Take a fresh look at your lifestyle.

ఓడినా బలమైన శక్తిగా ఎదిగిన ఆర్ జేడీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ డిఏ విజయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్ల జనాకర్షణగా కమలనాథులు పొంగిపోతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే, తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని ప్రకటించారు. బెంగాల్ లో కొద్ది రోజుల క్రితం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన సభలకు పెద్దగా ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ ( కాంగ్రెస్ లేని భారత దేశం) లక్ష్యం కోసం పని చేస్తామని ఆయన బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించినప్పుడు ప్రకటించారు. ఆ లక్ష్య సాధనలో ఆయన కొంతవరకూ విజయం సాధించిన మాట నిజమే. కానీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఆయన చేస్తున్న కృషి ఇంకా ఫలించలేదు. బీహార్ లో ఈసారి జనతాదళ్ (యు) కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో ఆయన ఆ వ్యాఖ్య చేసి ఉంటారు. నిజానికి జనతాదళ్ యూ సీట్లు తగ్గడంలో బీజేపీ నాయకుల ప్రతిభ ఏమీ లేదు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్ డిఏలో కొత్త తరానికి ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల జనతాదళ్ యూ దెబ్బతింది. ఈ కూటమి నుంచి బయటకు వచ్చిన రామవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. నితీశ్ కుమార్ అనుసరిస్తున్న విధానాల వల్లే తాను కూటమి నుంచి బయటికి వొచ్చి లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) తరఫున వందపైగా స్థానాలకు అభ్యర్దులను నిలబెట్టారు. ఎల్ జేపీ బరిలో ఉండటం వల్ల రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జేడీ) నేతృత్వంలోని మహాఘటబంధన్ భాగస్వామ్య పక్షాలకు సంప్రదాయకంగా పడే సెక్యులర్ వోట్లకు గండి పడింది. ఈ కూటమి అభ్యర్ధులు చాలా నియోజకవర్గాల్లో వెయ్యి,ఐదొందల వోట్ల తేడాతో ఓడిపోయారు.

నిజానికి ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేసినప్పటికీ, గత ఎన్నికల్లో మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేదు. పైగా, నితీశ్ కుమార్ నాయకత్వం పట్ల బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఎవరూ పైకి తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు.అలాగే,ఈసారి జనతాదళ్ (యూ) కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది. మరో వంక ఆర్ జేడీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ కుమారుడు అయిన తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల్లో ఇద్దరు అతిరథులను ఎదుర్కొని ప్రతిపక్ష కూటమికి అధికార కూటమికి చాలా దగ్గరగా వొచ్చేట్టు గట్టి పోటీ ఇచ్చారు. ఆర్ జేడీ ఓడినా బలమైన శక్తిగా ఎదిగింది. కాంగ్రెస్ గెలవాల్సిన సీట్లు గెలవకపోవడం వల్లనే ఆర్ జేడీ కూటమి అధికారానికి దూరం అయింది. రాహుల్ గాంధీ ప్ర భావం ఏమాత్రం కనిపించలేదు. రాష్ట్ర నాయకుల్లో జనాకర్షణ కలిగిన వారెవరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ జేడీ కూటమిని తేజస్వి యాదవ్ అన్నీ తానై ఏకతాటిపై నడిపించారు. ఆయన మాటల్లోనే ఇద్దరు మహా రథులను 31 ఏళ్ళ యువకుడు ఢీకొనడం సామాన్యమైన విషయం కాదు. ప్రధానమంత్రి మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో దశాబ్దాల క్రితం నాటి అవినీతి ఆరోపణలనే పదే పదే చేశారు తప్ప , కేంద్రంలో తన నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన చేస్తున్న మంచి పనుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. లాలూ పాలనను గతంలో మీడియా జంగల్ రాజ్ అని అభివర్ణించేది.ఆ పదాన్నే అస్త్రంగా చేసుకుని మోడీ ప్రచారం సాగించారు.

పెద్ద కరెన్సీ రద్దు, జిఎస్ టి నిర్ణయాల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలు పడుతున్న పాట్లపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకూ,విమర్శలకూ ఆయన ప్రసంగాల్లో ఎక్కడా సమాధానం లేదు. నిజానికి వాటి వల్లే దేశం పురోగమనంలో ఉందంటూ అతిశయోక్తి మాటలతో జనాన్ని ఆకట్టుకోవాలని చూశారు. బీహార్ లో బీజేపీ కన్నా ఆర్ జెడీ కి మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి. బీజేపీ కూటమిలో జనతాదళ్ యూ కి గతంలో కన్నా సీట్లు తగ్గినప్పటికీ, 43 సీట్లు రావడం వల్ల అధికార కూటమి బలం 125కి పెరిగింది.అదే సందర్భంలో ఆర్ జేడీకి 77 సీట్లు వొచ్చినప్పటికీ కాంగ్రెస్ 19 సీట్లకే పరిమితం కావడం వల్ల దాని ప్రభావం ఆర్ జేడీ కూటమిపై పడింది. అంతేకాకుండా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ బరిలో ఉండటం వల్ల ఆర్ జేడీకి సంప్రదాయకంగా ఎప్పుడూ పడే మైనారిటీల వోట్లు మజ్లిస్ కి పడ్డాయి. పాశ్వాన్ పార్టీ ఎల్ జేపీ దళితులు, వెనుకబడిన వర్గాల వోట్లకు గండి కొట్టింది.

ఈ నేపధ్యంలో ఆర్ జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎంత కష్టపడినా విజయానికి దగ్గరగా వచ్చారు కానీ, విజయాన్ని సాధించలేకపోయారు. ఎన్నికల ముందు జరిగిన సర్వేల్లో ఆయన పార్టీయే విజయం సాధిస్తుందన్న ఫలితాలు వెలువడ్డాయి. ఈ గణాంకాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే బీజేపీ సొంతంగా సాధించిన విజయం పరిమితమేనని స్పష్టం అవుతోంది. చిన్న పార్టీలను కలుపుకుని ఎన్ డిఏ 125 సీట్ల మార్క్ కి చేరింది. అందువల్ల కమలనాథులు చెప్పుకుంటున్నట్టు ఇదేమీ బీజేపీ విజయమూ కాదు, మోడీ విజయమూ కాదు. నిజానికి కొరోనా లాక్ డౌన్ కాలంలో సామాన్య, మధ్యతరగతి వర్గాలు అనుభవించిన కష్టాలను పరిగణనలోకి తీసుకుంటే ఆర్ జేడీ ఘనవిజయం సాధించి ఉండాల్సింది. నితీశ్ కుమార్ ప్రభుత్వ యంత్రాంగం అంతా జేడీయూ- బీజేపీ విజయానికి కృషి చేసింది. అన్ని చోట్లా సహజంగా ఉండేదే అది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్ జేడీ ఓటమి నిజానికి ఓటమి కాదు. పోరాడి ఓడింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న తేజస్వి న్యాయపోరాటం చేసేందుకు సిద్ద పడుతున్నారు.అదే సందర్భంలో చిన్న పార్టీల నాయకులను సమీకరిస్తున్నారు. అందువల్ల నితీశ్ అధికారాన్ని చేపట్టినా గతంలో మాదిరిగా సజావుగా పరిపాలన సాగించే అవకాశాలు కనిపించడం లేదు. పైగా, బీజేపీ సంఖ్యాబలం కారణంగా తన అజెండా అమలు కోసం ఒత్తిడి తేవచ్చు. అప్పుడు నితీశ్ కుమార్ సర్దుకుని పోతారా లేక బయటకు వొస్తారా అనేది తేలుతుంది.

Leave a Reply