Take a fresh look at your lifestyle.

మరణంలోనూ శాంతి లేదు

నికృష్ట స్థితిలో అంత్యక్రియలు

– శామ్‌ ‌సుందర్‌
‌చరిత్రలో అత్యంత విషాద ఘట్టంలో మనమున్నాం. మరణించే సమయంలో కూడా విషాదానికి అంతులేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో  కొరోనా రెండవ దశ పేరిట ముంబాయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో  వారాంతపు  లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడం అనివార్యం అవుతోంది. కొరోనాని జయించామంటూ మన నాయకులు గంభీరోపన్యాసాలు ఇచ్చారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌పేరిట జనంలో విశ్వాసాన్ని పెంచేందుకు చాలా విన్యాసాలు చేశారు.  కొరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభించింది. కొరోనా వ్యాప్తికి అనేక కారణాలను చెబుతున్నారు. ఎవరి కారణాలు వారివి. ఏమైనా బాధపడుతున్నది మాత్రం ప్రజలు. కొరోనా ఎంత విజృంభిస్తున్నా రాజకీయ నాయకులకు కావలసిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఎన్నికలు ఎటువంటి అవరోధం లేకుండా పూర్తి అవుతున్నాయి. ఎన్నికల ర్యాలీలు,  రోడ్‌ ‌షోలు, బహిరంగ సభలు యథావిధిగా జరుగుతున్నాయి.  సమూహాలు చేరకూడదని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా, ర్యాలీల్లో జనం గుమిగూడటం అనివార్యం అవుతోంది. నాయకులు తమ వ్యక్తిగత రాజకీయ అజెండాను ఎక్కడా పొల్లుపోకుండా అమలు జేసేస్తునారు. మరో వంక మీడియాలో మాత్రం కొరోనా బీభత్స దృశ్యాలు కళ్ళకు కడుతున్నాయి.  హాస్పిటల్స్‌లో బెడ్స్ ‌కొరత అసాధారణ స్థాయిలో ఉంది. వరండాల్లో, వెనుక వైపు ఖాలీ  ప్రదేశాల్లో ఎక్కడ బడితే అక్కడ వ్యాధిగ్రస్తులను  పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. వారి పక్కనే శవాల గుట్టలు పేరుస్తున్నారు. చనిపోయిన వారికి  సాధారణంగా నిర్వహించే  కర్మకాండలు, అంతిమ సంస్కారాల కార్యక్రమాలు జరగడం లేదు.  గుజరాత్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌, ‌దిల్లీలలో  శవాగారాలు నిండిపోయాయి. కొరోనా మొదటి దశలో కూడా ఇంతటి  భయానక దృశ్యాలు కానరాలేదు.  కొరోనా వేరియంట్‌ ‌వ్యాపించడం  వల్ల సరికొత్త  వైరస్‌ ‌వ్యాపిస్తోందన్న భయం జనాన్ని వెంటాడుతోంది. మరో వంక కొరోనాపై యుద్ధం చేస్తున్నామనీ,ఆ యుద్ధంలో విజయం మనదేనని పాలకులు  ధైర్యవచనాలు చెబుతున్నారు. అయితే, మన నాయకత్వం విఫలమైందని  నిందించి ప్రయోజనం లేదు.స్మశానాల్లో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం మృత దేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.  మృత దేహాలను వారివారి మత ధర్మాలను బట్టి దహనం చేయడమో, ఖననం చేయడమో చేయాలి. సుప్రీమ్‌ ‌కోర్టు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.  కానీ, మనం చూస్తున్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.  మరణం లోనూ శాంతి లేదన్న వేదాంత వాక్యం కట్టెదుట కనిపిస్తోంది. ఎవరికి ఎవరు సొంతము అన్న పాత సినిమా పాట గుర్తుకు వొచ్చే రీతిలో   కొరోనా మృతుల అంతిమ యాత్రలు,అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. దహనాలు, ఖననాలు మానవ హక్కులకు  భిన్నంగా జరుగుతున్నాయి.ఈ విషయాన్ని స్మశాన సిబ్బంది అంగీకరిస్తున్నారు. వేరే మార్గం లేక   మృత దేహాల అంతిమ సంస్కారాలు  అలా జరిపించాల్సి వస్తోందని ఒక స్మశాన వాటికలో పని చేసే వ్యక్తి చెప్పారు. మృతులకు అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, సంప్రదాయానికి అనుగుణంగా జరగాలి. వారి హక్కులకు భంగం కలగకూడదు. కానీ,ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు.  హుందాగా వీడ్కోలు పలికే పరిస్థితులు లేవు.  ప్రభుత్వమూ, మన సమాజమూ ఆలోచించాల్సిన విషయాలు ఇవి.  మరణం లో అత్యంత దుర్భర పరిస్థితి అంటే ఇదేనేమో. మరణం అనివార్యం ..కానీ ఇలాంటి నికృష్టమైన పరిస్థితుల్లో మరణించాలని   ఎవరూ కోరుకోరు ..!

Leave a Reply