌  ‌పైన కామెంట్‌ ‌చేయడమే ఈ నిరసనలకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో మరెక్కడా లేని విధంగా భారాస ప్రభుత్వం వ్యవసాయరంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక భారాన్ని మోస్తున్నదన్న విషయాన్ని పక్కకు పెడితే.. ఆ రంగంలో కొన్ని దశాబ్ధాలుగాలేని వెసులుబాటును బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కల్పించిన మాట వాస్తవం. అయితే నిజంగానే రైతులకు ఉచిత విద్యుత్‌ ‌సరఫరా 24 గంటలు అవసరమా అన్న విషయంలో ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది. ఏదియేమైనా ఉచిత విద్యుత్‌ అన్నది దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ఒక ఆయుధంగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు కరెంటు వొస్తుందో , ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుబట్టని విషయం. కరెంటు కోసం ఎదురుచూసే రైతాంగం అర్థరాత్రులు తమ పొలాలకు నీళ్ళు పెట్టుకోవడానికి వెళ్ళి పాముకాటుకు గురవడమో, విద్యుత్‌ ‌షాక్‌కు గురి అవడమో జరుగుతుండేది. విద్యుత్‌లేక తమ వ్యవసాయక్షేత్రాలు ఎండిపోతే వాటిని చూడలేక రైతులు ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సర్కార్‌ 2018‌లో రాష్ట్రంలోని సుమారు 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ‌పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతకు ముందే 2016లో ఉమ్మడి మెదక్‌, ‌నల్లగొండ, కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం బాగానే ధనాన్ని వెచ్చించాల్సి వొస్తున్నది. అయితే దానికన్నా పంట ఉత్పాదకత అధికమవుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలుకూడా ఎన్నికల రంగాన్ని సిద్ధం  చేసుకుంటున్నాయి. ఈ దశలో రేవంత్‌రెడ్డి అమెరికాలో తానా సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన ఒక కామెంట్‌ ఇప్పుడు రాష్ట్రంలో దావనలంగా మారింది. దీనిపై ప్రధాన రాజకీయ పార్టీలమధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి సర్కార్‌ అమలు పరుస్తున్న ఉచిత విద్యుత్‌ను రేపు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు పూర్తిస్థాయిలో కాదన్న సమాధానం రేవంత్‌రెడ్డి నుంచి రావడమే ఈ పరస్పర విమర్శలకు దారితీసింది.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొస్తే ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని, వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ 24 ‌గంటల పాటు అవసరంలేదని రేవంత్‌ ‌రెడ్డి అన్నట్లుగా వొచ్చిన వార్తపై ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ ‌విరుచుకుపడుతోంది. ఒక ఎకరానికి నీరు పారించేందుకు ఒక గంట కరెంటు ఉంటే చాలు. సాధారణంగా రాష్ట్రంలో 90శాతం మంది రైతులకు  మూడు ఎకరాలకుమించి ఉండదు. మూడు ఎకరాలకు నీరు అందించేందుకు ఆ రంగానికి మూడు గంటలకన్నా ఎక్కువ కరెంటు అవసరంలేదని రేవంత్‌రెడ్డి అనడం రైతులపట్ల కాంగ్రెస్‌ ‌పార్టీకున్న వ్యతిరేక విధానాన్ని బట్టబయలు చేసిందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ‌తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌రైతులను ఎంత ఘోషపెట్టిందన్నది తెలియందికాదు. ఆపార్టీ రైతాంగ సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని, ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఇప్పుడు ఈ రంగంలో పొందుతున్న సంక్షేమ, అభివృద్ధిపనులను కాంగ్రెస్‌ అటుకెక్కిస్తుందంటున్న మంత్రి హరీష్‌రావు, నాడు తెలంగాణ ఉద్యమంమీద తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి, నేడు పచ్చబడ్డ తెలంగాణపై విషం చిమ్ముతున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే రేవంత్‌ ‌మాటలపట్ల స్వీయ పార్టీ నాయకులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్‌ ఆలా అనాల్సిందికాదంటూనే, ఏ సందర్భంలో అన్నాడన్నది ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఉచిత విద్యుత్‌ ‌విషయంలో కాంగ్రెస్‌పార్టీ ఆప్పుడెంత శ్రమ పడిందన్నది తనకు తెలుసని, అప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో లేడన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ,  తాను కాంగ్రెస్‌ ‌పార్టీ స్టార్‌ ‌క్యాంపైనర్‌గా  రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటును అందజేస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్‌ ‌సిఎం అభ్యర్థిపై రేవంత్‌ ‌చేసిన ప్రకటనపైన కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. తానుగాని, రేవంత్‌రెడ్డి గాని కేవలం పార్టీ కోఆర్డినేటర్లమేనని, సిఎం ఎవరవ్వాలన్నది పార్టీ హైకమాండ్‌ ‌నిర్ణయిస్తుందని ఆయన కొట్టిపారేయగా, రేవంత్‌ ‌వర్గం ఆయనను సమర్థిస్తోంది. మొత్తానికి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపాయి. కాంగ్రెస్‌పై ఇప్పటికే విరుచుపడుతున్న బిఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి మరో ఆయుధాన్ని  అందించినట్లైంది.

Leave a Reply