Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే ఎన్నికల్లో  ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు అధికార బిఆర్‌ఎస్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆలస్యంగానైనా సమర్దవంతమైన అభ్యర్ధులను పోటీలో ని)బెట్టేందుకు ఈ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెక్‌ ‌పెట్టేందుకు బడానాయకులను రంగంలోకి దింపుతున్నాయి. గజ్వేల్‌ ‌లో  ఈటల రాజేందర్‌ను బిజెపి పోటీపెట్టింది. కెసిఆర్‌ ‌పోటీ చేస్తున్న మరోస్థానం కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌పీసీసీ అధ్యక్షుడే పోటీపడనున్నట్లు తెలుస్తున్నది. అలాగే కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా గట్టి పోటీ ఇచ్చేవిధంగా  అభ్యర్ధులను ఆయా పార్టీలు ఎంచుకున్నాయి.

ఇదిలాఉంటే  ఒకపక్కన పొత్తులపై చర్చలు జరుపుతూనే మరో పక్క ఇతర పార్టీలనుండి వొస్తున్న నాయకులను చేర్చుకునే కార్యక్రమాన్ని ఈ పార్టీలు ముమ్మరం చేస్తున్నాయి. బిజెపితో కలిసి పోటీ చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ ‌నేతృత్వంలోని జనసేన సిద్ధమయింది. 2018 ఎన్నికల్లో  పోటీకి వెనుకాడినా ఈసారి తెలంగాణలో తప్పనిసరిగా పోటీచేసేందుకు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఒంటరిగా కాకుండా బిజెపితో కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని మొదటినుండి చెబుతూ వొచ్చిన బిజెపికి అభ్యర్ధుల కొరతనో లేక ఒంటరిగా పోటీకి వెరిచిందో ఏమోగాని జనసేనతో కలిసి పోరాటం చేయాలని నిశ్చయించుకుంది. ఆ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మరో ముఖ్యనేత లక్ష్మణ్‌లు పవన్‌కళ్యాణ్‌తో మంతనాలు జరిపి, దిల్లీ పెద్దల గ్రీన్‌ ‌సిగ్నల్‌తో సీట్లపై చర్చలు మొదలుపెట్టారు.

పవన్‌ ‌కళ్యాణ్‌ 32 ‌స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగినట్లుగా బిజెపి మూడు విడుతల అభ్యర్ధుల జాబితా ప్రకటించి 31 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. అయితే ఆ మిగితా స్థానాలన్నీ  జనసేనకు కేటాయిస్తుందా లేక కొన్ని స్థానాలను ఇస్తుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. స్థానిక బిజెపి నేతలు మాత్రం కేవలం ఎనమిదినుండి పది స్థానాలను మాత్రమే ఆ పార్టీకి కేటాయించాలని పట్టు పడుతున్నారు. ఎన్నికల కమిషన్‌  ‌శుక్రవారం నోటిఫికేషన్‌ ‌జారీ చేయడంతో బిజెపి పెండింగ్‌లో పెట్టిన స్థానాల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఒక పక్క ఎన్నికలు ఇరవై అయిదు రోజులకు చేరుకోగా తాము ప్రచారంలో వెనుకబడిపోతామన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ ‌మరింత సమరోత్సాహంగా ముందుకు పోతున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ ‌లాంటివారు తిరిగి కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకోవడంతో ఇప్పుడాపార్టీకి మరింత బలం చేకూరినట్లైంది. దీనికి తోడు ఆ పార్టీతో  సీట్ల ప్రసక్తి లేకుండా సరాసరి మద్దతిస్తామంటూ తెలంగాణ జనసమితి, వైఎస్‌ఆర్‌టిపి ప్రకటించడం ఇక తమ గెలుపు ఖాయమైనట్లేనంటోంది కాంగ్రెస్‌. ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌నేతృత్వంలోని టిజెఎస్‌ ‌కొన్ని స్థానాల్లో పోటీచేసేందుకు మొదట్లో ఉత్సాహం చూపించినా, ఆఖరుకు  బిఆర్‌ఎస్‌ను ఓడించడమనే లక్ష్యానికి చేరుకోవాలంటే వోట్లు చీలకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌ ‌నేతృత్వంలోని టిజెఎస్‌ ‌మద్దతు తమకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్‌ ‌నేతలంటున్నారు. ఇక వైఎస్‌ ‌షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌టిపి కూడా తాజాగా శుక్రవారం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో పోటీచేస్తామని ప్రచారం చేసిన షర్మిల కాంగ్రెస్‌తో కలిసి సీట్లు పంచుకోవాలని చూసింది. ఆ విషయంలో సోనియా, రాహుల్‌గాంధీలతో ఆమె చర్చలు జరిపింది. పాలేరులో పోటీచేసేందుకు మొదటినుండి ఆ నియోజకవర్గంపై దృష్టి సారించింది. అక్కడ తన పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అంతాజేసి ఆమె కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేందుకు జరిపిన చర్చలు బెడిసి కొట్టినట్లు వినికిడి. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బింకానికి పోయింది. తన తల్లి, భర్తనుకూడా పోటీలో దింపుతున్నట్లు ప్రకటించింది. కాని, ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడిన రోజున్నే తమ పార్టీ  కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు షర్మిల ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీంతో దాదాపు రెండెళ్ళుగా  ఆ పార్టీ పటిష్టకు కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయంపట్ల తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. కాంగ్రెస్‌కు అమ్ముడు పోయిందంటూ వారు ఆరోపిస్తునారు.

కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా అకస్మాత్తుగా తన స్టాండ్‌ ‌మార్చుకుంది. తెలంగాణలో తాము పోటీచేయబోవటం లేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కాసాని జ్ఞానేశ్వర్‌ అటు పార్టీకి రాజీనామా చేసి ఇటు కేసిఆర్‌ ‌సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. అయితే ఈ పార్టీ పోటీ చేయవొద్దని తీసుకున్న నిర్ణయం వెనుక మతలబేంటన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. బిఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక వోటు  చీలవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా ఎవరికి మద్దతుగా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నది ప్రధానాంశమైంది. తెలంగాణలో పవన్‌తో కలిసి పోటీచేస్తారనుకున్నప్పటికీ పవన్‌ ఇక్కడ బిజెపితో కలవడంతో లోపాయికారిగా ఆ రెండు పార్టీలకు మద్దతుగా టిడిపి పోటీనుంచి విరమించుకుందా  లేక తనకు నమ్మిన బంటు అయిన రేవంత్‌రెడ్డికి పరోక్షంగా సహకరించేందుకా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతున్నది.

Leave a Reply