Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో… 230 వోట్లున్న మమ్మల్ని చూసి టిఆర్‌ఎస్‌ ‌భయపడుతుంది…

  • అందుకే సిఈవోకు ఫిర్యాదు చేసింది
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌బెదిరిస్తే ఎన్నికల కమిషన్‌ ఏం ‌చేసింది?
  • టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి సూటి ప్రశ్న
  • టిఆర్‌ఎస్‌తో దోస్తానా లేదు… కొట్లాటనే అని వ్యాఖ్య

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 3(‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీని చూసి అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భయపడుతుందనీ, అందుకే సిఈవోకు కాంగ్రెస్‌పై తప్పుడు ఫిర్యాదులు చేసిందని కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ హాలులో మీడియాతో మాట్లాడుతూ…ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి 1027వోట్లు ఉంటే కాంగ్రెస్‌ ‌పార్టీకి కేవలం 233 వోట్లు మాత్రమే ఉన్నాయనీ, ఈ వోట్లను చూసి టిఆర్‌ఎస్‌ ‌భయపడుతుందన్నారు. అత్యధికంగా వోట్లను కలిగిన టిఆర్‌ఎస్‌ ఎం‌దుకు భయపడుతుందో, ఎందుకు సిఈవోను కలిసి తనపై ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌వోటర్లను బెదిరిస్తున్న ఆడియోలు వచ్చాయనీ, ఆ ఆడియోలు తమ వద్ద ఉన్నాయంటూ కొప్పుల ఈశ్వర్‌ ‌మాట్లాడినట్లు ఆడియోలను వినిపించిన జగ్గారెడ్డి…మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గర ఉండి స్థానిక సంస్థల వోటర్లను తీర్థయాత్రలకు పంపుతున్నారన్నారు. ఇవేవీ ఎన్నికల కమిషన్‌కు తప్పుగా కనిపించడం లేదా?అని సూటిగా ప్రశ్నించారు.

వోటర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌బెదిరిస్తే, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు వోటర్లను తీర్థయాత్రలకు పంపుతున్నట్లు ఫోటోలు వెలువడుతుంటే ఎన్నికల కమిషన్‌ ఏం ‌చేసిందన్నారు. ఫిర్యాదులు చేయాలనుకుంటే మేము కూడా చేస్తామన్నారు. అయితే, ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీదే కదా అన్నారు. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌కిషోర్‌(‌పికే)పరిజ్ఞానం లేకుండా రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతున్నాడనీ, కాంగ్రెస్‌ ‌పార్టీకి పికేలు అక్కరే లేదన్నారు. గాంధీభవన్‌కు వొస్తే కాంగ్రెస్‌ ‌పార్టీలో ఎంతమంది పికేలు ఉన్నారో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశాంత్‌ ‌కిషోర్‌లేననీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే ఉంటుందన్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌తో దోస్తానా ఉండదన్నారు. అయితే, ఎవరితో పని చేయాలన్నది కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తుందనీ, ఆమె నిర్ణయమే తమకు ఫైనల్‌ అన్నారు. తెలంగాణలో మాత్రం బిజెపిది ధర్డ్ ‌ప్లేసేనన్నారు. ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్పిటిసిలను జగ్గారెడ్డి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ టిఆర్‌ఎస్‌ ‌నేతలు శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌ ‌సిఈవో శశాంక్‌గోయల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో…జగ్గారెడ్డి పై విధంగా స్పందించారు.

Leave a Reply