Take a fresh look at your lifestyle.

కరోనాను తరిమేస్తాం

  • ప్రజలు ఆందోళన చెందవద్దు
  • వైద్యానికి ప్రత్యేక ఆసుపత్రి
  • 24 గంటలు అందుబాటులో కాల్‌ ‌సెంటర్‌
  • అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
  • 9 శాఖలతో సమన్వయం ..
  • ప్రతీ శాఖకు ప్రత్యేక నోడల్‌ అధికారి
  •  కరోనా నియంత్రణపై  ప్రత్యేక కార్యాచరణ
  • మంత్రులు కేటీఆర్‌, ఈటల  సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌ 19 ‌నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనాపై సీఏం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. కొవిడ్‌ 19 ‌వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదనీ, గత వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌ ‌బారిన పడిన వారిలో మరణించిన వారి శాతం తక్కువేనని పేర్కొంది. వ్యాధి లక్షణాలు ఉన్న వారి కోసం ప్రత్యేకకంగా 24 గంటల పాటు అండుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎవరైనా వ్యాపార ప్రయోజనాల కోసం కొవిడ్‌ 19‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ‌కేసు నమోదైన నేపథ్యంలో కరోనా వైరస్‌ ‌నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఇక్కడి డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ‌పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆయా శాఖల విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కలిగించడం సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ ‌గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదన్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్‌హ్యాండ్‌ ఇవ్వవద్దనీ అత్యంత ఆప్తులు కలసినా నమస్కారమే చేయాలని స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఇతర దేశాల్లో అవలంబిస్తున్న జాగ్రత్త చర్యలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గే వరకూ రాస్ట్ర ప్రజలు విదేశీ ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలనీ, మాస్కులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌మరణాలు సంభవించలేదని తెలిపారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యల కోసం సీఎం కేసీఆర్‌ ‌రూ. 100 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. కరోనా వచ్చిన వ్యక్తిని 88 మంది కలసినట్లు సమాచారం ఉందనీ, వారిలో 45 మందికి గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. మనిషి మాట్లాడినప్పుడు తుంపిర్ల ద్వారా మాత్రమే సోకే అవకాశం ఉందనీ, కరోనా సోకకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా కోసం చెస్ట్ ‌హాస్పిటల్‌, ‌మిలటరీ హాస్పిటల్‌, ‌ఫీవర్‌ ‌హాస్పిటల్‌, ‌గాంధీ హాస్పిటల్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

 

Leave a Reply