Take a fresh look at your lifestyle.

ఎమర్జెన్సీ-6

“ఎమర్జెన్సీలో న్యాయస్థానాలకు పూర్తిగా రిలవెన్స్ – ‌సంబద్ధత – పోయింది. నిజానికి న్యాయస్థానాలు సంబద్ధత కోల్పోవడానికి చాల చరిత్ర ఉంది. 1963లోనే రిజర్వేషన్ల మీద గోల మొదలయింది. 1968లో చాల చోట్ల ఆదివాసుల తిరుగుబాట్లు, శ్రీకాకుళ పోరాటం జరిగాయి. ఈ సామాజిక సంచలనాలతో ఏమీ సంబంధం లేకుండా, వాటి గురించేమీ పట్టకుండా కోర్టులు పనిచేస్తూ వచ్చాయి.దానివల్ల న్యాయస్థానాలు ఒక మోస్తరు పశ్చాత్తాపం పడవలసి వచ్చింది. ఆ పశ్చాత్తాపం నుంచే పబ్లిక్‌ ఇం‌టరెస్ట్ ‌లిటిగేషన్‌ ‌మొదలయింది.”

మొత్తం మీద ఎమర్జెన్సీని అధ్యయనం చేసి దాని నుంచి పాఠాలు తీయడం జరగలేదు. ఎందుకు ఎమర్జెన్సీ వచ్చింది, ఎందుకు మన రాజ్యాంగ, అధికార వ్యవస్థలు క్షీణించి పోయాయి, వీటిని బలోపేతం చేయడం ఎట్లా అనే ఆలోచనే సాగలేదు.అందువల్ల ఏ మెరుగుదల జరగలేదు. రాజ్యాంగ బద్ధపాలన ఎట్లా జరగాలనే ఆలోచన ఎమర్జెన్సీ అనంతరం కూడ రాలేదు. రాజ్యాంగం వెనుక ఏదయినా ఉదాత్త తాత్విక దృక్పథం, ఆచరణాత్మకమైన దృక్పథం ఉన్నదా అని కూడ ఆలోచనలు రాలేదు. అటువంటి రాజ్యాంగబద్ధమైన ఆలోచనలు లేనప్పుడు రథయాత్ర వంటి మతోన్మాద ఆచరణలు సాగుతాయి. ఎందుకంటే రథయాత్ర జరపడానికి రాజ్యాంగం ఆమోదించదు. రాజ్యాంగాన్ని రథయాత్ర ప్రమాణాలతో నిర్వచించడం, వ్యాఖ్యానించడం కుదరదు.

ఎమర్జెన్సీ అత్యాచారాల వల్ల రాజ్యాంగంలోని సంక్షేమ భావనలు కూడా దెబ్బతిని పోయాయి. ఎవరయినా కష్టం చేసుకుని బతకాలి గదా, సంక్షేమం ఎందుకు అని కొందరు మాట్లాడుతుంటారు. పాతకాలంలో సెకండ్‌ ‌క్లాసు కంపార్ట్మెంట్లో సీటు దొరికిన వాడి మాదిరి.ఎమర్జెన్సీ ముగింపుకు వచ్చే సమయానికి, ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే పరిస్థితి ఎలా ఉండిందంటే ఎంత సదుద్దేశ్యమున్నా ఎవరూ న్యాయం చేయలేని, సమాన పంపిణీ న్యాయం చెయ్యలేని స్థితి వచ్చిపడింది. సుప్రీం కోర్టు ముందర ఎమర్జెన్సీ కేసు వచ్చింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భయంలో మునిగిపోయారనుకుంటాను. తమ గౌరవనీయత ఎక్కడ ధ్వంసమైపోతుందో అని వాళ్ళ భయం. నేను ఇక్కడ హైకోర్టులో ఫుల్‌ ‌బెంచి ముందర వాదించేటప్పుడు కూడ రామచంద్రా రెడ్డి గారు ఏం చెప్పినారంటే, వీథిలో ఓ కుర్రవాడిని పోలీసులు కాల్చి చంపారు అని నువ్వు పిటిషన్‌ ‌వేస్తే కూడ అది అనుమతించడానికి వీల్లేదు అని, దాని గురించి మాట్లాడడానికి లేదు అని.

అదే విషయం సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్‌ ‌నిరేన్‌ ‌డే కూడ అన్నాడు. ఎమర్జెన్సీ అయిపోయేంత వరకు మాట్లాడడానికి వీల్లేదు అని. ఒక వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేసినా కూడా దాని గురించి ఎక్కడా ప్రశ్నించడానికి లేదు అని. ఎమర్జెన్సీలో కార్య నిర్వాహక వర్గానికి, అధికార యంత్రాంగానికి అందిన అధికారాలు అంత విస్తృతమైనవి అని. ఆ బెంచిలో జస్టిస్‌ ‌భగవతి కూడా ఉన్నారు.

ఒక జడ్జియేమో డిటెన్యూలను ప్రభుత్వం కన్నతల్లిలా చూసుకుంటున్నది అని రాశాడు.
జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌యేమో నాకీ పాలన మీద వజ్ర సమానమైన ఆశ ఉంది అని రాశారు.

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్‌ ‌హైకోర్టు ఫుల్‌ ‌బెంచ్‌ ఎమర్జెన్సీని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు చదువుతుంటే ఇప్పటికి కూడ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ వాదనలు, ఆ సమర్థనలు ఎట్లా రాశారా అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా శ్రీమతి ఇందిరా గాంధీయే ఒక వైరుధ్యాన్ని ప్రవేశ పెట్టారు. ప్రాథమిక బాధ్యతలు అనే అధికరణాన్ని ఆమె నలభైరెండో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అందులో జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన భావాలను, ఆదర్శాలను గౌరవించడం కూడ ఒక బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. న్యాయమూర్తికీ వర్తిస్తుంది. నాకూ వర్తిస్తుంది. న్యాయమూర్తి బంట్రోతుకూ వర్తిస్తుంది. జాతీయోద్యమం ఏ విలువల కోసం, ఏ పాలనకు వ్యతిరేకంగా చేశామనే విషయం వీళ్ళకు గుర్తుకు వచ్చిందా లేదా కూడ అర్థం కాదు. హక్కుల విశ్లేషణ-అది జాతీయోద్యమంలో భాగంగా అయినా కాకపోయినా, సాధారణ ప్రజాస్వామిక అర్థంలోనయినా-వాటిని కూడ లెక్కలోకి తీసుకోకుండా ఆ తీర్పు రాశారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ, జస్టిస్‌ ‌హెచ్‌ ఆర్‌ ‌ఖన్నా, తన అసమ్మతి ప్రకటిస్తూ భిన్నాభిప్రాయ తీర్పు రాశారు. న్యాయమూర్తి పదవికే రాజీనామా చేశారు.ఆ రకమైన సూత్రబద్ధమైన వైఖరి తీసుకున్నది జస్టిస్‌ ‌ఖన్నా మాత్రమే. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ అటువంటి సూత్రబద్ధ వైఖరి తీసుకున్న మరొక మేధావి ఎవరూ నాకు కనబడలేదు.

‘నాకు ఈ సూత్రబద్ధమైన అవగాహన ఉంది. ఈ అవగాహననను నువు గౌరవించకపోతే, నా భిన్నాభిప్రాయంతో సహా నన్ను సహించలేకపోతే, నేను అధికారిక హోదాను, స్థానాన్ని త్యజిస్తాను’ అని చెప్పే ధైర్యం చేసిన వాళ్ళు చాల తక్కువమంది. మధ్య ప్రదేశ్ లో ఎడిఎం జబల్పూర్లో డిటెన్షన్‌ ‌చట్టాన్ని కొట్టేశారు. దాని మీద అప్పీలు హైకోర్టులో వచ్చింది. మన దగ్గర ఆంధ్ర ప్రదేశ్‌ ‌హైకోర్టు డిటెన్షన్‌ ‌చట్టాన్ని సమర్థించింది. దానిమీద మనమే అప్పీలుకు పోలేదు. కాని అది ప్రిసిడెంట్‌-అనుసరించ దగిన పూర్వ నిర్ణయం – అయింది. సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పును అనుసరించడం మొదలు పెట్టింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌హైకోర్టు తీర్పును మేం ఎత్తి పడుతున్నాము అని సుప్రీం కోర్టు అంది. దాంట్లో జస్టిస్‌ ‌భగవతి కూడ భాగమే. సమర్థిస్తూ ఆయన ఒక పెద్ద తీర్పు రాశారు.

ఆ రోజుల్లో సంజయ్‌ ‌గాంధీ రాజకీయాల్లోకి రాగానే ‘సూర్యోదయ మయింది’ అని న్యాయమూర్తులు ఉత్తరాలు రాశారు. ఆ తర్వాత ఈ న్యాయమూర్తులలో కొందరు పశ్చాత్తాప పడ్డారు. ‘‘మేం తప్పు చేసినాము. ఇంతమంది డిటెన్యూలను నిర్బంధించడం, ఆ నిర్బంధాన్ని ఖరారు చేస్తూ రిట్‌ ‌పిటిషన్లు కొట్టెయ్యడం తప్పు’’ అని మాత్రం ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. బహిరంగ క్షమాపణ చెప్పలేదు.అది ఎవరూ చెప్పలేదు. తీర్పులలో కూడ మేం ఈ మాదిరి తప్పుడు నిర్ధారణలకు వచ్చినాము. మాకు పౌరహక్కుల పట్ల అవగాహన ఈ మాదిరిగా ఉండవలసింది. ఉండలేదు అని తర్వాతి తీర్పులలో రాయవచ్చు గదా. ఎవరూ రాయలేదు. వాళ్ళు జడ్జీలు. అంత పెద్ద మనుషులు తప్పు ఎట్లా చేస్తారు అని అందరూ అంటారు గద.

నేనేమనుకుంటానంటే, ఎవడయినా గానీ ఎంత పెద్దవాడయినా సరే, ఏదయినా తప్పు చేస్తే తర్వాత తప్పని తెలిస్తే బహిరంగంగా క్షమాపణ అడగాలి. తప్పయిందని ఒప్పుకోవాలి. అనవసరంగా సిక్కు మతస్తులను ఊచకోత కోసినందుకు, అనవసరంగా ముస్లిం మతస్తులపై మారణకాండ జరిపినందుకు ఆయా ప్రభుత్వాలు పశ్చాత్తాపం ప్రకటించాలి. ఇప్పుడు ఇంతమంది పౌరహక్కుల కార్యకర్తలను చంపించినందుకు అరవిందరావు క్షమాపణ చెప్పుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు డిజిపి అవుతాడు గదా. ‘మేం ఈ తప్పులు చేశాం. పొరపాటయింది’ అని చెప్పాలి. చెప్పగలిగే ధైర్యం ఉండాలి.అట్లా తప్పు ఒప్పుకోవడం ఈ దేశంలో జరగదు.

1978లో, ఎమర్జెన్సీ తర్వాత, వాళ్ళకు ఏమయిందంటే, ఎంత కాదనుకున్నా కోర్టనేది ప్రజలకు ఎదురుగా, ప్రజల ముందర నిలబడవలసిన వ్యవస్థ గదా. అందువల్ల ఎమర్జెన్సీలో తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నట్టుగా పబ్లిక్‌ ఇం‌టరెస్ట్ ‌లిటిగేషన్‌-‌ప్రజా ప్రయోజన వ్యాజ్యం – అనేదాన్ని మొదలు పెట్టారు.
ఎమర్జెన్సీలో న్యాయస్థానాలకు పూర్తిగా రిలవెన్స్ – ‌సంబద్ధత – పోయింది. నిజానికి న్యాయస్థానాలు సంబద్ధత కోల్పోవడానికి చాల చరిత్ర ఉంది. 1963లోనే రిజర్వేషన్ల మీద గోల మొదలయింది. 1968లో చాల చోట్ల ఆదివాసుల తిరుగుబాట్లు, శ్రీకాకుళ పోరాటం జరిగాయి. ఈ సామాజిక సంచలనాలతో ఏమీ సంబంధం లేకుండా, వాటి గురించేమీ పట్టకుండా కోర్టులు పనిచేస్తూ వచ్చాయి.దానివల్ల న్యాయస్థానాలు ఒక మోస్తరు పశ్చాత్తాపం పడవలసి వచ్చింది. ఆ పశ్చాత్తాపం నుంచే పబ్లిక్‌ ఇం‌టరెస్ట్ ‌లిటిగేషన్‌ ‌మొదలయింది.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply