Take a fresh look at your lifestyle.

సంచలనం లేపుతున్న రాహుల్‌ అనర్హత

కాంగ్రెస్‌ అ‌గ్రనేత, పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్‌ ‌సెక్రెటరేట్‌ ‌తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన  రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి నోటి నుండి పరుష పదాలు దొర్లుతున్న సంఘటనలు లేకపోలేదు.  ఆ తర్వాత తమ పొరపాటును సరిదిద్దుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.  కాని రాహుల్‌గాంధీ విషయంలో ఆలా జరుగలేదు. నిజంగానే ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఉంటే, కేసు ఇంతవరకు వచ్చేది కాదేమో. కేంద్రంలోని అధికార పార్టీ ఆయన వాడిన పదాలను చాలా సీరియస్‌గా తీసుకుంది. వాస్తవంగా చాలా కాలంగా కాంగ్రెస్‌ ‌పైన బిజెపి గుర్రుగానే ఉంది. దానికి తోడు రాహుల్‌ ‌మాటలు అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది.

ఒక ప్రజా ప్రతినిధి వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు రుజువు అయిన పక్షంలో రెండేళ్ళపాటు శిక్ష పడితే, అతడిని తన పదవికి అనర్హుడిగా ప్రకటించవచ్చన్న నిబంధను, అధికార పార్టీ ఏ మాత్రం వెనుక ముందు లేకుండా అమలు పర్చాలనుకోవడం వెనుక  బిజెపి రాజకీయ ఎత్తుగడేనన్నది కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలు పేర్కొంటున్నాయి.  ఇటీవల రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పార్టీకి బలాన్నిచ్చింది. దీన్ని అధికార బిజెపి తట్టుకోలేకపోతోంది. అందుకు కాంగ్రెస్‌ను ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న ఆలోచనతోనే ఆయనపైన ఈ కేసును నమోదు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఆదాని విషయంలో జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తుండగా, ఆ విషయాన్ని పక్కకు పెట్టి, పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని లేవనెత్తుతున్న రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించే ప్రక్రియను చేపట్టిందని కాంగ్రెస్‌ ‌నాయకులు  ఆరోపిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఎక్కడో అక్కడ నోరు జారినంత మాత్రాన అధికార పార్టీ ఆయనను  కొన్ని ఏండ్ల వరకు రాజకీయాలకు దూరం చేయాలనుకోవడం అంత సమంజసం కాదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపైన న్యాయపోరాటానికి కాంగ్రెస్‌ ‌సిద్దపడుతోందికూడా.  ఇందుకుగాను శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌ర్యాలీలో రాహుల్‌గాంధీ నోరుజారినట్లు సూరత్‌ ‌కోర్టులో రుజువవైంది. మోదీ ఇంటిపేరున్న వారందరిని కలిపి నిందిస్తూ ఆయన వ్యాఖ్యానించిన  తీరువల్ల తమకు పరువునష్టమైందంటూ గుజరాత్‌కు చెందిన బిజెపి నేతలు, ప్రత్యేకించి మోదీ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాగా గుజరాత్‌ ఎంఎల్‌ఏ  ‌పూర్ణేష్‌ ‌మోదీ కేసు పెట్టడం ఈ సంచలన తీర్పుకు కారణమైంది. సూరత్‌ ‌కోర్టు  గురువారం తన తీర్పులో రాహుల్‌ను దోషిగా ప్రకటించి, రెండెళ్ళ జైలు శిక్ష,  వెయ్యి రూపాయల జుర్మానా విధించింది. అయితే దీనిపై అప్పీలు చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. అందుకుగాను ముప్పై రోజుల వ్యవధి నిచ్చింది.  అయితే రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన వ్యక్తి  నేరం రుజువు తేదీ నుండి తాను ఎన్నికైన పదవిలో కొనసాగే అర్హత లేదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతాయంటున్నారు న్యాయనిపుణులు. శిక్ష పూర్తి అయిన తర్వాత మరో  ఆరు  సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారన్న నిబంధన ఉంది.  దాని ఆధారంగా లోకసభ సెక్రటేరియెట్‌  ఎం‌పీగా అనర్హుడిగా ప్రకటించింది. దీంతో రాహుల్‌ ‌గాంధీ లోకసభ సభ్యత్వం రద్దు అయినట్లే. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ గొంతు నొక్కేందుకు బిజెపి తీసుకున్న చర్యగా కాంగ్రెస్‌ ‌నేతలు ఆరోపిస్తున్నారు. ఒకే దేశం ఒకే పార్టీ అని చాలాకాలంగా చెబుతున్న బీజేపీ ఈ విధంగా దాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందంటున్నారు. గతంలో లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీసీ ఎంపీ మహ్మద్‌ ‌ఫైజల్‌ ‌పైన కూడా ఇలాంటి అనర్హత వేటు పడినప్పుడు ఆయన పై కోర్టుకు చేసుకున్న అప్పీలుతో తిరిగి ఆయన సభ్యత్వాన్ని పునరుద్దరించడాన్ని గుర్తు చేస్తూ, రాహుల్‌ ‌కూడా న్యాయపర పోరాటం ద్వారా తన అర్హతను తిరిగి పొందే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిమేమైన సూరత్‌కోర్టు తీర్పు రాజకీయ నేతలకు కనువిప్పు కావాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో నేతలు ఇష్టం వచ్చినుట్లు మాట్లాడుతున్నారని, కనీస సభ్యతను, సంస్కారాన్ని మరిచి ఛాలెంజీలు చేస్తున్నారని, అలాంటివారికి ఈ తీర్పు చెంపపెట్టులా ఉంటుందంటున్నారు. అయితే దోషులు తప్పకుండా శిక్షించబడాలిగాని, మరీ రాహుల్‌కు వేసినంతగా అనర్హత వేటు వేయడం ద్వారా ఒక మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకు చట్టంలో కొంత వెసులుబాటును తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

Leave a Reply