Take a fresh look at your lifestyle.

ఫలితాలకు ఆవల అంకగణితం

“ఈసారి కాషాయ పెద్దలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి జేడీయూతో కూటమిలో ఉంటూనే నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించటంలో విజయం సాధించారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగుతున్న నితీష్‌ ‌పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఆర్‌.‌జె.డి. వైపు మళ్ళకుండా తమ వైపు టర్న్ ‌చేయించగలిగింది బీజేపీ. జేడీయూ సీట్ల సంఖ్య తగ్గటంలో లోక్‌ ‌జన శక్తి పార్టీ అధినేత చిరాగ్‌ ‌పశ్వాన్‌ ‌కూడా ఉడతా సహాయం చేశారు. మీ లక్ష్యం గెలవటమా? జేడీయూని ఓడించటమా అని నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒక లక్ష్యాన్ని చేరుకున్నాను. మరో లక్ష్యాన్ని 2025లో చేరుకుంటాను అన్నారు చిరాగ్‌. ఆయన మాటలను బట్టి ఎల్‌.‌జె.పి..ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం తేటతెల్లం.”

బీహార్‌ ఎన్నికల ఫలితాలు తల పండిన రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగించాయి. మహాగట్బంధన్‌ ‌కు, ఎన్డీయే కూటమి కి మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేసినా అధికార మార్పిడి జరుగుతుందని బలంగా నమ్మారు. కాని బీహార్‌ ఓటరు ఎన్డీయే కూటమికే మరో సారి పగ్గాలు అప్పగించాడు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు? రాజకీయ అంకగణితం ఏంటి? ఈ చర్చ ఆసక్తికరంగా మారింది.

వికసించిన కమలం:
బీహార్‌ ఎన్నికల రణ క్షేత్రంలో ఎక్కువగా లాభ పడింది, మెరుగైన ఫలితాలను రాబట్టగలిగిన పార్టీల్లో కమలం మొదటి స్థానంలో నిలబడింది. 2015 ఎన్నికల్లో లోక్‌ ‌జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్‌ ‌సమత పార్టీ, హందుస్తానీ అవామ్‌ ‌మోర్చా వంటి చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి సోంతంగా 53 స్థానాలు, మిగిలిన మిత్రులకు ఐదు అంటే ఎన్డీయే కూటమి మోత్తం 58 స్థానాలతో ప్రతిపక్ష స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది. అటువంటి స్థితి నుంచి ఈసారి ఏకంగా సోంతంగా 73 స్థానాలకు తన గ్రాఫ్‌ ‌పెంచుకోగలిగింది. అయితే 2017లో మహాకూటమి నుంచి జేడీయూని బయటకు రప్పించి…తను జతకట్టి అధికార పీఠం ఎక్కింది. ఇదొక రాజకీయ ఎత్తుగడ. ఈసారి కాషాయ పెద్దలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి జేడీయూతో కూటమిలో ఉంటూనే నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించటంలో విజయం సాధించారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగుతున్న నితీష్‌ ‌పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఆర్‌.‌జె.డి. వైపు మళ్ళకుండా తమ వైపు టర్న్ ‌చేయించగలిగింది బీజేపీ. జేడీయూ సీట్ల సంఖ్య తగ్గటంలో లోక్‌ ‌జన శక్తి పార్టీ అధినేత చిరాగ్‌ ‌పశ్వాన్‌ ‌కూడా ఉడతా సహాయం చేశారు. మీ లక్ష్యం గెలవటమా? జేడీయూని ఓడించటమా అని నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఒక లక్ష్యాన్ని చేరుకున్నాను. మరో లక్ష్యాన్ని 2025లో చేరుకుంటాను అన్నారు చిరాగ్‌. ఆయన మాటలను బట్టి ఎల్‌.‌జె.పి..ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం తేటతెల్లం. బీజేపీ గెలుపు వెనుక పటిష్టమైన ఎత్తుగడలు ఉన్నాయి. మరోవైపు జేడీయూ గెలుపులో ఓటమి ఉంది. అయినా కూటమి అనే షిల్డ్ ‌లో ఉండటం వల్ల మరో సారి సీఎం కుర్చీ నితీష్‌ ‌సొంతం కానుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.

అడుగు దూరంలో ఆర్జేడీ:
బీహార్‌ ఎన్నికల క్షేత్రంలో అదృష్టానికి అడుగు దూరంలో ఆగిపోయింది ఆర్జేడీ. అతి పిన్న వయస్సు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు అనుకున్న తేజస్వీ యాదవ్‌ ‌ను బీహారీలు మరోసారి ప్రతిపక్ష నాయకుడి పాత్రకే పరిమితం చేశారు. రాష్ట్రీయ జనతా దళ్‌ ‌నేతృత్వంలోని మహాగట్బంధన్‌ ఓటమి వెనుక కూడా అనేక సమీకరణాలు బలంగా పని చేశాయి. మొదటిది కాంగ్రెస్‌ ‌కు స్థాయికి మించి సీట్లు కేటాయించటం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ ‌కు 41 సీట్లు కేటాయిస్తే 27 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుత వాస్తవ, క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసుకోకుండా బహుశా గత ఫలితాలు చూసుకుని హస్తం హైకమాండ్‌ 70 ‌సీట్లకు డిమాండ్‌ ‌చేసిందేమో. సాధారణంగా వ్యక్తిగతంగా బలహీనంగా ఉన్నా…ఏదైన ఊతం దొరికినప్పుడు కొన్ని పార్టీలు బలాన్ని పుంజుకుంటాయి. కాని కాంగ్రెస్‌ ఈ ‌స్థితి కంటే పూర్తిగా దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. దేశ రాజకీయ వేదిక పై కాంగ్రెస్‌ ‌ను చిల్లులు పడిన నావతో పోల్చాల్సి ఉంటుందేమో. స్వయంగా మునుగుతుంది, కలిసి ప్రయాణానికి సిద్ధపడితే వారిని కూడా ముంచుతున్న అనుభవాలు ఆ పార్టీకి ఉన్నాయి. బీహార్‌ ‌లో ఆర్జేడీకి ఇప్పుడు ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది.

రెండో కారణం, వెంటాడుతున్న తండ్రి వారసత్వం. పార్టీ చేసిన పాత తప్పులకు క్షమించండి కొత్త ప్రయాణం మొదలు పెడదాం అని రెండేళ్ళ కిందట బీహార్‌ ‌మాజీ ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌చివరాఖరి తొమ్మిదవ తనయుడు తేజస్వీ యాదవ్‌ ‌బీహార్‌ ‌ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయినా ఒక వర్గ ఓటర్లు పాత పకాలు మరిచిపోలేదు. ప్రత్యర్ధి పార్టీలు మరిచిపోనివ్వలేదు. ఇక మూడో అంశం దెబ్బ తీసిన ఎమ్‌ఐఎమ్‌. ‌తూర్పు బీహార్‌ ‌లోని సీమాంచల్‌ ‌ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. చాలా నియోజకవర్గాల్లో ఫలితాలను నిర్ణయించగలిగే స్థాయిలో ముస్లిం ఓట్‌ ‌బ్యాంక్‌ ఉం‌ది. కిషన్‌ ‌గంజ్‌, ఆమోర్‌, ‌బహదూర్‌ ‌గంజ్‌, ‌బైసి వంటి సెగ్మెంట్లలో 50 శాతానికి మించిన ఓట్లు ముస్లిం మైనార్టీ వర్గాలవే. మొత్తం 20 స్థానాల్లో బరిలో నిలబడిన ఎమ్‌ఐఎమ్‌ ఏకంగా ఐదు చోట్ల జెండా ఎగరేసింది. వీటి ఫలితాలను నిశితంగా గమనిస్తే జోకిహత్‌ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఆర్జేడీ అభ్యర్ధి ఎమ్‌ఐఎమ్‌ ‌మెజార్టీని సుమారు ఏడువేలకు పరిమితం చేయగలిగారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్ధులే ప్రత్యర్ధులుగా ఉన్నారు. ఈ నాలుగు చోట్ల ఎమ్‌ఐఎమ్‌ 15 ‌వేల నుంచి 52 వేలకు పైగా మెజార్టీని నమోదు చేసింది. ఆర్జేడీకి ముందు నుంచి యాదవ, ముస్లిం మైనార్టీ ఈక్వేషన్‌ అం‌డగా నిలబడుతుంది. ఎమ్‌ఐఎమ్‌ ‌ఖాతాలో పడిన 5 స్థానాలే కాకుండా కనీసం మరో 5, 6 స్థానాల్లో ముస్లిం ఓట్‌ ‌బ్యాంకును విభజించటం ద్వారా ఆర్జేడీ గెలుపు అవకాశాలకు ఒవైసీ దెబ్బతీశారు. ఇక తేజస్వీ రాజకీయ అనుభవ రాహిత్యం కూడా ఆ పార్టీ ఫలితాలను దెబ్బతీయటంలో కొంత పాత్ర పోషించింది. మహాగట్బంధన్‌ ‌లో భాగస్వామ్య పక్షం వికాస్‌ ‌శీల్‌ ఇన్సాన్‌ ‌పార్టీకి టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో విఫలమయ్యారు తేజస్వీ. దీనితో ఆ పార్టీ అధ్యక్షుడు ముకేష్‌ ‌సహాని వెంటనే ఎన్డీయే కూటమితో చేతులు కలిపారు. దీని వల్ల నిషాద్‌ ‌సామాజిక వర్గం దూరం ఆర్జేడీకి అయ్యింది. తాజా ఫలితాల్లో ఈ పార్టీ నాలుగు స్థానాల్లో సత్తా చాటింది. అంటే కనీసం మరో 10 నుంచి 15 స్థానాల్లో ఎన్డీయే గెలుపులో వీరి పాత్ర ఉండి ఉంటుంది.

అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ఈ ఎన్నికల్లో అసలైన విజేత తేజస్వీ యాదవ్‌ అనే వాదన బీహార్‌ ‌రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దేశ ప్రధాని మోడి, అపర రాజకీయ చాణుక్యుడు అమిత్‌ ‌షా, ఇటు నితీష్‌ ‌వంటి రాజకీయ ఉద్దండులందరిని ఒంటి చేత్తో ఎదుర్కోని నిలబడగలిగారు తేజస్వీ. తండ్రి నీడ నుంచి బయటపడి సరిగ్గా ముప్ఫై ఏళ్లు కూడా నిండకుండానే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగలిగారు. ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడటంలో విజయం సాధించారు. నిరుద్యోగం, పేదరికం చుట్టూ బీహార్‌ ఎన్నికల ఎజెండాను సెట్‌ ‌చేయగలిగారు. ఈ విషయంలో బీజేపీకి కూడా తేజస్వీ బాటలోనే నడవక తప్పలేదు. ముఖ్యంగా 24 శాతం ఉన్న యువ ఓటర్లలో అత్యధికులు తేజస్వీకే మొగ్గు చూపారు. వాస్తవంగా తాజా ఫలితాల్లో పార్టీల పరంగా చూస్తే అత్యధిక సీట్లు, ఓట్లు తెచ్చుకున్నది ఆర్జేడీనే. చివరిగా…ఓటములు పాఠాలు నేర్పుతాయి. నేర్చుకుని ముందుకు వెళితే విజయం దానంతట అదే వస్తుంది.

Leave a Reply