Take a fresh look at your lifestyle.

దుబ్బాక’ ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠ

‌ఏపీ నుంచీ ఆరా…
గెలుపుపై ఎవరికి వారు ధీమా..
మేమే గెలుస్తామంటున్న బిజెపి
కంచుకోటలో గెలుపు మాదికాక మరెవరిదంటూ గులాబీల ధీమా
మెరుగైన ఫలితం సాధిస్తామన్న అంచనాలో కాంగ్రెస్‌
ఎవరి లెక్కలు వారివే…వోటర్ల నిర్ణయం ఏమిటో 

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ ఈ ‌నెల 3న ముగిసినప్పటికీ…ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే, వోటర్లు ఎవరికి వేశారో మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. భారీగా పెరిగిన(82శాతంకు పైగా)వోటింగ్‌ ‌శాతం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కలిసి వొస్తుందా? ప్రతిపక్ష పార్టీకి కలిసి వొస్తుందా? అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే  అధిక శాతం వోటింగ్‌ ‌నమోదైతే…ఒక్కోసారి ప్రభుత్వానికి అనుకూలంగా కూడా వోటింగ్‌ ‌శాతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో వోటర్లు ఎవరికి షాక్‌ ఇస్తారో తెలియక లోలోపల అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు ఒకింత టెన్షన్‌కు గురౌతున్నారనీ విశ్వసనీయ సమాచారం.  రెండు సంస్థల ఎగ్జిట్‌ ‌పోల్స్‌లో  మాత్రం మిశ్రమ ఫలితాలు వొచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికలపై ఆంధప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రీసెర్చ్ అం‌డ్‌ అనాలిసిస్‌ ‌బై పబ్లిక్‌ ‌పల్స్ అనే సంస్థ తన సర్వే రిపోర్టును వెలువరించింది. ఇందులో అధికార టిఆర్‌ఎస్‌కు బిజెపి షాక్‌ ఇవ్వడం ఖాయమని ప్రచురించింది. దుబ్బాకలో టిఆర్‌ఎస్‌కు 42.5 శాతం వోట్లు వొస్తే..బిజెపికి 45.2 శాతం వొస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌కు 11.7 శాతం వోట్లు రావొచ్చని అంచనా వేసింది. బిజెపి గెలుస్తుందని..అయితే వోట్ల తేడా 4 వేల నుంచి 6 వేల మధ్య ఉండనుందని పేర్కొంది. థర్డ్ ‌విజన్‌ అనే సంస్థ మాత్రం దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌విజయం ఖాయమని చెప్పింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ ఎలా ఉన్నా..కౌంటింగ్‌ ‌పక్రియ ముగిస్తేనే విజేత ఎవరనేది తేలుతుంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలూ గెలుపు మాదే అంటే మాదే అంటూ దుబ్బాక శాసనసభా నియోజకవర్గ ఉప ఎన్నిక పలితాన్ని ఉత్కంఠ భరితంగా మార్చేశాయి. గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక పక్రియలో ఈ నెల 3న పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న వోట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్‌ ‌సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్‌ ‌స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టిఆర్‌ఎస్‌ ‌శిబిరంలో కనిపిస్తుండగా బిజెపి, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌ ‌సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్‌ ‌నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టిఆర్‌ఎస్‌తో పాటు బిజెపి  పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్‌ ‌మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టిఆర్‌ఎస్‌ ‌ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్‌ ‌నుంచి టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బిజెపి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు.

కంచుకోటలో గెలుపు మాదికాక మరెవరిదంటూ టిఆర్‌ఎస్‌  ‌ధీమా
టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2009 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు వోటింగ్‌ ‌రూపంలో కలిసి వొచ్చాయని టిఆర్‌ఎస్‌ ‌శిబిరం అంచనా వేస్తోంది. లక్ష వోట్ల మెజారిటీయే లక్ష్యంగా మంత్రి హరీష్‌రావు  ప్రకటించినా ప్రచారం సందర్భంగా బిజెపి నుంచి టిఆర్‌ఎస్‌ ‌కొంత గట్టి పోటీ ఎదుర్కొందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండగా మంత్రి హరీష్‌రావు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా వోటు వేశాయని టిఆర్‌ఎస్‌ ‌లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్‌, ‌బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వొచ్చిందని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బిజెపి చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టిఆర్‌ఎస్‌ ‌విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వొచ్చింది.

రెండో స్థానం కాదు.. అగ్రస్థానం గ్యారంటీ అంటున్న బిజెపి
ఉప ఎన్నికల్లో కొట్టొచ్చిన అంశం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ని తోసిరాజంటూ బిజెపి ప్రచారంలో ముందంజలో ఉండటమే. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ‌వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. చాలా గ్రామాల్లో కనీస స్థాయిలో కేడర్‌ ‌కూడా లేని బిజెపి ప్రచారపర్వంలో మెరుగైనట్లు లెక్కలు వేసుకుంటోంది. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బిజెపి…ప్రచారపర్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. ఎమ్మెల్యేగా గతంలో రెండు పర్యాయాలు వోటమి చవిచూసిన రఘునందన్‌… ఈసారి వోటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్, ‌సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బిజెపి నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బిజెపి…మంగళవారం జరిగిన పోలింగ్‌ ‌సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది.

మెరుగైన ఫలితాన్ని సాధిస్తామన్న ధీమాలో కాంగ్రెస్‌..
‌దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వొస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్‌ అం‌చనా వేస్తోంది. టిపిసిసి  చీఫ్‌ ఉత్తమ్‌ ‌సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వొస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టిఆర్‌ఎస్‌కు ఉండే అనుకూలత, బిజెపి దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టిఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బిజెపి మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్‌ ‌కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ వోటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్‌ ‌రోజున ఏకంగా పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతున్నారంటూ సోషల్‌ ‌మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యామన్న ధీమా కాంగ్రెస్‌ ‌నేతల్లో కనిపిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా గెలుపుపై అమిత విశ్వాసం అటు అధికార పార్టీలోనూ, ఇటు ప్రతిపక్షాల్లోనూ వ్యక్తమవుతున్న దుబ్బాక ఉప ఎన్నికలో అంతిమ విజేత ఎవరు అనేది తేలడానికి ఈ నెల 10వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఈ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం నుంచి ఆరా తీస్తున్నారు. గెలుపెవరిది అనే దానిపై తెలుసుకోవడానికి రాజకీయ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ పరిచయం ఉన్న స్నేహితులు, నేతలతో ఏపి నేతలు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ ఎవరు గెలుస్తారంటూ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం చూస్తుంటే దుబ్బాక ఉప ఎన్నిక ఎంత ఉత్కంఠను రేపుతున్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Leave a Reply