Take a fresh look at your lifestyle.

ప్రకృతి విలయాలకు విరుగుడేది

(అక్టోబర్‌13, ‌ప్రకృతి విపత్తుల  నివారణ దినోత్సవం)

ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నిలువరించడం మన చేతుల్లో లేదు. మానవ తప్పిదాలవలన ఏర్పడుతున్న వైపరీత్యాలకు విరుగుడు మాత్రం మనచేతుల్లోనే ఉంది. నష్టనివారణా చర్యల వలన,ముందుజాగ్రత్తల వలన  వైపరీత్యాల వలన కలిగే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలము.ఐక్యరాజ్య సమితి సర్వసభ్యసమావేశం విపత్తులను ఎదుర్కోవడంలోను,విపత్తుల వలన జరిగే ప్రాణనష్టాన్ని,ఆస్తి నష్టాన్ని తగ్గించాలనే ధ్యేయంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి  ప్రతీ ఏటా అక్టోబర్‌ 13 ‌వ తేదీని ‘‘ఇంటర్నేషనల్‌ ‌డిజాస్టర్‌ ‌రిస్క్ ‌రిడక్షన్‌ ‌డే’’ గా జరుపుకోవాలని తీర్మానించింది.

790 కోట్ల మంది ప్రపంచ ప్రజల భవిష్యత్తు పర్యావరణం మీద ఆధార పడి ఉండడం వలన పర్యావరణం విషయంలో మనం మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి. పర్యావరణాన్ని కాలుష్యకారకాలనుండి, మానవ సంకల్పిత అవాంఛనీయ చర్యల నుండి కాపాడుకోవాలి. జీవవైవిధ్య పరిరక్షణ మన తక్షణ కర్తవ్యం. ప్రకృతి లోని ఇతర  జీవరాశులను మన స్వార్ధం కోసం బలిచేయకుండా వాటిని కూడా సంరక్షించినప్పుడే ఈ ధరిత్రి పై మానవజాతి పదికాలాల పాటు సురక్షితంగా కాపాడబడుతుంది. పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థుల్లో సరైన అవగాహన కల్పించాలి. పర్యావరణానికి, జీవరాశులకు మధ్య ఉన్న  అవినాభావ సంబంధం గురించి మనం ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.

పర్యావరణాన్ని సంరక్షించినంత కాలం మానవమనుగడకు ప్రమాదం లేదు.అయితే పర్యావరణాన్ని విధ్వంసం చేసే ప్రస్తుత మానవ చర్యలు ఇలాగే కొనసాగితే  భూగ్రహమే నిర్జీవంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు  ప్రపంచమంతా ఏకత్రాటిపై నిలబడాలి. ప్రకృతితో మమేకమైన నదీనదాలను,ఇతర జీవరాశులను, వృక్షసంపద ను కాపాడుకోవడం లోనే మానవమనుగడ ఆధారపడిఉంది. కాలుష్య కారకాలను అరికట్టడం, పచ్చదనాన్ని పెంచడం, ఇతర జీవరాశుల మనుగడకు చోటివ్వడం వంటి అంశాలపైనే పర్యావరణ పరిరక్షణ ఆధారపడి ఉంది. ఈ లక్ష్యాలను విస్మరించినప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారక తప్పదు. ప్రకృతి లో సంభవిస్తున్న వివిధ రకాల వైపరీత్యాలపై ప్రజల్లో అవగాహన పెపొందించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే విపత్తుల వలన సంభవిస్తున్న తీవ్రతను తగ్గించగలం.

సుంకవల్లి సత్తిరాజు.మొబైల్‌:9704903463

Leave a Reply